ప్రత్యేక చట్టాలపై మహిళలు అవగాహన కల్పించుకోవాలి

12 Nov, 2013 00:32 IST|Sakshi

మూడేళ్ల క్రితం డిసెంబర్‌లో... మెడిసిన్ చదివే ఓ అమ్మాయికి ఒక ఐటీ స్టూడెంట్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలనుకున్నారు. ఆ క్రమంలో వీరిద్దరూ నిరుడు డిసెంబరులో ఒకరోజు కలుసుకున్నారు. ఎప్పటిలా భవిష్యత్తు గురించి ఊసులాడుకున్నారు. ఆ వేళకు వీడ్కోలు తెలుపుకున్నారు. కాసేపయితే ఎవరి నివాసాలకు వాళ్లు చేరిపోయేవారే. కానీ అంతలోనే అనుకోని ఘోరం జరిగింది. గమ్యస్థానాలు చేరేందుకు వారు ఎక్కిన బస్సే వారి పాలిట శాపమయ్యింది.

అందులో ఉన్న కొందరు దుర్మార్గుల చేతుల్లో ఆ అమ్మాయి గ్యాంగ్‌రేప్‌కి గురయ్యింది. తర్వాత కొన్ని రోజులకు ఈ లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. కానీ వెళ్లిపోతూ వెళ్లిపోతూ ఆమె అందరిలోనూ ఆలోచనలు రేకెత్తించింది. ‘ఈ సమాజంలో ఆడపిల్ల పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను సంధించిపోయింది. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, మహిళా సంక్షేమం వంటి మాటలన్నిటినీ సమాధి చేసింది ఆమె మరణం. ప్రజాగ్రహం పెల్లుబికింది. మా రక్షణ కోసం మీరేం చేస్తున్నారంటూ మహిళాలోకం ప్రభుత్వాన్ని నిలదీసింది. ఫలితంగా నిర్భయ చట్టం పుట్టుకొచ్చింది.

ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్‌లో మార్పులు చేసి, స్త్రీల మానప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
 మహిళల చుట్టూ ఎన్నో రక్షణ రేఖలు గీసింది. కానీ ఆ రేఖలు ఎవరినీ ఆపలేదు. ఆ సంఘటన తర్వాత కూడా ఎన్నో గ్యాంగ్ రేప్‌లు జరిగాయి. భారతదేశంలో ప్రతి ఇరవై నిమిషాలకొక అత్యాచారం జరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. కానీ వీటిని అరికట్టడం మాత్రం అసాధ్యంగా ఉంది. మహిళలకూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాచార భూతం ఆ స్వేచ్ఛను హరించేస్తోంది.

ఉన్న చట్టాలను మార్చినా, కొత్తచట్టాలను చేర్చినా అవి ఆగకపోవడానికి కారణం... వాటి పట్ల ప్రజలకు సరయిన అవగాహన లేకపోవడం, వాటి అమలులో ప్రభుత్వం, అధికారులు విఫలమవడం. కాబట్టి మొదట చేయాల్సింది నిర్భయ అయితేనేమి, ఇతర ఏ చట్టాలయితేనేమి... వాటి గురించి పూర్తి అవగాహన కల్పించాలి. దానివల్ల భయం అనేది కలుగుతుంది. తప్పు చేశారని తేలగానే జాప్యం లేకుండా శిక్షను అమలుపర్చాలి. దానివల్ల తప్పు చేయడానికి జంకే పరిస్థితి వస్తుంది. అవి చేయనంతవరకూ ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. వాటివల్ల మహిళలకు ఒరిగేదీ ఉండదు.
 
- అమర్త్యసేన్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు