మహాభారత ప్రమదావలోకనం

10 Oct, 2016 00:15 IST|Sakshi
మహాభారత ప్రమదావలోకనం

కొత్త పుస్తకాలు
రచన: డాక్టర్ ప్రభల (నముడూరి) జానకి; పేజీలు: 468; వెల: 250; ప్రతులకు: రచయిత్రి, 206, Leiah అపార్ట్‌మెంట్స్, బి-15, వసుంధర ఎన్‌క్లేవ్, ఢిల్లీ-110096; ఫోన్: 91-9000496959
‘మహాభారతంలో స్త్రీ పాత్రలు జీవితానికి అర్థం చెప్పి అన్వయించుకోవటం నేర్పుతాయి. జీవితానికి ఉన్న పరమార్థాన్ని వీక్షించుమంటాయి. జీవితం ఎపుడూ ఉరుకులుపెట్టే ప్రవాహంలా కాక సంగమాన్ని చేరే నదిలా ఉండాలని నొక్కి వక్కాణిస్తాయి’ అంటారు ప్రభల జానకి. అట్లా ఆ పాత్రల మీది ప్రత్యేకమైన ఆరాధనతో మహాభారతం, కవిత్రయ భారతంలోని 380 మంది స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలను ఆవిష్కరించారు రచయిత్రి.
 
 వెలుతురు తెర
 కవి: బొల్లోజు బాబా; పేజీలు: 112; వెల: 100; ప్రతులకు: కవి, 30-7-31, సూర్యనారాయణపురం, కాకినాడ. ఫోన్: 0884-2368189
 ‘రోజుకోరకంగా రూపు దిద్దుకొంటున్న జీవితాన్ని దాని సర్వసారాంశంతో పట్టుకొని- కవిత్వం చేయటం- లోతయిన అధ్యయనం, నిత్య సాధన ద్వారానే సాధ్యమవుతుందని- బాబా ఈ పాటికి గుర్తించివుంటాడు. (అతడిలో) గొప్ప Sensibility వుంది, గొప్ప చూపు వుంది, జీవితాన్ని ప్రకృతిని చూపి పరవశించే గుణముంది, మొద్దు బారనితనముంది, మొగలిపొదలా నిలబడే తత్వముంది’. అలాంటి కవి కవితాసంపుటి ఇది.
 
 కుర్చీ
 కవి: వనపట్ల సుబ్బయ్య; పేజీలు: 200; వెల: 100; ప్రతులకు: కవి, భార్గవి హెయిర్ స్టైల్స్, నల్లవెల్లి రోడ్, నాగర్‌కర్నూల్-509209; ఫోన్: 9492765358
 ‘సామాజిక యుద్ధజీవి సాగిస్తున్న సృజన వ్యాపారమే ఇతని కవిత్వం. జీవితం నుంచీ, జీవన సమరం నుంచీ నిర్మించుకున్న ప్రాపంచిక దృక్పథాన్ని తన కవిత్వానికిస్తాడు సుబ్బయ్య’. ‘ఇరుకు సందుల గుండా గొందుల గుండా నడిచినప్పుడే ప్రధాన రహదారికి చేరుకుంటాం. అలాగే పుట్టిన కులం, ప్రాంతం, వర్గం, మతం, లింగం- ఆ ప్రత్యేక అస్తిత్వ స్పృహ ద్వారానే విశ్వజనీనతకు చేరువ కాగలుగుతాం. ఈ విషయం ఈ కవికి అలవోకగా పట్టుబడింది’.
 
 ఆంధ్ర దేశ చరిత్రలో కొత్త కోణాలు
 రచన: ఆచార్య వెలమకన్ని సుందరరామశాస్త్రి; సంపాదకులు: డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, డాక్టర్ వి.వి.సుబ్బారెడ్డి; పేజీలు: 170; వెల: 100; ప్రతులకు: వి.కన్యాకుమారి, 202, విశ్వలక్ష్మి టవర్స్, రవీంద్రనగర్ 3వ లైను, గుంటూరు; ఫోన్: 0863-2320760
 ‘చరిత్ర రచనాశాస్త్రంలోనూ, శాసన పఠనంలోనూ పట్టు గలిగిన శాస్త్రిగారు, అందుబాటులో ఉన్న చరిత్రతో రాజీపడక, మళ్లీ శాసనాలను పునఃపరిశీలన చేసి, తెలుగు నేలను పాలించిన విష్ణుకుండినులలాంటి వంశీయుల చరిత్రను సమగ్రంగా ఆవిష్కరించారు. చరిత్ర, సంస్కృతికి సంబంధించి చరిత్రలో శాసనాల ప్రాముఖ్యత, వైదిక వాఙ్మయము- వేంకటేశ్వరుడు, ఆంధ్ర శిల్పము- గుహాలయ వాస్తువు (లాంటి) శీర్షికల క్రింద అపురూపమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలను చక్కగా శోధించి మనకందించారు’.
 
 తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం
 రచన: వై.వై.రెడ్డి యానాల; పేజీలు: 430; వెల: 399; ప్రతులకు: రచయిత, 1-6-141/25/1, బైపాస్ రోడ్, విద్యానగర్, సూర్యాపేట-508213; ఫోన్: 9908979054
 ‘రాజులు రాజవంశీయులు చేసిన యుద్ధములు, వారి జయాపజయాలు, సంధులు, వారి పాలనా వ్యవస్థ’ ‘జాతి పురోగతి, సాంఘిక ఆర్థిక మత పరిస్థితుల మధ్య ప్రజల జీవన విధానాల సంపర్కాల సమ్మేళనం’ ‘పూర్వీకులు నిర్మించిన కట్టడాలు, రాజప్రాసాదాలు, ఆలయాలు, మనోజ్ఞ శిల్ప స్థంభాలు’ (ఈ) మూడింటికి ‘సముచిత స్థానం’ కల్పిస్తూ ‘చారిత్రక పూర్వయుగం నుండి ఆధునిక యుగం 2014 జూన్ 2 వరకు’ సాగిన తెలంగాణ చరిత్ర ఇది.
 
 కవితలు
 కొన్ని చినుకులూ కొంత వాన, చెదిరిపోతున్న
 చూరులో పిచ్చుకలు చూసాక
 వాటి అరుపులకు అల్లాడిపోయే
 దాని పేరు మా అక్క.
 
 పుస్తకం చింపి పడవ చేసిన
 తమ్ముణ్ణి కొట్టే నాకు
 రేపు వరదొస్తే, చెరువు గండికాడ
 చేపలు పట్టాలనే కల.
 
 పుల్లలు దాచుకునే అమ్మకి
 గేదెల్ని లోపల కట్టేసే నాన్నకీ ఎప్పుడన్న
 భయమేసిందో లేదోగానీ
 మట్టిపొయ్యి తడిసి అంటుకోక మా అమ్మపడే యాతనే మా అందరి వానాకాలం.
 
 - కాశిరాజు
 9701075118
 
 దగ్ధాంతరంగం
 
 విత్తులో బ్రహ్మాండం ఉందంటావు నువ్వు
 నాకేమో, మొలకెత్తని ప్రతి గింజా మృతశిశువే
 మొక్క, ప్రపంచాన్ని నిలబెడుతుందంటావు
 మొక్కై ఒంగకూడదని మొక్కుకుంటాన్నేను
 
 పువ్వు, పరమ లలితమంటావు నువ్వు
 కాయల్ని కనకుండానే కమిలిపోతున్న
 పూల కాఠిన్యం నాకు తెలుసు
 దూది, చాలా తేలికంటావు నువ్వు
 అది, కొన్ని కొండల బరువుల్ని
 మీద కుమ్మరిస్తుందని నా అనుభవం
 
 పత్తిచేను, నూతన వస్త్రంలా కనిపిస్తుందంటావు
 అది, కలలో కూడా
 ఉరితాడులా కనిపించకూడదని ప్రార్థిస్తుంటాన్నేను
 - ఎమ్వీ రామిరెడ్డి
 9866777870
 
 ఈవెంట్
 బతుకమ్మ బతుకు చిత్రం సమ్మేళనం
 తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో ‘బతుకమ్మ బతుకు చిత్రం’ కవి సమ్మేళనం నేడు సాయంత్రం 5:30కు తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, హైదరాబాద్‌లో జరగనుంది. అధ్యక్షత: శ్రీరామోజు హరగోపాల్. ముఖ్య అతిథి: అమ్మంగి వేణుగోపాల్.
 
 చలసాని సాహిత్యం ఆవిష్కరణ
 విప్లవ రచయితల సంఘం, సిటీ యూనిట్ ఆధ్వర్యంలో- చలసాని ప్రసాద్ మొదటి వర్ధంతి సందర్భంగా, ‘చలసాని ప్రసాద్ సాహిత్య సర్వస్వం-1’ ఆవిష్కరణ అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్‌లో జరగనుంది. ఆవిష్కర్త: కాకరాల. అధ్యక్షత: గీతాంజలి. వక్తలు: అమ్మంగి వేణుగోపాల్, బజరా, ఎస్.చంద్రయ్య, వరవరరావు.
 
 బహుజన సాహిత్య సదస్సు
 బహుజన రచయితల సంఘం ఆధ్వర్యంలో, అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా, అక్టోబర్ 16న ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ హాల్‌లో బహుజన సాహిత్య సదస్సు జరగనుంది. అధ్యక్షత: వనపట్ల సుబ్బయ్య. ముఖ్య అతిథి: జి.లక్ష్మీనరసయ్య. జి.ఎస్.రామ్మోహన్, సూరేపల్లి సుజాత, స్కైబాబ, హెచ్చార్కె, పి.వి.విజయ్‌కుమార్ తదితరులు ముఖ్య అతిథులు.
 

మరిన్ని వార్తలు