టీచర్‌ చేతి స్టిక్‌ ప్లేయర్‌ని చేసింది

20 Sep, 2019 09:14 IST|Sakshi
తల్లి కొండా రేణుకతో సుశీల

తల్లికి ఊహ తెలియక ముందే ఆమె మాతమ్మ (దేవదాసీ) అయింది. తనకు ఊహ తెలిసే వయసుకు నాన్నెవరో తెలియదు. ఫలానా వ్యక్తి మీ నాన్న అని కుమార్తెకు చెప్పే పరిస్థితి ఆ అమ్మకు లేదు. ఈ సమాజంలో తనేమిటో, తన కుటుంబం ఏమిటో కూడా ఎరుగదు. అమ్మలోనే అమ్మానాన్నను చూసుకుంది. ఆరో తరగతిలో ఉండగా  టీచర్‌  చేతిలో ఓ ‘కర్ర’ను చూసి అదేమిటని అడిగింది. ‘‘హాకీ స్టిక్‌ అమ్మా!’’ అని టీచర్‌ చెప్పింది. ‘‘నేనూ ఆ స్టిక్‌తో ఆడతాను’’ ముందుకొచ్చింది. ఆ టీచర్‌ సరేనంది. అలా పదేళ్ల వ్యవధిలోనే ఆ మాతమ్మ కూతురు జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి జాతీయ స్థాయి హాకీ ప్లేయర్‌ అయింది! చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడకు చెందిన దేవదాసీ కొండా రేణుక కుమార్తె పద్దెనిమిదేళ్ల సుశీల అసామాన్య విజయగాథ ఇది.  

అన్ని అవకాశాలూ ఉన్నా క్రీడల్లో రాణించలేని వారెందరో ఉన్నారు. ఏ ఆసరా లేని సుశీల.. తన తల్లి కళ్లలో ఆనందాన్ని నింపాలన్న ఏకైక లక్ష్యంతో హాకీలో జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించి అమ్మ చెప్పినట్టు ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమాగా చెబుతోంది. తోటి జోగినీ, దేవదాసీ, మాతమ్మల కుటుంబాల్లో స్ఫూర్తి నింపుతోంది. చంద్రయానం చేస్తున్న ఈ రోజుల్లోనూ దేవదాసీ దురాచారం ఇకపై కొనసాగడానికి వీల్లేదని సుశీల అంటోంది. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనపై ఇటీవల విజయవాడలో నిర్వహించిన సదస్సుకు మాతమ్మ రేణుక వెంట వచ్చిన కుమార్తె సుశీలతో ‘సాక్షి’ ముచ్చటించింది.

అమ్మ జీతం ఆరువేలు
‘‘నాకు అన్న, తమ్ముడు, చెల్లి ఉన్నారు. నాన్న ఎవరో? ఎలా ఉంటారో తెలియదు. నాన్నెవరమ్మా? అని అడిగితే అమ్మ మౌనం దాల్చేది. కొన్నాళ్లకు తెలిసింది.. అమ్మ ‘మాతంగి’ అని.. మాకు నాన్న ఉండరని. అమ్మ రుయా ఆస్పత్రిలో కాంట్రాక్టు స్వీపర్‌. అమ్మకు వచ్చే నెల జీతం ఆరు వేలూ కుటుంబ పోషణకు చాలక పాచి పనులు కూడా చేసి ఇల్లు నడుపుతోంది. మేమూ నీకు సాయపడతామంటే.. ‘వద్దు.. మీరు బాగా చదువుకుని ప్రయోజకులవ్వండి. నాకంతే చాలు’ అంటుంది. మమ్మల్ని చదివించడానికే తను కష్టపడుతోంది. చిన్నప్పట్నుంచి నాకు ఆటలంటే చాలా ఇష్టం. రన్నింగ్, జూడో, త్రోబాల్, వాలీబాల్, రెజ్లింగ్, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్‌ వంటి క్రీడల్లో నాకు మంచి పేరొచ్చింది. నేను ఆరో తరగతిలో ఉండగా మా పీఈటీ ప్రసన్న మేడం చేతిలో ఉన్న కర్రను చూసి అదేమిటి టీచర్‌? అని అడిగా. దీన్ని హాకీ స్టిక్‌ అంటారని చెప్పారామె. ఈ ఆట ఆడాలని ఉంది టీచర్‌.. అని చెప్పడంతో ఆమె నన్ను ప్రోత్సహించారు. మిగిలిన ఆటలకంటే హాకీపై ఆసక్తి పెంచుకున్నాను. ఎనిమిదో తరగతిలో మదనపల్లెలో జరిగిన జిల్లా స్థాయి హాకీ టోర్నమెంట్‌లో ప్రతిభ చూపడంతో (అండర్‌–17) నేషనల్స్‌కు ఎంపికయ్యాను. ఇలా ఇప్పటిదాకా 23 జిల్లా స్థాయి, 5 రాష్ట్రస్థాయి, అండర్‌ – 17, అండర్‌ 19 కేటగిరీల్లో జూనియర్, సీనియర్స్‌ విభాగాల్లో గుజరాత్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 5 జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడాను.

దాతల సాయంతోనే..!
అమ్మ సంపాదన కుటుంబ పోషణకే సరిపోదు. మరి నాకు హాకీ టోర్నమెంట్లకయ్యే ఖర్చు ఎక్కడ నుంచి వస్తుంది? ఒకసారి నేషనల్స్‌కు వెళ్లాలంటే కనీసం రూ.5–6 వేలయినా ఖర్చవుతుంది. మా కుటుంబ పరిస్థితిని చూసి మా కోచ్‌ లక్ష్మీ కరుణ, ప్రసన్న టీచర్, రమణ సార్‌ వంటి వారితో పాటు మా గ్రామస్తులు ఆర్థికంగా చేయూత నిస్తున్నారు. దాంతోనే నేషనల్స్‌కు వెళ్తున్నాను. పట్టుదలతో విజయం సాధించుకుని వస్తున్నాను.

హాకీలో నేను రాణించడం వెనక అమ్మ ప్రోత్సాహం చాలా ఉంది. ఆటలో చిన్న చిన్న దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా ముందుకుకెళ్లమ్మా! అని ప్రోత్సహిస్తుంది. హాకీలో బాగా రాణించి ఊరుకి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. నాకు అమ్మా, నాన్నా అమ్మే. అన్న దినేష్‌ డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్‌ పరీక్షకు ప్రిపేరవుతున్నాడు. తమ్ముడు వెంకటేష్‌ కబడ్డీ (జిల్లా స్థాయి)లో ప్లేయర్‌. చెల్లి భూమిక కూడా హాకీ (రాష్ట్ర స్థాయి)తో పాటు ఇతర క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇలా అమ్మ నాతో పాటు మిగిలిన పిల్లలనూ ఆటల్లోను, చదువులోనూ పేరు తెచ్చుకోవాలి చెబుతుంటుంది. అమ్మ సపోర్టు మాపై చాలా ప్రభావం చూపుతోంది. చంద్రయాన్‌కు చేరుకుంటున్న ఈ రోజుల్లో దేవదాసీ వ్యవస్థను ఇంకా కొనసాగించడం తగదు.

మా దుస్థితి పిల్లలకు రాకూడదు
నాకు ఊహ తెలియకముందే నన్ను మాతమ్మ (దేవదాసీ)ను చేసేశారు. పన్నెండేళ్ల వయసొచ్చే సరికి నన్ను మాతమ్మను చేసినట్టు తెలిసింది. నలుగురు పిల్లలను ఎంతో కష్టపడి చదివిస్తున్నా. పెద్ద కూతురు సుశీల హాకీలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నందుకు గర్వంగా ఉంది. రెండో కూతురూ హాకీతో పాటు ఇంకొన్ని ఆటలు ఆడుతోంది. చిన్నోడు కబడ్డీ బాగా ఆడతాడు. నా బతుకు ఎలా ఉన్నా మా పిల్లలకు నాలాంటి దుస్థితి రాకూడదు. ఈ దుర్వ్యవస్థ ఇకపై కొనసాగకూడదు.– కొండా రేణుక (మాతమ్మ)

ఇల్లు ఉంటే బాగుంటుంది
నెలకు రూ.400 చెల్లించి మా ఊళ్లో చిన్న అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ఏడాది అప్పటి ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాలకు నారావారిపల్లె వచ్చినప్పుడు వెళ్లి కలిశాను. సొంత ఇల్లు మంజూరు చేయమని, హాకీ మెటీరియల్‌ ఇప్పించమని కోరాను. మరోసారి వచ్చి కలవాలని చెప్పి పంపేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వాల నుంచి నాకు ఒక్క రూపాయి కూడా సాయం అందలేదు. ఏ సపోర్టు లేదు. కొత్త సీఎం జగనన్న మనసున్న వాడని అంటున్నారు. ఆయన ఆదుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని చేతులు జోడించింది సుశీల.– బొల్లం కోటేశ్వరరావు,సాక్షి, అమరావతి  బ్యూరో

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు