తాళిబొట్టు కోసం యముణ్ణి వెంటాడినట్టు  వెంటాడింది!

28 Feb, 2018 00:07 IST|Sakshi
సౌమ్య

స్నాచింగ్‌

‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. 
దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా 
ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది 
లేదు’’ అనుకున్నాను. అందుకే  వెంబడించాను. 

 

కేరళలోని కొల్లం జిల్లా, తెవలక్కార పట్టణం. సౌమ్య 28 ఏళ్ల యువతి. చక్కగా చురుగ్గా ఉంటుంది. భర్త టైలర్‌. ఇద్దరు పిల్లలు. శోభన ఐదవ తరగతి, సోనా మూడవ తరగతి. గడచిన వారం వరకు ఆమెను అందరూ ఓ సాధారణమైన సేల్స్‌గాళ్, ఇద్దరు బిడ్డల తల్లిగానే గుర్తించారు. ఇప్పుడామె కొల్లం జిల్లాలోనే సెలబ్రిటీ. సినిమా తారల కంటే ఎక్కువ క్రేజ్‌ ఆమెకిప్పుడు. కన్నుగీటి ఓవర్‌నైట్‌ సెలబ్రిటీ అయిన ప్రియాప్రకాశ్‌ వారియర్‌ కంటే ఈ వారియరే ఇప్పుడు అక్కడ ఫేమస్‌. సీన్‌ అంతగా మలుపు తిరగడానికి ఆమె ఏం చేసింది? సినిమా షూటింగ్‌ను తలపిస్తూ చేజ్‌ చేసింది. చైన్‌ స్నాచర్స్‌ను ఒడిసి పట్టుకుని చాచి కొట్టింది. తన తాళిమాల(మంగళసూత్రం)ను తెచ్చుకుంది. ఉద్యోగం నుంచి సాయంత్రం తన స్కూటీ మీద ఇంటికి వస్తున్నప్పుడు సౌమ్యను ఒక బైక్‌ వెంబడించింది. బైక్‌ మీద ఇద్దరు యువకులు ఆమె పక్కగా బండిని పోనిస్తూ ఆమె మెడలోని తాళిబొట్టు దండను లాక్కున్నారు. క్షణకాలం పాటు ఆగిపోయిన సౌమ్య వెంటనే తేరుకుంది. దారిన పోయే వారికి ఏం జరిగిందో తెలిసేలా ‘దొంగ... దొంగ... పట్టుకోండి’ అని అరుస్తూ స్కూటీ మీద గొలుసు దొంగలను వెంబడించింది. ‘దాదాపుగా మూడున్నర కిలోమీటర్ల దూరం వెంబడించి వారి బైక్‌ ను ఓవర్‌టేక్‌ చేసి వారి ఎదురుగా వచ్చింది. ఆ వేగంలో ఆమె స్కూటీ బైక్‌ను ఢీకొడుతూ ఆగింది. పరుగున వచ్చిన వారు, ఏం జరుగుతుందో తెలియకపోయినా సరే అరుపులతో గుమిగూడిన వారు బైక్‌ నడుపుతున్న యువకుడిని ఒడిసి పట్టుకున్నారు. సౌమ్య అతడి ముఖం మీద పిడిగుద్దులు గుద్దింది. చైన్‌ ఉన్న వాడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపు కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు కూడా రంగంలో దిగారు. పారిపోతున్న దొంగను నిమిషాల్లోనే పట్టుకున్నారు. సౌమ్య దండ సౌమ్యకు చేరింది. కథ సుఖాంతం. 

‘‘మెడలోని దండను వాళ్లు లాక్కుపోతే వెంబడించడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది? అంత దూరం బండి మీద దొంగలను పట్టుకోవడానికి వెళ్లడమంటే చిన్న విషయం కాదు. నువ్వు చేసింది ఎంతటి సాహసమో తెలుసా?’’ అని ప్రశంసాపూర్వకంగా అడిగిన వాళ్లకు ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ‘‘నాకు తాళిమాల చాలా విలువైంది. దానిని లాక్కుపోతే చూస్తూ ఎలా ఉండను? దండ లేకుండా ఇంటికి వెళ్లేది లేదు’’ అనుకున్నాను. అందుకే వెంబడించాను. ఎలాగైనా వాళ్లను పట్టుకుని దండతోనే ఇంటికి వెళ్లాలనే కసితో వెంబడించాను. అందుకే భయం వేయలేదు’’ అంటోంది.
‘అమ్మాయిలంటే ఇలా ఉండాలి’ అని కేరళలో తల్లిదండ్రులు తమ పిల్లలకు సౌమ్యను రోల్‌మోడల్‌గా చూపిస్తున్నారు ఇప్పుడు. కేరళకే కాదు, సౌమ్య మొత్తం దేశానికే మోడల్‌ ఉమన్‌.
– మంజీర

మరిన్ని వార్తలు