షీ డ్రైవ్‌

8 Mar, 2019 01:49 IST|Sakshi

ఆమె పేరు జె.స్వర్ణ. రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో రోజులు గడవడమే భారమైంది. ఆ సమయంలో ధైర్యాన్ని కూడదీసుకుని తన పిల్లలకు తానే అండగా ఉండాలని నిర్ణయించుకుంది. ఆటో డ్రైవింగ్‌ నేర్చుకుంది. ప్రస్తుతం నెలకు రూ.15వేలు సంపాదించుకుంటూ ఇద్దరి ఆడపిల్లల్ని పాలిటెక్నిక్‌ చదివిస్తోంది. స్వర్ణ ఒక్కరే కాదు.. భర్త సంపాదించే ఆదాయం చాలక ఇబ్బందులు పడే మహిళలు ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణాలతో ఆటోలు కొనుక్కుని, ఆత్మవిశ్వాసంతో రయ్‌..రయ్‌ అంటూ దూసుకుపోతున్నారు.  

నిబంధనలు పాటిస్తూ.. నమ్మకంగా....
నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని సీవీఆర్‌ స్కూల్‌లో చదివే దూర ప్రాంత విద్యార్ధులను వారి ఇళ్లకు తీసుకువెళ్లి, తీసుకువచ్చేసౌకర్యం నగరపాలక సంస్థ అధికారులు కల్పించారు.  ఈవిధంగా విద్యార్ధులను తీసుకు వెళ్లి వచ్చినందుకు ఒక్కొక్క ఆటోకు రూ.9000 చెల్లిస్తారు. అంతేకాకుండా మహిళా ఆటో డ్రైవర్లు అంతా కలిసి నగరంలోని కొన్ని ప్రైవేటు స్కూల్స్‌ యాజమాన్యాలను సంప్రదించారు. మహిళలు కావడంతో పాటు నిదానంగా ఆటోలు నడపడం, ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటిస్తూ ఉండటం, విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఉండటం, సెలవు పెట్టకుండా ప్రతిరోజువిద్యార్థులను సకాలంలో తీసుకువస్తూ ఉండటంతో తమకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని అమరావతి షీ ఆటో యూనియన్‌ కార్యదర్శి బండారు లక్ష్మి సాక్షికి తెలిపారు. విద్యార్థులను పాఠశాలలకు చేర్చిన తరువాత మిగిలిన సమయంలో  కిరాయిలు తోలుకుంటారు. కాగా కొంతమంది మహిళా ఆటో డ్రైవర్లు నేరుగా కిరాయికు ఆటోలను నడుపుకుంటున్నారు. 

సౌకర్యాలు అరకొరే....
మహిళా ఆటో డ్రైవర్లకు నగరంలో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. వాస్తవంగా షీ ఆటో డ్రైవర్లను ప్రోత్సహిస్తామంటూ అధికారులు హామీలు ఇచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా షీ ఆటో స్టాండ్‌ ఏర్పాటు చేసి అక్కడే రెస్ట్‌రూమ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే నాలుగేళ్లు అయినా అవి కార్యరూపం దాల్చలేదు. అయినా చేతిలో ఉన్న వృత్తిని వదులుకోలేక డ్రైవర్లుగా కొనసాగుతున్నారు. రైల్వేస్టేషన్‌ బస్టాండ్‌ వద్దకు వెళ్లితే అక్కడ ఉన్న పురుష డ్రైవర్ల అహంకారానికి గురి కావల్సి వస్తోంది. ‘మీరు మాకు పోటీనా’ అంటూ చీదరించుకుంటున్నారని ఈ మహిళలు వాపోతున్నారు.

అయితే కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని దొరికినంత కిరాయిలకు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నామని చెబుతున్నారు. సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీరు ఆటోలు నడుపుతున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా వున్న వారు రాత్రి 9 గంటల వరకు నడుపుతున్నారని చెబుతున్నారు. ఆటో డ్రైవర్‌ నడపడం ద్వారా రోజుకు రూ.700 వరకు సంపాదిస్తే రూ.300 సీఎన్‌జీ, ఇతర ఖర్చులకు పోయినా రూ.400 వరకు ఇంటికి తీసుకువెళ్లుతున్నామని వారు సంతృప్తిగా చెబుతున్నారు. 
శ్యామ్‌ ప్రకాష్, సాక్షి, విజయవాడ 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా