ముందే కట్ అవదు కాబట్టి... వెనక్కు రాలేదన్న బాధ ఉండదు

27 Jun, 2016 23:09 IST|Sakshi
ముందే కట్ అవదు కాబట్టి... వెనక్కు రాలేదన్న బాధ ఉండదు

ఉమెన్ ఫైనాన్స్ / ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్

 

కంపెనీలు ఏవైనా తమ అవసరాలకు తగిన పెట్టుబడులను సమకూర్చుకోడానికి పబ్లిక్ షేర్‌లను ఆఫర్ చేస్తుంటాయి. (ఉదా: కొత్త కంపెనీ పెట్టడానికి, ఉన్న కంపెనీ సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతరత్రా అభివృద్ధి అవసరాల కోసం). అలా కంపెనీ ప్రకటించిన షేర్‌లను ‘ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్’ (ఐ.పి.ఓ.లు) విధానంలో కంపెనీ నుంచి నేరుగా పొందవచ్చు. ఈ ఐ.పి.ఓ.ల ద్వారా షేర్లకు దరఖాస్తు చేయదలచుకున్న వారు తప్పనిసరిగా ఎ.ఎస్.బి.ఎ. (అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్) పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పద్ధతి వివరాలను చూద్దాం.

 
సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) 2016 జనవరి 1 నుంచి ఐ.పి.ఓ. షేర్లను ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో దరఖాస్తు చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఎ.ఎస్.బి.ఎ. పద్ధతిలో ఐ.పి.ఓ.లకు దరఖాస్తు చేసినప్పుడు ఖాతాదారుని బ్యాంకు అకౌంటు నుండి.. ఎన్ని షేర్లకైతే దరఖాస్తు చేశారో ఆ మొత్తం ఆ ఐ.పి.ఓ.కి బదలీ కాదు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోనే ఉంచి బ్లాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుైడె తే ఖాతాదారునికి అలాట్‌మెంట్ జరుగుతుందో ఆ అలాట్‌మెంట్ మొత్తం వరకు మాత్రమే బ్యాంకు అకౌంట్ నుండి బదలీ చేస్తారు. (బ్యాంకు ఖాతాలో సొమ్ము బ్లాక్ చేసి ఉన్నప్పటికీ).

 
దరఖాస్తు చేసిన తేదీ నుండి షేర్ల అలాట్‌మెంట్ తేదీ వరకు ఖాతాదారునికి బ్యాంకు వారు వడ్డీని యథాతథంగా అందజేస్తారు. పాత పద్ధతిలో అయితే ఖాతాదారుడు వడ్డీని నష్టపోవలసి వచ్చేది. అలాగే దరఖాస్తు చేసినప్పటికీ అలాట్‌మెంట్ జరగకపోతే ఆ సొమ్ము మళ్లీ వెనక్కు వచ్చే సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చేది. బ్యాంకులు ఏవైతే ఈ ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేయడానికి అనుమతి పొంది ఉంటాయో వాటిని ఎస్.సి.ఎస్.బి.లు (సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంకులు) అంటారు. ఈ ఎస్.సి.ఎస్.బి.లు ఏయే బ్రాంచీలలో ఎ.ఎస్.బి.ఎ. సర్వీసును అందజేస్తాయో ఆ బ్రాంచీలలో ఎస్.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను దాఖలు చేయవచ్చు.

 
ఖాతాదారులు ఏ ఎస్.సి.ఎస్.బి.లోనైతే తమ బ్యాంకు ఖాతాను కలిగి ఉన్నారో ఆ ఎస్.సి.ఎస్.బి. బ్రాంచిలలో మాత్రమే ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్‌ను అందజేయాలి. వేరే బ్యాంకులలో అనుమతించరు.  ఒక్కొక్క ఐ.పి.ఓ. కి 5 దరఖాస్తుల వరకు ఒక బ్యాంకు ఖాతా ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు చేసిన తర్వాత బిడ్డింగ్ సమయంలోనే విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. విత్‌డ్రా చేసిన వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం లోంచి అప్లై చేసిన మొత్తం మేరకు అన్‌బ్లాక్ అవుతుంది.

 
అదే బిడ్డింగ్ చివరి రోజు ముగిసిన తర్వాత విత్‌డ్రా చేస్తే మాత్రం వెంటనే అన్‌బ్లాక్ అవదు. ఆ ఐ.పి.ఓ. తాలూకు రిజిస్ట్రార్ సూచనల మేరకు అలాట్‌మెంట్ అంతా ముగిసిన తర్వాత అన్ బ్లాక్ అవుతుంది. ఖాతాదారుని బ్యాంకుకు కోర్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే కనుక ఖాతాదారు తన బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచిలోనే కాకుండా, ఆ బ్యాంకు వారు నిర్ణయించిన వేరే బ్రాంచీలలో కూడా ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ ఇవ్వొచ్చు. ఏ ఐ.పి.ఓ.కైనా ఖాతాదారులు ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., వెబ్‌సైట్‌ల నుండి ఎ.ఎస్.బి.ఎ. ఇ-ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్.సి.ఎస్.బి. జాబితాని, వాటి బ్రాంచీల లిస్టుని ఎన్.ఎస్.ఇ., బి.ఎస్.ఇ., సెబీ సైట్ ల నుండి పొందవచ్చు. ఎ.ఎస్.బి.ఎ. అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా అన్ని వివరాలను (పేరు, పాన్ నెంబరు, డీమ్యాట్ అకౌంట్ నెంబరు, బిడ్ రేట్, బిడ్ క్వాంటిటీ తదితర వివరాలు) పొందుపరచవలసి ఉంటుంది. వీటిల్లో ఏ మాత్రం తప్పు ఉన్నా దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఐ.పి.ఓ.కి దరఖాస్తు చేసేటప్పుడు ఆ కంపెనీ వివరాలను పరిశీలించి అలాగే, రేటింగ్ వివరాలను తెలుసుకొని అప్లై చెయ్యడం మంచిది.

 

రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు