ఇంట్లో అతడు ఆఫీస్‌లో ఆమె

17 May, 2019 00:10 IST|Sakshi

స్త్రీ శక్తి

పిల్లల ఆలన పాలన చూసుకునే తండ్రుల జీవితం ఉల్లాస భరితంగా ఉంటుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఈ మాట చెబుతున్నది మిలిందా గేట్స్‌.. మహిళలు ఉద్యోగంలో నిలదొక్కుకోడానికి తమకంటూ ప్రత్యేకంగా కొన్ని నాయకత్వ లక్షణాలను ఏర్పరచుకోవాలని కూడా ఆమె సూచిస్తున్నారు.

ఇంటిపని ఎంతుంటుందో, ఇంట్లో పిల్లల పని అంతుంటుంది. పిల్లలు మరీ చిన్నవాళ్లయితే ఇంటి పని కన్నా పిల్లల పనే ఎక్కువగా ఉంటుంది! తల్లీ తండ్రీ పడీపడీ చేసినా ఎంతకీ అవని పిల్లల పని తల్లి మాత్రమే ఎంతని చెయ్యగలదు? ఆ తల్లి ఉద్యోగస్థురాలు కూడా అయితే ఇంటిపనీ, ఆఫీస్‌ పనీ బ్యాలెన్స్‌ చేసుకోలేక ఆమెకు ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. అయినా పారిపోయే కర్మ ఆమెకేమిటి? భర్త ఉంటాడు కదా! ఆ మహానుభావుడు ఇంటి పనిలో, కనీసం పిల్లల పనిలో ఒక చెయ్యి వెయ్యకపోవడమే కర్మ. ‘మీ ఇంటి కోసం, మీ భార్య కోసం, మీ పిల్లల కోసం కాదు.. నాయనా, మీకోసం పిల్లల పని చెయ్యండి. పిల్లల పనుల్లో ఫార్టీ పర్సెంట్‌ మీరు చేశారనుకోండి.. మీరెంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? చేసి చూడండి. మీకే తెలుస్తుంది’ అని సర్వేలు చెబుతున్నా మగాళ్లు ఒళ్లొంచడం లేదు. స్మార్ట్‌ఫోన్‌లోంచి తల పైకెత్తడం లేదు.

మగాళ్ల బద్ధకం వదిలించే ఇలాంటి సర్వేలు మన ఇండియాలో తక్కువ కానీ, యు.ఎస్‌.లో ‘స్టడీ ఆఫ్‌ యు.ఎస్‌. ఫ్యామిలీ’ అనే పేరుతో ఏడాదికి రెండు మూడైనా జరుగుతుంటాయి. ముద్దొచ్చినప్పుడు పిల్లల్ని చేతుల్లోకి తీసుకున్నట్లుగా, పిల్లల బాధ్యతల్ని మురిపెంగా తలకెత్తుకుంటే మగవాళ్లు హ్యాపీగా ఉంటుందని తాజాగా ఇంకో సర్వే తన ఫలితాలను వెల్లడించింది. డిప్రెషన్‌ పోతుందట, మందు మానేస్తారట. ఇది తండ్రులకు. పిల్లలకైతే స్కూల్లో ఎక్కువ మార్కులు వస్తాయట. ఆత్మవిశ్వాసంతో పెరుగుతారట. ప్రవర్తన లోపాలు తగ్గడమో, తక్కువగా ఉండడమో జరుగుతుందట. ఈ విషయాన్ని మిలిందా గేట్స్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, తన భర్త బిల్‌ గేట్స్‌ ఎలా తక్కిన తండ్రులకు ఆదర్శం అయ్యారో నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. ఓసారి బిల్‌ గేట్స్‌ తనే స్వయంగా కారు డ్రైవ్‌ చేసుకుంటూ పిల్లల్ని స్కూలుకు తీసుకెళ్లవలసి వచ్చింది.

ఒకరోజు అలా చేయగానే ఆ పని ఆయనకు ఇష్టంగా అనిపించింది. అందుకు కారణం.. కారులో డ్రైవ్‌ చేస్తున్నప్పుడు పిల్లల్తో మాట్లాడే టైమ్‌ దొరకడం. అంతకన్నా కూడా పిల్లలు చెప్పేది వినడం ఆయనకు ఆహ్లాదంగా అనిపించింది. ఇక రోజూ వెళ్లడం మొదలుపెట్టారు. వారానికి ఐదు రోజులు పిల్లల్ని స్కూల్లో దింపి, తను ఆఫీస్‌కి వెళ్లేవారు. కొన్నాళ్ల తర్వాత, పరిసరాల్లోని మిగతా తండ్రులు కూడా పిల్లల్తో కలిసి స్కూలుకు వెళుతూ కనిపించారు! ‘‘పిల్లల్ని స్కూల్లో వదిలివెళ్లడానికి బిల్‌ గేట్స్‌కే టైమ్‌ ఉన్నప్పుడు..  మీకెందుకు టైమ్‌ ఉండదు’’ అని భార్యలు భర్తలతో అంటుండడమే ఇందుకు కారణం అని నాకు పరిచయస్తురాలైన ఒకావిడ నాతో అన్నారు’’ అని మిలిండా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. 

మొదటి ఉద్యోగం
స్కూల్లో చేరిన వెంటనే పిల్లలు స్కూలుకు అలవాటు కాలేరు. అదేవిధంగా  గృహిణి ఏదైనా ఉద్యోగంలో చేరినప్పుడు.. దాదాపుగా అందరూ మగాళ్లే ఉండే అక్కడి వాతావరణానికి వెంటనే అడ్జెస్ట్‌ కాలేదు. పైగా లోపలి వాళ్లు కొత్తగా వచ్చిన వాళ్లను ‘ఔట్‌ సైడర్స్‌’ అన్నట్లే చూస్తారు తప్ప, వాళ్లూ కొంతకాలానికి ‘ఇన్‌సైడర్స్‌’ అవుతారు కదా అన్నంత సహృదయంతో ఏమీ వారితో మెసులుకోరు. పనంటేనే భయం కలిగేలా చేస్తారు. ‘ఈ పని నువ్వెక్కడ చెయ్యగలవు?’ అన్నట్లు చూస్తారు. మిలిందా గేట్స్‌ 1987లో మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు అది ఆమె తొలి ఉద్యోగం. లోపలంతా మగాళ్లే. ఆమె ఒక్కరే మహిళ. ఎవరూ పట్టించుకునేవారు.

ఒకటికి రెండుసార్లు అడిగితే గానీ ఏదీ చెప్పేవారు కాదు. ఉద్యోగం మానేద్దామనుకున్నారు మిలిందా! మానేముందు మరొక్కసారి నిలదొక్కుకునే ప్రయత్నం చేద్దామనుకున్నారు. వెంటనే తన వర్కింగ్‌ స్టెయిల్‌ని మార్చేసుకున్నారు. ఆమె చుట్టూ ఉన్న లీడర్స్‌ని అనుకరించకుండా తనకంటూ ప్రత్యేకంగా ఒక లీడర్‌షిప్‌ క్వాలిటీని నిర్మించుకున్నారు. అప్పుడు తలతిప్పి ఆమెవైపు చూశారు లోపలి వాళ్లంతా! ‘‘నేను చెప్పేదేమిటంటే.. ఆల్రెడీ వేసి ఉన్న దారిలో నడవడం వల్ల మహిళకు గుర్తింపు రాదు. తను కొత్త దారి వేసుకోవాలి. మహిళ అయినప్పటికీ సాధించింది అని కాకుండా, ‘ఆమె కాబట్టి సాధించింది’ అనిపించుకోవాలి’’ అని చెబుతారు మిలిందా.

ఈ సూత్రం మహిళ చేసే ఏ ఉద్యోగానికైనా వర్తిస్తుంది. అయితే ఉద్యోగినిగా మహిళ తనను తను నిరూపించుకోవాలంటే.. ‘ఇంటినీ ఆఫీస్‌నీ బ్యాలెన్స్‌ చేసుకోగలదు’ అని ఇంట్లో కూడా తనను తను నిరూపించుకునే పరిస్థితి ఉండకూడదు. భర్త ఆమెకు ఇంటి పనుల్లో కొంచెమైనా హెల్ప్‌ చెయ్యాలి. ఆమెకు హెల్ప్‌ చెయ్యడం అంటే.. ఆమె బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ఉంచమని కాదు. ఆఫీస్‌కు టైమ్‌ అవుతున్నా ఆమెను వదలనివ్వక మీదకు ఎగబాకుతున్న పిల్లల్ని చేతుల్లోకి తీసుకోవడం. ‘మమ్మీ నా సాక్స్‌ కనిపించడం లేదు’ అని సతాయిస్తున్న పిల్లలకు సాక్స్‌ని వెతికి ఇవ్వడం. ఇలాంటివి ఎన్ని పనులుండవూ ఆమెకు హెల్ప్‌ చెయ్యడానికి?! 
 

  

మరిన్ని వార్తలు