స్త్రీలోక సంచారం

16 Jun, 2018 00:21 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

::: కనౌజ్‌ ఎంపీ డింపుల్‌ యాదవ్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆమె భర్త అఖిలేశ్‌ యాదవ్‌ ప్రకటించారు! రాజకీయాల్లో బంధుప్రీతికి ముగింపు పలికేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతూ, చిత్తశుద్ధి ఉంటే బీజేపీ కూడా తనను అనుసరించాలని అఖిలేశ్‌ సవాల్‌ విసిరారు ::: ఇటలీలో నిర్మాణంలో ఉన్న విహార నౌక ‘న్యూస్టాటన్‌డామ్‌’ను లాంఛనప్రాయగా జలప్రవేశం చేయించేందుకు ప్రఖ్యాత అమెరికన్‌ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రేకు ‘గాడ్‌మదర్‌’గా అవకాశం లభించింది. హాలెండ్, అమెరికా కలిసి నిర్మిస్తున్న ఈ నౌక.. వచ్చే ఏడాది జనవరిలో మధ్యదరా సముద్ర జలాల్లో ప్రయాణం మొదలుపెడుతుంది ::: నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రమండలం నుంచి తనకు కానుకగా తెచ్చి ఇచ్చిన మట్టిరాళ్లను తన నుంచి ‘నాసా’ స్వాధీనం చేసుకునే వీలులేకుండా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వాలని యు.ఎస్‌లోని సిన్సినాటీలో ఉంటున్న లారా చీకో అనే మహిళ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు.

తన పదేళ్ల వయసులో తన తండ్రి స్నేహితుడైన ఆర్మ్‌స్ట్రాంగ్‌ తనకు ఆ మట్టిరాళ్లను ఇచ్చినట్లు లారా కోర్టుకు నివేదించారు ::: బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌ అక్క షహీన్‌.. గతంలో తనక్కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చినట్లు వెల్లడించారు! ‘వోగ్‌’ తాజా సంచికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న స్టార్‌ చెఫ్‌ ఆంథోనీ బోర్డియన్‌ ప్రస్తావన వచ్చినప్పుడు షహీన్‌ ఈ విషయం చెప్పారు ::: అమెరికన్‌ గాయకుడు నిక్‌ జోనాస్, బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారన్న వార్తలు చిక్కనవుతున్నాయి. రెండేళ్లుగా ప్రియాంక ప్రేమలో మునిగి ఉన్న నిక్‌ జోనాస్‌.. ఇటీవలి ఒక పెళ్లివేడుకలో తొలిసారి ప్రియాంకను తన కుటుంబ సభ్యులకు పరిచయం చేయడాన్ని ఏడడుగులకు ముందు పడిన తొలి అడుగుగా అంతా భావిస్తున్నారు ::: వీడియోకాన్‌ కంపెనీకి రుణాలు ఇచ్చిన వ్యవహారంలో అరోపణలు ఎదుర్కొంటున్న ఐ.సి. ఐ.సి.బ్యాంకు సీఈవో చందా కొచ్చర్‌ కనుక ఆ పదవి నుంచి దిగిపోవలసి వస్తే ఆమె తర్వాత ఎవరిని సీఈవోగా నియమించాలనే విషయమై డైరెక్టర్ల బోర్టు సమావేశమైంది. బోర్డు ఎవరిని నియమించినా, ఆ నియామకాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆమోదించవలసి ఉంటుంది ::: లేడీ డయానా దగ్గర ‘రివెంజ్‌ డ్రెస్‌’ ఉందనే విషయం మీకు తెలుసా? అంటూ మీడియా ఒక కథనాన్ని వండి వార్చింది.

గ్రీకు ఫ్యాషన్‌ డిజైనర్‌ క్రిస్టీనా స్టాంబోలియన్‌ తన కోసం డిజైన్‌ చేసిన సంప్రదాయ విరుద్ధమైన డ్రెస్‌ను ధరించడానికి చాలాకాలం పాటు బిడియపడిన డయానా.. తన భర్తకు కామిల్లా పార్కర్‌తో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన రోజు సాయంత్రం ఆ నలుపురంగు డ్రెస్‌ను తొలిసారిగా బయటికి తీసి ధరించారని, అలా అది రివెంజ్‌ డ్రెస్‌ అయిందని బ్రిటన్‌ పత్రికలు విపరీతార్థాలు తీస్తున్నాయి ::: వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలిగితే దేశంలో ఆకలి బాధల్ని నివారించవచ్చని ఐక్యరాజ్యసమితి సంస్థ ‘ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌’ సూచించింది. మొక్కలు నాటడం నుంచి మార్కెటింగ్‌ వరకు ప్రతి దశలోనూ మహిళల సహకారం ఉంటే పంట దిగుబడి 20 నుంచి 30 శాతం వరకు పెరుగుతుందని, తద్వారా ఆకలికి అలమటించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తాజా నివేదికలో వెల్లడించింది. 

మరిన్ని వార్తలు