స్టూడెంట్‌ పోలీస్‌

20 Nov, 2019 06:01 IST|Sakshi

ఆశయం

దూషణ నుంచి ఈవ్‌టీజింగ్, హెరాస్‌మెంట్, డొమెస్టిక్‌ వయొలెన్స్, దాడి, లైంగిక దాడి.. ఎంతటి తీవ్రమైన నేరాన్ని ఎదుర్కొన్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటే భయపడ్తారు మహిళలు. పోలీసులకు చెప్పేకన్నా నేరం తాలూకు బాధను భరించడమే నయమనే భావనలో ఉంటారు. పోలీసుల ప్రవర్తనపట్ల ఉన్న భయమే కారణం.  ఇలాంటి భయాన్ని పోగొట్టి.. మహిళలకు, పోలీసులకు మధ్య స్నేహాన్ని పెంపొందించి.. ఏ ఇబ్బంది ఎదురైనా ధైర్యంగా పోలీసులకు చెప్పే వాతావరణాన్ని కల్పించమని ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఫెడరేషన్‌.. ఉత్తరప్రదేశ్‌ డీజీపీకి లేఖ రాసింది. ఇది చాలా వైరల్‌ అయ్యి అక్కడి పోలీసులనూ ఆలోచింపచేసింది. ఓ అడుగు ముందుకేసేలా కదిలించింది కూడా.

దాని పర్యవసానమే...
ఆ జిల్లాల్లోని విద్యార్థినులను ఒకరోజు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జిగా నియమించాలని ఘజియాబాద్‌ పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తులను మొదలు పెట్టారు కూడా. పోలీసులు నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఘజియాబాద్‌ జిల్లాలోని పాఠశాలల విద్యార్థినుల్లో కొంతమందిని ఎంపిక చేసుకొని పర్యవేక్షణ, మహిళల మీద జరుగుతున్న నేరాలు, అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు.. మొదలైన వాటి మీద శిక్షణనిస్తారు. తర్వాత సీనియర్‌ పోలీస్‌ అధికారులు  వాళ్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి స్థానిక పోలీస్‌స్టేషన్లకు ఒకరోజు ఇన్‌చార్జిగా నియమిస్తారు. దీనివల్ల పోలీసులంటే భయం పోవడమే కాకుండా.. అనుకూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలస్తుంది, పోలీసులకు, మహిళలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

క్విజ్, వ్యాసరచనతో...
స్కూళ్లల్లో క్విజ్, వ్యాసరచన పోటీలు పెట్టి, నెగ్గిన విద్యార్థినులను స్టేషన్‌ ఇంచార్జీలుగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఘజియాబాద్‌ అపార్ట్‌మెంట్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడొకరు పోలీసులకు సలహా ఇచ్చారు. దీని గురించి పోలీసులూ ఆలోచిస్తున్నారట. ఏమైనా పోలీసులు ఇలాంటి చొరవ తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల జరిపిన పలు సర్వేల్లో మహిళలకు జరిగిన అన్యాయం గురించి  మహిళా పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల సంఖ్య ఇదివరటికంటే 22 శాతం పెరిగిందని తేలింది. దీన్నిబట్టే ఘజియాబాద్‌ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని అనుకుంటున్నారంతే. మన దగ్గర షీటీమ్స్‌ వగైరా ఉన్నా.. ఇలాంటి కార్యక్రమాలూ చేపడితే మరిన్ని మంచి ఫలితాలు వచ్చి.. మహిళల పట్ల జరిగే నేరాలు చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుందేమో!

మరిన్ని వార్తలు