శుంఠలు పదివేలు

16 Feb, 2018 00:46 IST|Sakshi

మళ్లీ చెప్పుకుందాం!

రీటోల్డ్‌ కథలు – 06

‘ఓరి శుంఠా’ అని అనుకుంది. రొప్పుతున్నాడు. రెచ్చుతున్నాడు. గోడకు చేయి ఆనించి ఎటో ముఖం పెట్టి నిలుచున్నాడు. ఇలాంటి టైములో భలే వేగం వస్తుంది. చిన్న బ్యాగు తీసుకుంది. కొన్ని బట్టలు సర్దుకుంది. పసికందును ఒడిలో తీసుకుని తండ్రి వెంట ఇంటి నుంచి బయట పడింది. ఆటో కుదుపులు ఇస్తుంటే ఆదమరిచి నిదురిస్తున్న పాపను గుండెలకు అదుముకుంటూ ‘మెల్లగా అన్నా’ అంది డ్రైవర్‌తో.
మళ్లీ పాప వైపు చూసింది. మొండిఘటం. ఎంత కంగారు పెట్టింది. ఆరునెలల క్రితం ఆ రోజు అతను ఆఫీసుకు వెళుతుంటే తనూ ఆఫీసుకు బయలు దేరుతుంటే సడన్‌గా ఏదో అయ్యింది. ఏమిటది... కడుపులో నుంచి ఏదో తన్నుకొస్తున్నట్టుగా... లోపలి నుంచి ఏదో బయట పడిపోతున్నట్టుగా. కళ్లు తిరుగుతున్నాయి. కింద నుంచి స్రావం. అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చింది.దగ్గరగా చిన్న క్లినిక్‌ ఉంటే ఆ డాక్టరమ్మ పరీక్షించి చూసి ‘అబార్షన్‌’ అంది.‘పెళ్లయిన మొదటి రెండుసార్లలో ఇలా అబార్షన్‌ అవడం కొంతమందిలో మామూలే. ఇక మీదట కడుపు నిలబడి మంచి పిల్లలు పుడతారు’ అని చెప్పింది.అది ఒక బాధ. ఆఫీసులో మాటలు పడాల్సి రావడం మరో బాధ.

‘ఈ ఆడవాళ్లకు ఏం పని లేదు. పురుళ్లని ఒకసారి అబార్షన్లని మరోసారి హాయిగా సెలవులు దొబ్బుతుంటారు’ అంటుంటారు కలీగ్స్‌. ఆడవాళ్లందరూ అన్నిసార్లు సపోర్ట్‌గా ఉంటారని చెప్పలేము. బాగా పని చేసేవాళ్లకు ఆడవాళ్లైనా మగవాళ్లైనా శత్రువులే. వాళ్లూ వంత పాడతారు. సరే. వాళ్లంటే పరాయివాళ్లు... ఎవరోలే అని అనుకోదగ్గవాళ్లు.ఇంటి మనిషి?అరె... భార్యకు అబార్షన్‌ అయ్యిందే దగ్గర కూర్చుని నాలుగు సాంత్వనం మాటలు మాట్లాడదామే అని లేదు. తను ఆఫీసుకు వెళ్లలేదు కనుక ఆ జీతం డబ్బు ఎలా తెచ్చుకుందామా అని హడావిడి పడి తెచ్చుకున్నాడు. అప్పుడనే ఏముంది? ఒకటో తేదీ వస్తున్నదంటే ఏమిటో రైలు బండి తప్పిపోయేవాడిలాగా కంగారు కంగారుగా ఉంటాడు. ఆ డబ్బు తెచ్చివ్వాలి. అతను తీసుకోవాలి. అప్పుడే నిశ్చింత. అసలు తనను పెళ్లి చేసుకున్నాడా ఒకటో తేదీనా అని సందేహం.
ఒకటో తేదీనే అని ఇవాళ తేలి పోయింది.ఇంట్లో  పెద్ద గొడవ అయ్యింది. కారణం ఉద్యోగం నుంచి ఊస్టింగ్‌ ఆర్డర్‌ ఇచ్చారు.పాప పుట్టి జీవితం సంతోషంగా ఉండబోతుంది అనుకుంటున్నప్పుడు ఈ దెబ్బ.ఆఫీసును కూడా అనడానికి లేదు. అబార్షన్‌ అని అబద్ధం చెప్పి ఒకసారి, ఆ వెంటనే మెటర్నిటీ లీవ్‌ అని మరోసారి వరుసగా సెలవులు వాడుకొని ప్రభుత్వాన్ని చీట్‌ చేసిందంటూ కేసు పుటప్‌ చేసి  ఊస్టింగ్‌ ఇప్పించారు. కలీగ్స్‌ హస్తం ఉంది ఇందులో.

కాని జరిగినదానిలో తప్పెవరిది?ఆ రోజు వీధి చివర డాక్టరు చెప్పింది నిజమే అనుకున్నారు. నెల తర్వాత కూడా పిరియడ్స్‌ రాకపోతే ఈసారి కాస్త పెద్ద డాక్టర్‌ దగ్గరకు వెళితే ఆమె అన్ని పరీక్షలు చేసి అబార్షన్‌ జరగలేదని, ఒక్కోసారి ఎక్కువ బ్లీడింగ్‌ జరిగి అబార్షన్‌ అనిపిస్తుందని, కాని పిండం సేఫ్‌గా ఉండి ఎదిగి పిల్లలు పుడతారని చెప్పింది.సంబరంలో మునిగి, ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉండిపోయిందిగానీ ఆఫీసులో దెబ్బ పడుతుందని అనుకోలేదు.తీరా ఊస్టింగ్‌ ఆర్డర్‌తో వచ్చేసరికి అతడు మండి పడుతున్నాడు.‘పెద్ద ఉద్యోగం చేయడానికి బయలుదేరుతారు. ఏమైనా అంటే పొడుచుకొస్తూ ఉంటుంది. ఏం నీకు రూల్స్‌ తెలియవా? ప్రెగ్నెన్సీ రీకన్ఫర్మ్‌ చేశాక ఇంతకుముందు పెట్టిన అబార్షన్‌ లీవును వేరే లీవు కిందకో లాస్‌ ఆఫ్‌ పే కిందకో మార్చుకోవాలని నీకు తెలియదా?’‘నాకు తెలియలేదు. మీరూ ఎంప్లాయీయే కదా. మీరు చెప్పొచ్చుగా’‘నాకిదే పట్టింది. నీ ముట్లు లెక్కబెట్టుకోవడమే నా పనా’‘మరి నా జీతం నోట్లు లెక్కబెట్టుకోవడం మీ పనా?’ చెంప ఛెళ్లుమంది. తండ్రి ఉన్నాడని కూడా చూడలేదు.

‘మావయ్యా. నేను యోగ్యుణ్ణి. లక్షమంది వచ్చారు చేసుకోవడానికి. కాని మీ అమ్మాయి ఎంప్లాయి అని చేసుకున్నాను. పెళ్లికి నా షరతు కూడా అదే. ఇప్పుడు వెర్రిమొఖం వేసుకుని ఉద్యోగం పోగొట్టుకుంది. ఆమెకు ఉద్యోగం ఉంటే సరి. ఎలా తెచ్చుకుంటుందో తెచ్చుకోమనండి. లేకుంటే నాకు అక్కర్లేదు’ తెగేసి చెప్పాడు.బిడ్డను తీసుకుని బయటపడింది.పుట్టింటి ఆదరణ కూడా ఒకోసారి ముఖ్యమైపోతుంది. పాపను తల్లిదండ్రులకు అప్పజెప్పి తెల్లారి నుంచి కాలికి బలపం కట్టుకుని ఉద్యోగం కోసం తిరగడం మొదలుపెట్టింది. పై ఆఫీసర్లను కలిసి, అర్జీలు పెట్టి, తెలిసిన వారితో చెప్పించి... పెద్ద ప్రయాస. చివరకు శుభవార్త అందింది. ఉద్యోగం ఇస్తారట. అయితే పాత అనుభవం అంతా నల్లిఫై చేసి కొత్త అపాయింట్‌మెంట్‌ ఇస్తారట. మంచిదే. ఏదో ఒకటి. ఉద్యోగం అయితే ఉందిగా. మధ్యలో రెండు మూడుసార్లు అతడు వచ్చి చూసి వెళ్లాడు. రమ్మనలేదు. తాను వస్తాననలేదు.ఇప్పుడు వచ్చాడు. ఇలాంటి సందర్భాల కోసమే పావుకిలో స్వీట్‌ పేకట్లు ఉంటాయి. అలాంటిది తెచ్చాడు.ఆ స్వీటులోని స్వీటే పెట్టి, కొంచెం కారా ఇచ్చి తిన్నాక వీధి తలుపు చూపించింది.‘అదేమిటి?’ అన్నాడు హతాశుడవుతూ.‘నీక్కావల్సింది పెళ్లాం కాదు. పాస్‌బుక్కు. నీ దోవ నువ్వు చూసుకో’ ‘బాగా ఆలోచించుకో’‘ఆలోచించుకున్నా. వెళ్లవోయ్‌’వెళ్లిపోయాడు. లేచి తల దువ్వుకుని స్థిరంగా తొణకనిదానిౖయె లాయర్‌ దగ్గరకు బయలుదేరింది.కథ ముగిసింది.ఇంద్రగంటి జానకీబాల ‘జీవన రాజకీయం’ కథ ఇది.ఆఫీసుల్లో చాలా రాజకీయాలు ఉంటాయి. కాని కుటుంబంలో అందునా భర్త దగ్గర రాజకీయం ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. జీవించడానికి సంపాదనలో ఆమె సాయాన్ని ఆశించవచ్చు. కాని ఆమెనొక రాబడి యంత్రంగా మార్చడానికి రాజకీయం చేస్తే సహించాల్సిన అవసరం లేదు. కల్లబొల్లి కబుర్లు చెప్పి భార్యను కొత్తగా చదివించేవాళ్లు, ఉన్న ఉద్యోగంలో ఉంచకుండా డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు రాయించేవాళ్లు, ఏదో ఒక మాట చెప్పి మస్కట్‌ విమానం ఎక్కించేవాళ్లూ, ఉద్యోగం చేయలే నంటున్నా బలవంతంగా చేయించి సాధించేవాళ్లు, నెల తిరిగేసరికి డబ్బు తేని పక్షాన అల్పంగా చూసేవాళ్లు వీళ్లు భర్తలా? శుంఠలు.
పునః కథనం: ఖదీర్‌
ఇంద్రగంటి జానకీ బాల 

మరిన్ని వార్తలు