ఉమన్ విత్ నో మనీ..!

8 Jul, 2014 23:52 IST|Sakshi
ఉమన్ విత్ నో మనీ..!

స్ఫూర్తి
ఒక్కసారిగా ప్రపంచ ‘ఆర్థిక వ్యవస్థ’ కుప్పకూలితే... అసలు ద్రవ్యమానం అనే దానికి చెల్లుబడి లేకుండా పోతే.. ఏదీ కొనే పరిస్థితి, అమ్మే పరిస్థితి లేకపోతే... అప్పుడు మనిషి ఎలా బతుకుతాడు, కొనడం, అమ్మడం అనే ప్రక్రియ లేకపోతే మనిషి జీవితం ఎలా ఉంటుంది? అనే సందేహం వచ్చింది 30 ఏళ్ల గ్రేటా టౌబర్ట్‌కు. అయితే గొప్ప ఆర్థికవేత్తలతో సహా అనేక మంది ఆమెకు వచ్చిన సందేహానికి సమాధానాన్ని చెప్పలేక నీళ్లు నమిలారు.

దాంతో తనే సొంతంగా ఆ అంశం గురించి అధ్యయనం చేయాలనుకొంది గ్రేటా. డబ్బు లేకపోతే... అనేది తన సందేహం కాబట్టి... తను దేన్నీ డబ్బుతో ‘కొనకూడదు’ అని నిర్ణయించుకొంది. అంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకూ అవి నిత్యావసరాలు అయినా... అత్యవసరాలు అయినా... దేనినీ కొనకూడదు! వీలైతే తయారు చేసుకోవడం, లేకపోతే సెలైంట్‌గా ఉండటం. ఈ ప్లాన్ ప్రకారం బతకాలని ప్రణాళిక రచించుకొంది.

అందుకు తగ్గట్టుగా సెకండ్ హ్యాండ్ బట్టలమ్మే ఒక షాప్‌ను సందర్శించి, వాళ్లకు తను తయారు చేసిన కాంపోస్టు ఎరువును ఇచ్చి బట్టలు తెచ్చుకొంది. అలాగే టూత్ పేస్ట్‌ల దగ్గర నుంచి ఫేస్‌క్రీమ్‌ల వరకూ అన్నింటినీ అందుబాటులో ఉన్న వాటితోనూ, వస్తుమార్పిడి ద్వారా కొనుక్కోదగిన వాటితోనూ సమకూర్చుకుంది. ఈ విధంగా ఏడాది పాటు గడిపేసిందామె.

డబ్బు అనేది ఖర్చు చేయకుండా ఆమె కొనసాగించిన జీవనశైలిని, పైసా ఖర్చు చేయకుండానే తూర్పు జర్మనీలోని తన ఊరి నుంచి 1,700 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి బార్సిలోనా చేరుకొన్న విధానం గురించి పూర్తి వివరాలను గ్రంథస్థం చేసింది.‘అపోకలిప్స్ జెట్జ్’ పేరుతో ఆ  పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిగాక ఏడాది పాటు అందరికీ భిన్నంగా గడపడం ద్వారా సాధించింది ఏమిటి? అని ప్రశ్నిస్తే.. ‘‘ఎన్నో పాఠాలు’’ అని చెబుతుందామె.

ఈ ప్రయాణంలో తన మదిలో జరిగిన చింతనతో ఆహార వృథాపై ఆందోళన తలెత్తిందని ఆమె చెబుతోంది. ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశాలు కూడా ఇంకా ఆహార వృథాను అరికట్టడం లేదని, ప్రపంచానికి ఇదే పెనుప్రమాదం అవుతుందని అభిప్రాయపడింది.

ఆమె చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ప్రస్తుతం సమాజంలో డబ్బు ఖర్చు పెట్టకుండా బతకడం అనేది చాలా కష్టమైన పని, అలా ‘రాడికల్’గా బతకడం ఎక్కువ కాలం సాధ్యమయ్యే పని కాదు... వృథా ఖర్చు, ఆ ఖర్చు ద్వారా వనరులను వృథా చేయకుండా మాత్రం జీవితాంతం బతకగలనని విశ్వాసం వ్యక్తం చేసింది!

మరిన్ని వార్తలు