ఏదైనా ఫేస్‌ చేస్తారు

26 Aug, 2019 06:50 IST|Sakshi

స్వేచ్ఛకు వేరే భాష ఉంటుంది.. భాష్యం ఉండదు! ఒక గ్రామర్‌ ఉంటుంది... అందరితో సంధికలుపుకొనే వ్యాకరణం ఉంటుంది!! స్వేచ్ఛ అక్షరంలా చాలా పదునైంది సమాజంలోని చెడును చీల్చి చెండాడుతుంది ఫేస్‌బుక్‌లో కొందరు అదే చేస్తున్నారు.. ఫేస్‌ చేస్తున్నారు.. ఏదైనా ఫేస్‌ చేస్తున్నారు!!

శీలం ఫ్రేమ్‌లో ఆడవాళ్లను చూస్తూ నోరుపారేసుకునే మగవాళ్లకు అదే తీరుగా కవిత్వంతో, కార్టూన్లతో కౌంటర్‌ ఇస్తారు.. రాజకీయ తాజా పరిణామాల మీద అద్భుతంగా విశ్లేషిస్తారు... ఆర్థిక వ్యవస్థ గురించి కామన్‌ మ్యాన్‌కు అర్థమయ్యేలా కామెంట్‌ పెడ్తారు.. కశ్మీరుకు స్వాతంత్య్రం ఎందుకు కావాలో చెప్తారు.. అర్జున్‌ రెడ్డి గొప్ప ప్రేమికుడు ఎందుకు కాదో వివరిస్తారు.. మోషే బ్రష్‌లో పొరపాటుగా దొర్లిన జెండర్‌ ఇన్‌సెన్సిటివిటీని ఇట్టే పసిగట్టేస్తారు.. దేశ రక్షణ వలయాన్ని.. టెర్రరిస్ట్‌ల చొరబాటును నిష్కర్షగా నిలదీస్తారు.. పలుభాషల సాహిత్య ప్రయోగాలకు తెలుగు అనువాదాన్ని పరిచయవేదికగా మలుస్తారు.. దేవుడి చుట్టూ అల్లుకున్న నమ్మకాల పరిధికి సైన్స్‌ లాజిక్‌ లోతును చూపిస్తారు.. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా స్త్రీ ఎదగాల్సిన సామాజిక అవసరాన్ని గుర్తిస్తారు.. పవర్‌ పాలిటిక్స్‌ను ఎదుర్కోవడానికి చదువును మించిన ఆయుధం లేదని సూచిస్తారు...

ఎక్కడ? ఫేస్‌బుక్‌లో! ఎవరు? బాధ్యతగల పౌరులు... సమాజం పట్ల కన్‌సర్న్‌ ఉన్న మనుషులు.. రచయిత్రులు. ఓహ్‌.. ఇంత ఉపోద్ఘాతం స్త్రీ వాదం గురించేనా అని పెదవి విరువవద్దు. మహిళలు ఏం చెప్పినా స్త్రీవాదాన్ని ప్రమోట్‌ చేసుకోవడానికే అనే ప్రిజుడీస్‌ను  వదిలిపెడితే అర్థమవుతుంది..  అన్ని రంగాల మీద వాళ్లకున్న అవగాహన, ఆలోచనలు, అభిప్రాయాలు. వాళ్ల రచనలు స్త్రీల ప్రతిభనే కాదు స్త్రీల ఆత్మగౌరవాన్నీ చాటుతున్నాయి. ఈ ఫ్రెండ్స్‌ లిస్ట్‌తో ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ నిజంగా ఒక పుస్తకమే.  రాజకీయ, ఆర్థిక, సామాజిక , సాంస్కృతిక చరిత్రకు ఆధారాలుగా శిలాశాసనాలు, తాళపత్రాలు, గ్రంథాలే నిలిచాయి. ఇప్పటి నుంచి ఫేస్‌బుక్‌లోని ఈ టైమ్‌లైన్స్‌ కూడా ఆర్కైవ్స్‌లో భద్రం కావాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం గురించి భవిష్య త్తరాలు తెలుసుకోవడం కోసం.   ట్రోలింగ్స్‌కి వెరవకుండా.. ట్రోలర్స్‌ బయోగ్రఫీని వాల్స్‌ మీద పోస్ట్‌ చేస్తూ ఒకరకంగా అక్షరపోరాటం చేస్తున్న ఆ రచయిత్రుల ఇంట్రడక్షనే ఈ కథనం. సందర్భం ఏంటీ అని వెంటనే రెండు కనుబొమలు కలుసుకోవచ్చు. మంచి పరిచయానికి ప్రత్యేకమైన సందర్భం ఉండాల్సిన అవసరం లేదేమో!

సుజాత సూరేపల్లి
శాతవాహన యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ఆమె.. రాజకీయ, సాంఘిక అంశాలకు ఎన్‌సైక్లోపీడియా. ఎంతటి సీరియస్‌ విషయాన్నైనా రెండు వాక్యాల్లో కుదించి అందరికీ అర్థమయ్యేలా సూటిగా రాయడం ఆమె ప్రత్యేకత. బయటే కాదు ఫేస్‌బుక్‌లో కూడా ఉద్యమాలతోనే  ఉనికి చాటుకుంటూ వస్తున్నారు. కుల, మత, పురుషాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా గళాన్ని వినిపించడమే కాదు ఫేస్‌బుక్‌లో కలాన్నీ సంధిస్తున్నారు. మహిళల గురించి నోరుపారేసుకుంటున్న వాళ్లకు భయం రుచి చూపించారు. ‘‘ఆడవాళ్ల రాతలు నగలు, చీరలు, వంటలు, వెన్నెల రాత్రుల మీదే అనుకుంటారు. ఫస్ట్‌ నుంచీ నా ఫేస్‌బుక్‌ పేజీ పొలిటికల్, సోషల్‌ మూవ్‌మెంట్‌గానే ఉంది. వీటితోనే నేను ప్రజలకు కనెక్ట్‌ అయ్యాను.. ప్రజలు నాకు కనెక్ట్‌ అయ్యారు. ఎఫ్‌బీ వల్ల నాకూ చాలామంది యాక్టివిస్ట్‌లతో పరిచయం అయింది. అయితే రోహిత్‌ వేముల ఆత్మహత్య, ప్రణయ్‌ (అమృత భర్త) హత్య తర్వాత కులానికి సంబంధించి చాలామంది ఇన్నర్‌సెల్స్‌నూ బయటపెట్టింది ఫేస్‌బుక్‌. యాక్చువల్‌ ఫేసెస్‌కు అద్దంలా ఉంది ఫేస్‌బుక్‌’’ అంటారు సుజాత.

పద్మావతి బోడపాటి
దూరదర్శన్‌ యాదగిరి– నల్గొండ రిలే స్టేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న పద్మావతి. వైవిధ్యమైన అంశాలను స్పృశిస్తారు,అనువదిస్తారు. ఫేస్‌బుక్‌ పాఠకుల కోసం ప్రస్తుతం ఫ్రెంచ్‌ రచయిత సిమోన్‌ ది బువా రచించిన ‘ది సెకండ్‌ సెక్స్‌’ను తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘‘డాక్టర్‌ యడవల్లి రమణ గారి ప్రోత్సాహంతోనే ఎఫ్‌బీలో రాయడం మొదలుపెట్టా. నిజం చెప్పాలంటే నా రచనాశక్తిని అంచనా వేసుకోవడానికే ఎఫ్‌బీలో రాయడం స్టార్ట్‌ చేశా.  ప్లాన్డ్‌గా  డిసిప్లిన్డ్‌గా రాసే అలవాటు లేదు. ఇలా రాయాలి.. అలా రాయాలి అనీ అనుకోను. ఏ రోజు ఏమనిపిస్తే అది రాసేస్తాను. ఫేస్‌బుక్‌లో మనం పోస్ట్‌ చేసిన వెంటనే వచ్చిన రెస్పాన్స్‌ చాలా ఉత్సాహాన్నిస్తుంది.  అలాగే ఎఫ్‌బీలో విభిన్నమైన విషయాల మీద రాసే రచనలను చదవొచ్చు. జ్ఞానాన్ని  మించిన ఆయుధం లేదు. అందుకే ముందు మనం జ్ఞానవంతులం కావాలి. జ్ఞానంతో ఎంపవరవుతాం’’ అంటారు పద్మావతి.

ఉషా తురగ రేవెల్లి...
వ్యంగ్యం ఆమె అస్త్రం. ఇడ్లీ, కాఫీ, నీడ, ట్రాఫిక్, పాట, భాష, కోతి, కోడి, కంప్యూటర్, కారు, తల్లి, పిల్ల, బామ్మ, తాత, ప్రేమ, కోపం, అలక, ఒంటరితనం, జీవితం, లోకం.. ఇలా ఏవీ.. ఎవరూ ఆమె రైటప్‌కి అనర్హం కాదు.. అనర్హులు కారు. ప్రస్తుతం వ్యంగ్యరచనలు చేసే అతికొద్దిమందిలో ఉషా తురగ రేవెల్లి ఒకరు. ప్రస్తుతం ప్రసారభారతిలో పనిచేస్తున్నారు ఆమె. అంతకుముందు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, డెక్కన్‌క్రానికల్‌లో పనిచేశారు. ఇప్పుడు కూడా పలు పత్రికలకు వ్యాసాలు రాస్తూంటారు. ‘‘ఎఫ్‌బీ ఒక ఊరటగా, కౌన్సెలర్‌గా, సంఘీభావంగా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌లేని చోట ఒక సపోర్ట్‌సిస్టమ్‌గా పనిచేస్తోంది. చర్చలకు ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది మంచిదే. ఆ చర్చలన్నీ కార్యరూపం దాల్చాలి. మోర్‌ కన్‌స్ట్రక్టివ్‌గా సాగాలి.. సాగేందుకు అవకాశం ఉంది. సోషల్‌ఛేంజ్‌కు ఫేస్‌బుక్‌ మంచి ఉపకరణంగా మారితే బాగుంటుంది’’ అంటారు ఉషా తురగ రేవెల్లి.

సౌమ్య ఆలమూరు
నిజానికి ఆమె ఎకానమిస్ట్‌. కాని ప్రస్తుతం బీబీసీ (ఢిల్లీ)లో ఈఎల్‌టీ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  రాయడమంటే ఆమెకు ఇష్టం. అందుకే ఫేస్‌బుక్‌ వాల్‌నే పుటగా మలచుకున్నారు. ఢిల్లీ మెట్రో కథలు రాసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.  కామన్‌ థింగ్‌ నుంచి కంట్రీ పాలసీస్‌ దాకా అన్నిటి మీదా స్పందిస్తారు. సహేతుకంగా విమర్శిస్తారు. ‘‘ఫేస్‌బుక్‌లో రాయడంలో ఉన్న అడ్వాంటేజ్‌ ఏంటంటే.. ఇదిలాగే రాయాలి, ఫలానా పద్ధతిలోనే చెప్పాలి అనే ఫ్రేమ్‌ ఉండదు. నచ్చినవి నచ్చినట్టు రాసేయొచ్చు. ఘాటుగానూ చెప్పొచ్చు. అభిప్రాయాలకైనా , కథలకైనా ఇమిడియెట్‌ రీచ్‌ ఉంటుంది. ఒక అంశానికి సంబంధించి డిఫరెంట్‌ అండ్‌ మల్టిపుల్‌ యాంగిల్స్‌ తెలుస్తాయి. అన్నిటికీ మించి రచయితకు పాఠకుడికి కనెక్టివిటీ ఉంటుంది. పాఠకుడి అభిప్రాయమూ వెంటనే తెలుస్తుంది. వాల్‌ మీద్‌ కాకుండా ఇన్‌బాక్స్‌లో తమ అభిప్రాయాలను తెలిపే  సైలెంట్‌ రీడర్స్‌ కూడా ఉంటారు. ఎఫ్‌బీ వల్ల టేమ్‌ వేస్ట్‌ అంటుంటారు కాని నేను చాలా నేర్చుకున్నాను. క్రిస్ప్‌గా, షార్ట్‌గా రాయడం తెలిసింది. అన్నిటికన్నా ముఖ్యంగా యువన్‌ నోహా హారారి తన ‘21 లెసన్స్‌ ఫర్‌ ట్వంటి ఫస్ట్‌ సెంచురీ’ అనే పుస్తకంలో చెప్పినట్టు అడాప్ట్‌ చేసుకోవడం వస్తుంది.  ఏ చర్చ అయినా, రచన అయినా చదువైనా అడాప్ట్‌ చేసుకోవడాన్నే నేర్పాలి’’ అంటారు సౌమ్య.

స్వాతి వడ్లమూడి
ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. సోషల్‌ మీడియా కార్టూనిస్ట్‌ కూడా.  ఆమె అక్షరానికి భయం ఉండదు. ఆమె కుంచెకు వెరుపు ఉండదు. ఆమె భావానికి మొహమాటం ఉండదు. రాత అయినా.. కార్టూన్‌ అయినా ప్రజల పక్షమే. ఇంకా చెప్పాలంటే బాధితుల పక్షం! రాజకీయాలు, జెండర్, సాహిత్యం ఏదైనా సరే నిర్మొహమాటమే ఆమె వైఖరి.  ‘‘మనకున్న పొలిటికల్‌ అభిప్రాయాలను న్యూస్‌పేపర్లలో నిష్కర్షగా చెప్పే వీలు ఉండదు. వితవుట్‌ రెస్ట్రిక్షన్స్, ఎడిటింగ్‌ మన అభిప్రాయాలను చెప్పే ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్కే. చిన్న చిన్న విషయాల నుంచి సీరియస్‌ ఇష్యూస్‌ దాకా అన్నిటి మీద అనిపించింది అనిపించినట్టుగా రాస్తున్నాను. కార్టూన్స్‌ వేస్తున్నాను.  అయితే అభిప్రాయాలు, ఆలోచనల విషయంలో ఇచ్చిపుచ్చుకునే తీరుతో వ్యవహరించాలి. ముందస్తు భ్రమలు, భ్రాంతుల్లేకుండా విశాల దృక్పథంతో ఉండాలి. అవతలి వాళ్ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూ పట్లా గౌరవం ఉండాలి. మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో కన్నా సోషల్‌ మీడియాతోనే చాలా నేర్చుకున్నాను’’ అంటారు స్వాతి వడ్లమూడి.

రమా సుందరి
గుంటూరులోని గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఫర్‌ విమెన్‌లో ఈసీఈ విభాగాధిపతిగా పనిచేస్తున్న రమాసుందరి  మాతృక మాస పత్రికనూ నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియాలో రైటర్‌గా ఆమెది ప్రత్యేక స్థానం. కుల, మత, లింగ, రాజకీయ, ఆర్థిక, సామాజికాంశాలతోపాటు సినిమాల మీదా రాస్తారు. ఇంగ్లీష్‌ వెబ్‌జర్నల్స్‌ వ్యాసాలనూ తెలుగులో అనువదిస్తారు. ‘‘సమకాలీన ఆలోచనల ప్రతిబింబం ఫేస్‌బుక్‌. నా సీరియస్‌ రాతలు ఫేస్‌బుక్‌ నుంచే ప్రారంభమయ్యాయి. నా అన్‌లెర్నింగ్‌ ప్రాసెస్‌ కూడా ఇక్కడి నుంచే మొదలైంది. అనేకమంది కవులు, రచయితలు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్లు, హక్కుల కార్యకర్తలు, సమాజం కోసం ఆలోచించేవారు ఇక్కడే పరిచయమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే అపరిమితమైన లోకాన్ని నాకు ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. నా పూర్వవిద్యార్థులను చాలామందిని ఫేస్‌బుక్‌ నాకు సన్నిహితంగా ఉంచుతోంది. నేను రాస్తున్న చాలా విషయాలు వాళ్ల జీవిత నిర్మాణానికి ఉపయోగపడ్తున్నాయని వాళ్లు చెబుతుంటే సంతోషంగా ఉంటుంది. ఫేస్‌బుక్‌ను నేనొక సామాజిక పత్రికలాగే ఉపయోగిస్తాను’’ అని చెబుతారు రమా సుందరి.

ఇంకా ఉన్నారు...
చైతన్య పింగళి, అపర్ణాతోట, మెర్సీమార్గరెట్, సాయి పద్మ, రాధా మండువ, మానస యెండ్లూరి.. ఇలా చెబుతూపోతే  ఇక్కడ స్థలం సరిపడని జాబితా ఆ రచయిత్రులది. వీళ్లంతా ఫేస్‌బుక్‌లో తమ రచనలతో కొత్త  దృక్పథాలకు పదును పెడ్తున్నారు. చేతన కలిగించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.   ట్రోలింగ్‌ ఎదురైనా.. బెదిరింపులు వచ్చినా..  వణుకు అంటూ  ఎరుగని ఆ రాతలు ప్రవాహమై సాగుతూనే ఉన్నాయి.. ముతక భావాలను, జిడ్డు ఆలోచనలను కడిగేస్తూ! – సరస్వతి రమ

మరిన్ని వార్తలు