వజ్రాల బండి.. అంతా మహిళలేనండి

12 Mar, 2020 07:42 IST|Sakshi
లోకో పైలట్‌ మున్నీ టిగ్గా, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ రాజేశ్వరి బిస్వాల్‌

ఈ నెల 6న శుక్రవారం ఒడిశాలోని ఖుర్దారోడ్‌ స్టేషన్‌ నుంచి ఉదయం 10.30 గంటలకు బయల్దేరిన గూడ్సు రైలు బండి అదే రోజు సాయంత్రం 5.30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలాస స్టేషన్‌ చేరుకుంది. మర్నాడు మళ్లీ ఉదయం 5.45 గంటలకు పలాసలో బయల్దేరి అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఖుర్దారోడ్డు స్టేషన్‌కు చేరుకుంది. ఈస్టుకోస్టు రైల్వే వారి గూడ్సు రైలు బండి అది. 

ఏమున్నాయ్‌ అంతగా ఆ రైలు బండిలో! వజ్రాలా.. ఇంత ఉపోద్ఘాతం ఇస్తున్నారు! వజ్రాలకన్నా విలువైనవే ఉన్నాయి. అయితే రైల్లో లేవు. రైలు నడుపుతున్న వాళ్లలో ఉన్నాయి. వాళ్లలో ఉన్నది వజ్ర సంకల్పం! 20 గంటల పాటు 400 కి.మీ.ల దూరం ఆ గూడ్సును నడిపినవారు ముగ్గురూ మహిళలే. గతంలో మహిళలు గూడ్సు బళ్లు్ల నడపలేదని కాదు. పక్కన పురుషులు కూడా ఉండేవారు. మహిళలే తమకు తాముగా, పురుషులు పక్కన లేకుండా గూడ్సు బండిని నడపడం ఇదే మొదటిసారి. లోకో పైలెట్‌ మున్నీ టిగ్గా, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ రాజేశ్వరీ బిస్వాల్, గార్డు రేవతి సింగ్‌.. మూసివేసిన కంటెయినర్‌ల లోడ్‌తో ఉన్న ఈ బండిని నడిపారు. వివిధ స్టేషన్‌లలో స్టేషన్‌ మాస్టర్‌లు ఇచ్చే సిగ్నల్స్‌కి అనుగుణంగా వేగాన్ని నియంత్రించుకుంటూ విజయవంతంగా ప్రయాణం సాగించారు. ‘‘క్యారేజ్‌ బండ్లను నడపడం ఎవరికైనా కాస్త కష్టమైన పనే. అయితే మగాళ్లకు దీటుగా మేము మా శక్తిని నిరూపించుకున్నాం’’ అన్నారు టిగ్గా (35). ఆమెది ఒడిశాలోని సుందర్‌ఘర్‌ జిల్లా. ఐటిఐలో మెకానికల్‌ గ్రేడ్‌ని పూర్తి చేశాక 2011లో అసిస్టెంట్‌ లోకో పైలట్‌గా చేరి, 2016లో లోకో పైలట్‌ అయ్యారు.

అసిస్టెంట్‌ లోకో పైలట్‌ రాజేశ్వరి (26) కూడా తాము సాధించిన ఈ విజయానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. ‘‘మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా నడిపిన తొలి మహిళా రైలులో పైలట్‌కు సహాయకురాలిగా ఉన్నందుకు నాకెంతో గర్వంగా ఉంది’’ అని ఆమె సంబరపడుతున్నారు. సాటి మహిళలకు స్ఫూర్తినిచ్చే సవాళ్లను నేనెంతో ఆనందగా స్వీకరిస్తాను’’అని కూడా అంటున్న రాజేశ్వరిది ఒడిశాలోని జంగత్సింగ్‌పూర్‌ జిల్లా.ఖుర్దారోడ్‌ రైల్వే డివిజన్‌లో 20 మంది మహిళా లోకో పైలట్‌లు, 19 మంది అసిస్టెంట్‌ లోకో పైలట్లు (స్త్రీ, పురుషులు కలిపి) ఉన్నారు. ‘‘మహిళలు తాము చేపట్టిన పని ఎంత కష్టమైనదైనా తేలిగ్గా చేసేస్తారు’’ అని డివిజనల్‌ మేనేజర్‌ శశికాంత్‌ సింగ్‌ అంటున్నారు.

మరిన్ని వార్తలు