నాన్న వెంటే నడిచి రైతునయ్యా..!

11 Sep, 2014 23:42 IST|Sakshi
నాన్న వెంటే నడిచి రైతునయ్యా..!

నేడు మహిళా రైతు దినోత్సవం

వ్యవసాయం... అనగానే అది మగాళ్ల జోన్ అనుకుంటారు. మహిళలు రాణించే రంగం కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంటుంది. లెక్కలేనంత మంది మహిళలు వ్యవసాయరంగంలో పని చేస్తుంటారు. వాళ్లెవరినీ రైతులనలేం. కానీ మహిళల్లో రైతులున్నారని నిరూపిస్తున్నారు గుంటూరుకు చెందిన మల్లీశ్వరి. ఆమె ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్నారు. వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్ బోధనలను అక్షరాలా పాటిస్తున్నారు. మహిళారైతు దినోత్సవం సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌లో జరుగుతున్న సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు.  
 
ఈ సందర్భంగా సాక్షి ఫ్యామిలీతో...

‘‘మా అమ్మగారి ఊరు కృష్ణాజిల్లా తేలప్రోలు. నన్ను గుంటూరు జిల్లా నూతక్కిలో ఇచ్చారు. మా అమ్మానాన్నల పెళ్లయిన పదేళ్లకు పుట్టాను. దాంతో మా నాన్నగారికి నేనంటే గారం ఎక్కువ. ఆయన వెంటే తిప్పుకునేవారు. అలా పొలం వెళ్లడం అలవాటైంది. ఆయనపని చేస్తుంటే నేనూ చేలో దిగి ఆయన వెంటే తిరుగుతూ ఉండేదాన్ని. మా అత్తగారిది కూడా వ్యవసాయ కుటుంబమే. నాకు పెళ్లయిన ఈ పాతికేళ్లలో దాదాపుగా పదిహేనేళ్లు రసాయన ఎరువులతోనే పంటలు పండించాం. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి పిండికట్టలు (రసాయన ఎరువులు) తగ్గించుకుంటూ వచ్చాం. అయినా గట్టెక్కడం కష్టమే అనుకుంటున్నప్పుడు వ్యవసాయాధికారులు వర్మీ కంపోస్టు గురించి చెప్పారు. దానిని ప్రయత్నించాం. అది కూడా చిన్న ఖర్చేమీ కాదు. అలా ఎదురీదుతున్నప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది.
 
విజయవాడలోని పోరంకికి 2008లో పాలేకర్ (సుభాష్ పాలేకర్) గారొచ్చారు. ఆయన సేద్యం గురించి చాలా సంగతులు చెప్పారు. ఆయన హిందీలో చెప్తుంటే చదువుకున్నోళ్లు తెలుగులో వివరించారు. ఆ సదస్సుకి మా ఆయన వెళ్లి, పాలేకర్ గారు ప్రకృతి సేద్యం గురించి రాసిన పుస్తకాలు (తెలుగు అనువాదాలు) తెచ్చారు. వాటిని చదివి అలాగే చేశాం. ఆ తర్వాత 2010లో పాలేకర్‌గారు గుంటూరులో సదస్సుకు వచ్చారు. ఆ సదస్సుకు నేను కూడా వెళ్లాను. రసాయన క్రిమిసంహారక మందులు, రసాయన ఎరువుల వల్ల నేల ఎంత నిస్సారమవుతుందో పూసగుచ్చినట్లు చెప్తుంటే మనసు కదిలిపోయింది. నేలను నమ్ముకుని బతికే వాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం... అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాను. వెంటనే ఒక ఆవును కొన్నాం. ఆ ఆవు మాకు, మా ఆరెకరాల సేద్యానికీ ఆధారం.
 
అభయ హస్తమిచ్చిన అరటి...
ప్రకృతి సేద్యంలో మేమేసిన మొదటి పంట అరటి. మామూలుగా పండే పంటకంటే రెండు హస్తాలు ఎక్కువే వచ్చాయి. రుచి కూడా బాగుంది. ప్రకృతి వ్యవసాయంలో అరటికి ఎకరానికి ఏడెనిమిది వేల ఖర్చు వస్తుంది. గాలివానల వంటివి వస్తే చేయగలిగిందేమీ ఉండదు. కానీ విపత్తులు లేకుంటే రాబడి లక్షరూపాయలకు తగ్గదు. ఇప్పుడు మేము చెరకు, బొప్పాయితో పాటు అన్ని రకాల కూరగాయలు పండిస్తున్నాం. రసాయన ఎరువులు వేయకుండా పండిన కూరగాయ కానీ పండు కానీ ఒకసారి తింటే... ఇక ఆ ఎరువులతో పండించిన వాటి జోలికెళ్లరు.
 
నాకిప్పుడు 42 ఏళ్లు. పిల్లల ప్రసవాలప్పుడు తప్ప ఇప్పటి వరకు ఒక్క మందుబిళ్ల కూడా మింగలేదు. రసాయన ఎరువులతో చచ్చుబడిపోయిన మా పొలం ఈ సేద్యంతో గుల్లబారి సారవంతంగా మారింది. బూజు తెగులు, పేనుబంక తెగుళ్లకు ఆవుమూత్రం చల్లితే తెల్లారేసరికే గుణం కనిపిస్తుంది. ఇంట్లో కానీ పొలంలో కానీ చెదలు పడితే ఆవుమూత్రం కలిపిన నీటిని చిలకరిస్తే చాలు. ఆవు పేడ, ఆవు మూత్రం, నల్లబెల్లం, మినప్పిండి, మట్టి కలిపి 48 గంటల సేపు మురగబెడితే జీవామృతం తయారవుతుంది. దీంతోపాటు మేము ఏ రోజు పేడ ఆ రోజు పొలంలో చల్లేస్తాం.
 
స్వయంగా చూడడంతోనే ధైర్యం!

పాలేకర్‌గారు చెప్పిన మాటలు మాలో బాగా నాటుకున్నప్పటికీ మనసులో ఏదో భయం. కానీ మమ్మల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి అక్కడ రసాయన ఎరువులు వేసిన తోటలను, సహజ పద్ధతుల్లో పండించిన బత్తాయి, కమలా తోటలను చూపించారు. సహజపద్ధతుల్లో పండించిన చెట్లు నిగనిగలాడుతూ ఆకులు కూడా నేవళంగా (తాజాగా) కనిపించాయి. దాంతో మేమూ చేయగలమనే ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సదస్సుకి అన్ని రాష్ట్రాల నుంచి నాలుగువందల మంది మహిళారైతులు వచ్చారు. నా అనుభవాలను చెప్పడంతోపాటు వారి అనుభవాలను నేను వింటే ఇంకా చాలా తెలుస్తాయి.’’

సంభాషణ: వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు