ఇవ్వడంలోనే ఉంది సంతోషం

7 Oct, 2019 00:48 IST|Sakshi

స్త్రీ శక్తి / అందమైన లోకం

ఉద్యోగం చేసేవారైనా, ఇంటిపట్టున ఉండేవారైనా ఆడవాళ్లు పొడవైన శిరోజాలను ఇష్టపడతారు. ఏ ఉద్యోగంలో ఉన్నా వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అందుకే.. కేరళలో మహిళా పోలీస్‌ అధికారి అపర్ణ లవకుమార్‌ ఓ క్యాన్సర్‌ బాలిక విగ్గు కోసం పొడవాటి తన జడ కత్తిరించి ఇవ్వడం ఒక విశేషం అవడమే కాకుండా.. ఎందరికో ఆమె ప్రేరణగా నిలిచారు.

త్రిశూర్‌ సమీపంలోని ఇరింజలకుడ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అపర్ణ సీనియర్‌ పోలీస్‌ అధికారి. 17 ఏళ్ల క్రితం పోలీసుగా విధులను చేపట్టారు అపర్ణ. ఆమె కురులు తల నుంచి మోకాలి పొడవు వరకు ఉండేవి. మూడేళ్ల క్రితం తొలిసారిగా ఆమె జుట్టును క్యాన్సర్‌ పేషంట్ల కోసం దానం చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ పనికి పూనుకున్నారు. ‘ముందు ఎవరికీ చెప్పలేదు. అలా చెబితే నాకు అడ్డు చెప్పేవారే ఎక్కువ ఉంటారు. ఆలోచన వచ్చిన వెంటనే సెలూన్‌కి వెళ్లిపోయాను. విగ్గులు తయారు చేసేవారికి ఆ వెంట్రుకలు ఇచ్చేశాను. ఆ విగ్గును క్యాన్సర్‌ బారిన పడిన పిల్లలకు చేరేలా చూశాను. ఇదో పెద్ద విషయంగా పరిగణించలేదు’’ అని చెబుతారు అపర్ణ. ప్రజలకు ఆర్థికంగా సహాయం చేసే స్థితిలో లేను, ఇలా కొందరి పిల్లల ముఖాల్లో నవ్వులు చూడాలనుకున్నాను అంతే’’ అంటూ సంతోషంగా చెబుతున్నారు అపర్ణ.

ఆత్మన్యూనతను పోగొట్టేందుకు
క్యాన్సర్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెరిగినా, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా చూడడం కష్టం. పిల్లలకు క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ కీమో గురించి అంతగా తెలియదు. ‘‘క్యాన్సర్‌ బారిన పడిన పిల్లలు కీమోథెరపీ చేయించుకుని జుట్టు కోల్పోయిన తరువాత పాఠశాలకు వెళ్లినప్పుడు అక్కడ తోటి పిల్లల నుంచి ఎగతాళిని ఎదుర్కోవచ్చు. లేదంటే అందరికీ జుట్టు బాగా ఉండి తమకెందుకు ఇలా జరిగిందని బాధపడవచ్చు. ఈ ఆలోచనలు వారిలోని ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తాయి. క్యాన్సర్‌ బారిన పడి, కీమో థెరపీ చేయించుకున్న ఓ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే అమ్మాయిని చూసినప్పుడు ఇలాగే బాధనిపించింది. అలాంటి పిల్లలు పడే బాధను తొలగించి, వారిలో ఆత్మ విశ్వాసం పెరిగేందుకు ఏం చేయచ్చు అనిపించినప్పుడు ఈ ఆలోచన వచ్చింది’’ అని చెప్పారు ఈ పోలీస్‌ అధికారిణి.

అనుష్కా శర్మ : ‘అపర్ణ చేసిన పని సాధారణమైనదేమీ కాదు. అమెకు నా అభినందనలు’  

అపర్ణకు ఇద్దరు కుమార్తెలు.ఎంఎస్సీ చదువుతున్న దేవిక, పదోతరగతి చదువుతున్న గౌరీ కూడా రెండేళ్ల క్రితం తల్లిలాగే విగ్గుల కోసం తమ పొడవైన కురులను దానం చేశారు. అపర్ణ బంధువు, తోటి మహిళా పోలీసు అధికారి కూడా ఆమె ధైర్యమైన చర్యతో ప్రేరణ పొంది తమ శిరోజాలను దానం చేశారు. బాలీవుడ్‌ నటి అనుష్కా శర్మ అపర్ణ పెద్దమనసుకు ప్రశంసలు కురిపించారు. వెల్లువలా వచ్చి పడుతున్న అభినందనలపై అపర్ణ స్పందిస్తూ.. తాను చేసింది పెద్ద ఘన కార్యమేమీ కాదని.. వెంట్రుకలు కత్తిరించుకుంటే ఏడాదికో, రెండేళ్లకో పెరుగుతాయని, నిజమైన త్యాగం అవయయ దానం చేసే వారిదేనని అన్నారు.  
– ఆరెన్నార్‌

మరిన్ని వార్తలు