స్త్రీలోక సంచారం

7 Aug, 2018 00:13 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

►వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహల్‌ గాంధీ మళ్లీ అమేధీ నుంచే పోటీ చెయ్యొచ్చని తెలుస్తోంది కానీ, ఆయన తల్లి, యు.పి.ఎ. చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అసలు ఈసారి ఎన్నికల్లో నిలబడతారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ సోనియా 2019 ఎన్నికలకు దూరంగా ఉంటే కనుక ప్రస్తుతం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి లోక్‌సభ స్థానం నుంచి ఆమె కూతురు ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రియాంక ఆసక్తి చూపుతారా అనేది మరో ప్రశ్న.

►వంట చెయ్యడం రాదని, ఇంటి పనులు సరిగా చెయ్యడం లేదని భర్త భార్యను తిట్టడం ఆమెను అవమానించడం అవదని 17 ఏళ్ల నాటి ఒక గృహిణి ఆత్మహత్య కేసులో ముంబై హైకోర్టు తీర్పు చెబుతూ, ఆ భర్తని, అత్తమామల్ని కింది కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సమర్థించింది. 2001 జూన్‌ 5 నాటి ఆ ఆత్మహత్య అనంతరం భర్త విజయ్‌ షిండేపై భార్య పుట్టింటి వారు కేసు పెడుతూ.. వంట బాగోలేదనీ, ఇంటిని శుభ్రంగా ఉంచడం లేదని అల్లుడు, అత్తమామలు తమ కూతుర్ని తరచు తిడుతున్న కారణంగానే ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకుందని చేసిన ఆరోపణలపై ఇన్నేళ్లపాటు జరిగిన వాదోపవాదాలలో విజయ్‌కి వేరొక స్త్రీతో సంబంధం ఉందన్న కోణం కూడా ఉంది.

►రోగుల సేవలకు మరింతగా బాధ్యులను చేయడానికి, వృత్తిపరమైన అవకతవకల్ని నివారించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే నర్సులకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ సెప్టెంబరులో ‘నర్సింగ్‌ యునీక్‌ ఐ.డి. (ఎన్‌.యు.ఐ.డి) లను ఇవ్వబోతోంది. నేషనల్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ సభ్యులు, రాష్ట్ర ఆరోగ్య శాఖలోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో తీసుకున్న ఈ కార్డుల జారీ ప్రయోజనాల గురించి నేషనల్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ అధ్యక్షులు టి. దిలీప్‌ కుమార్‌ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డికి వివరించిన అనంతరం దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడింది. 

►జపాన్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌ తనాగో అకీకో డిజైన్‌ చేసిన ఫ్యాన్‌ హ్యాండ్‌బ్యాగ్‌ నమూనా టోక్యో సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శనలో మహిళలను అమితంగా ఆకట్టుకుంటోంది. హ్యాండ్‌బ్యాగ్‌ వెలుపల అమర్చిన ఫ్యాను.. బయటి వాతావరణంలోని వేడిమిలో సంభవిస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టి ఆ సమాచారాన్ని అందిస్తుందని అకీకో చెబుతున్న పాయింట్‌ కన్నా కూడా.. బ్యాగ్‌ డిజైనే ప్రదర్శనకు వస్తున్న మగువల్ని ఎక్కుగా ఆకర్షిస్తోంది.

►భర్త అడుగుజాడల్లో నడవటం అటుంచి, భర్త అడుగుజాడల్ని ఎప్పటికప్పుడు తుడిచేస్తుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలనియా మళ్లీ మరొకసారి.. భర్త వ్యక్తం చేసిన అభిప్రాయాలకు పూర్తి భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికన్‌ ప్రొఫెషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ సి.ఎన్‌.ఎన్‌. టీవీ ఇంటర్వ్యూలో ‘మనల్ని విడదీసేందుకు ప్రయత్నిస్తున్న మనిషి’ అని తనను విమర్శించడంపై ట్రంప్‌ స్పందిస్తూ, ‘బుద్ధిమాంద్యపు వ్యాఖ్యాత డాన్‌ లెమన్‌.. లెబ్రాన్‌ జేమ్స్‌ని ఇంటర్వ్యూ చేయడం చూశాను. లెబ్రాన్‌ ఏబ్రాసీ ముఖాన్ని అందంగా చూపించడానికి అతడు చాలా ప్రయత్నించినట్లు ఉన్నాడు’ అని అన్న కొద్ది గంటల్లోనే... ‘భావి తరాలకు ఉపయోగపడేలా జేమ్స్‌ అనేక మంచి పనులు  చేస్తున్నాడు’ అని మెలనియా ఒక ప్రకటన విడుదల చేసినట్లు సి.ఎన్‌.ఎన్‌. వెల్లడించింది.

►ముజఫర్‌రూర్‌లోని బాలికల ప్రభుత్వ ఆశ్రయ గృహంలో 34 మంది మైనర్‌ బాలికలపై అమానుషమైన అనేక లైంగిక అకృత్యాలు జరిగినట్లుగా వస్తున్న వార్తలపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతీ మలీవాల్‌ బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు లేఖ రాశారు. బాధిత బాలికలు మొదట ఇచ్చిన వాంగ్మూలాలను మార్చుకునేలా వారిపై ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నందున వారికి గట్టి భద్రతను కల్పించాలని ఆ లేఖలో ప్రధానంగా విజ్ఞప్తి చేయడంతో పాటు.. వారిని స్కూళ్లకు, కౌనెల్సింగ్‌కు  పంపే విషయమై శ్రద్ధ వహించాలని స్వాతి కోరారు.

►ఈ ఏడాది డిసెంబరులో జరుగునున్న రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా..  నలభై రోజుల ‘రాజస్థాన్‌ గౌరవ యాత్ర’ ప్రారంభించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే తొలి రోజు బహిరంగ సభలో.. తన ప్రభుత్వం మహిళలకు, యువతకు, రైతులకు ప్రాధాన్యం ఇస్తుందని ప్రకటించారు. అలాగే, ‘మేము మీతో ఉన్నాం : బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు’ అనే నినాదంతో రాజే మహిళలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

► ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసిన ‘కాస్టింగ్‌ కౌచ్‌’ దారుణాల గురించి విన్నాక హాలీవుడ్‌ మీద తనకు గౌరవం పోయిందని అంటూ.. హాలీవుడ్‌ తన పాపాలకు పశ్చాత్తాపం చెంది, పూర్తిగా ప్రక్షాళన చెందాకే అటువైపు చూసేందుకు సాహసిస్తానని బ్రిటిష్‌ టీవీ ప్రెజెంటర్, నటి, మోడల్‌ జమీలా అలియా జమీల్‌ ‘గార్డియన్‌’కి ఇచ్చిన తాజాగా ఇంటర్వ్యూలో చెప్పారు. ‘అవసరమైతే నా కెరీర్‌నైనా నాశనం చేసుకుంటాను కానీ, హాలీవుడ్‌కి వెళ్లి నేను నాశనం కాను’ అని కూడా ఆమె అన్నారు! 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా