మహిళలు ముందుకు సాగాలి!

3 Oct, 2019 05:59 IST|Sakshi

అతిథి

పేరు.. మేనక గురుస్వామి
వృత్తి... సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, యేల్‌ లా స్కూల్, న్యూయార్క్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లా, యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో స్కూల్‌ ఆఫ్‌ ‘లా’లో  విజిటింగ్‌ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు.

ప్రత్యేకత... ఎల్‌జీబీటీ హక్కులకు సంబంధించిన ఆర్టికల్‌ 377ను సడలించడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.

తల్లిదండ్రులు... మీరా గురుస్వామి, మోహన్‌ గురుస్వామి (ఆర్థిక శాఖ మాజీ సలహాదారు)

వివరం... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేనక ప్రాథమిక విద్యను హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో,  హైస్కూల్‌ విద్యను న్యూఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ విద్యాలయలో పూర్తిచేశారు. నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ,  హార్వర్డ్‌ లా స్కూల్, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో న్యాయశాస్త్రాన్ని చదివారు.

సందర్భం... మంథన్‌ సంవాద్‌లో వక్తగా పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చారు. ‘‘మై కాన్‌స్టిట్యూషన్స్‌ కంట్రీ’ అనే విషయం మీద మాట్లాడారు. ఆర్టికల్‌ 377ను సడలించేందుకు ఆమె చేసిన న్యాయ పోరాటం గురించి సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి అడిగే ప్రయత్నం చేస్తే.. ‘‘పోరాటం విజయవంతం అయింది.. దాని గురించి వార్తలు, వార్తా కథనాలూ వెలువడ్డాయి. ఇంకా దాని గురించే ఎందుకు? దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం అన్నారు. ‘‘దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బీజేపి, కాంగ్రెస్‌ను కాదని ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి యంగ్‌స్టర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని, ప్రాంతీయ ఆకాంక్షను చాటుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయం.. దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన అంశం. అంతేకాదు దక్షిణ భారతదేశ ఓటర్ల నాడిని తెలుపుతోంది. ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్లకున్న ఆదరణకు చిహ్నం. దీన్ని ఒకరకంగా ఫెడరల్‌ మూవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో మహిళా ఓటర్ల శాతమూ పెరిగింది. 

అయితే  మహిళా సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు ప్రాముఖ్యం ఇస్తాయన్నదే ఇక్కడ ప్రశ్న.  ఆ మాటకొస్తే మన దగ్గర ఎంతోమంది  మహిళా నేతలున్నారు.  మహిళా ప్రతినిధుల సంఖ్యా తక్కువేం కాదు. ప్రధానమంత్రి దగ్గర్నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మహిళలు పనిచేశారు. కానీ  వీళ్లెవరూ మహిళా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించిన దాఖలాల్లేవు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.. మహిళా సమస్యల పట్ల వాళ్లెందుకు మాట్లాడరు? అని.  ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటాం.. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రక్షణ ఉండదు. సాయంకాలం అయిందంటే బయట ఎవరూ కనిపించరు’’ అని అంటూ... ‘‘కాలం మారింది. మహిళలు ముందుకు సాగాలి. రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలి. సమస్యల పట్ల నిలదీయాలి. పరిష్కారాల కోసం పోరాడాలి’’ అని చెప్పారు మేనక గురుస్వామి.
– ఫొటో: ఎన్‌.రాజేష్‌ రెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా