ముందడుగు

8 Mar, 2019 01:42 IST|Sakshi

ద ఇయర్‌ ఫర్‌ విమెన్‌.. 2018 సంవత్సరపు  ఇంటర్నేషనల్‌ విమెన్స్‌ డే థీమ్‌.  నిజంగా.. నిస్సందేహంగా అది  మహిళల సంవత్సరమే. చరిత్ర ఎప్పుడూ బలవంతుల చెప్పుచేతల్లోనే ఉంటుంది. కాని 2018.. దీనికి భిన్నం. అణగారిన జెండర్‌ వైపు నిలబడింది. ఇన్నాళ్లూ  ఏ ఎవరికివారే నిశ్శబ్దంగా భరించిన అవమానాలను తోటి స్త్రీకి చెప్పుకోవడం మొదలైంది. ఆమె విన్నది. రోజూ తనకు జరుగుతున్నవే. తోడు ఉండాల్సిన అవసరాన్ని గ్రహించింది. చేయి పట్టుకుంది. ఆ సఖ్యత ప్రపంచమంతా నిండింది.  పురుషాధిపత్యంపై మహిళలు చేస్తున్న ఈ పోరుకు మద్దతునిచ్చింది 2018.. ఓ చెలిలా! విజయాన్ని కాంక్షిస్తూ చరిత్రలో ఓ కొత్త పుటలా మెరవనుంది! 


1. చట్టబద్ధత కోసం
ఐర్లాండ్‌లో అబార్షన్‌ను చట్టబద్ధం చేయాలని ఆ దేశ స్త్రీలు చేసిన న్యాయపోరాటం గెలిచింది. అబార్షన్‌కు చట్టబద్ధత కల్పించాలంటే ఆ దేశ రాజ్యంగాన్ని సవరించాలి. దాని కోసం ఓటింగ్‌ జరిగింది. అలా గతేడాది మేలో ఐర్లాండ్‌ రాజ్యాంగం ఎనిమిదవ సవరణ ద్వారా అబార్షన్‌ చటబద్ధమైంది. ఇదీ అక్కడి మహిళలు సాధించుకున్న హక్కే.  

2. హయ్యస్ట్‌ ఫిమేల్‌ కేబినేట్‌ 
 జూన్‌లో స్పెయిన్‌ ప్రధానమంత్రి.. తన మంత్రివర్గంలో పురుషుల కన్నా ఎక్కువ మంది స్త్రీలకు చోటిచ్చాడు. కేబినేట్‌లో  మొత్తం పదిహేడు మంది మంత్రులుంటే అందులో పదకొండు మంది మహిళలను మంత్రులుగా నియమించి స్పెయిన్‌ పాలనలో కొత్త మార్పుకు నేతృత్వం వహించాడు. దీంతో యూరప్‌లోనే  హయ్యస్ట్‌ ఫిమేల్‌ కేబినేట్‌ కంట్రీగా స్థానం దక్కించుకుంది స్పెయిన్‌. 

3. చేతికి డ్రైవింగ్‌ వీల్‌
గత యేడాది జూన్‌.. సౌది అరేబియా స్త్రీలకు రెక్కలు తొడిగింది. చేతికి డ్రైవింగ్‌ వీల్‌ అప్పగించింది. యెస్‌.. అప్పటిదాకా ఆ దేశంలో మహిళలు డ్రైవింగ్‌ చేయకూడదు అని ఉన్న నియమాన్ని డాష్‌బోర్డ్‌లో దాచి.. ఆడవాళ్ల చేతులకు వెహికిల్స్‌ తాళాలు అప్పగించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఇప్పించింది. ఆడవాళ్ల డ్రైవింగ్‌ మీదున్న బ్యాన్‌ను తొలగించింది. 

4. మీ టూ.. టైమ్స్‌ అప్‌.. విమెన్‌ ఆఫ్‌ కలర్‌
స్త్రీలను గౌరవించే విషయంలో అగ్రరాజ్యం అమెరికాకూ చాలా అవలక్షణాలున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మహిళల మీద చేసే వాఖ్యలే ఇందుకు ప్రధాన నిదర్శనాలు. మీ టూ మూవ్‌మెంట్‌కు పుట్టిల్లు కావడమూ మరో సాక్ష్యం. మీ టూ తర్వాత టైమ్స్‌ అప్‌ కూడా అక్కడే రాజుకోవడమూ తదుపరి ఉదాహరణ. అంతే చైతన్యమూ ఉందని రుజువు చేశాయి నవంబర్‌లో ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలు. రికార్డ్‌ సంఖ్యలో మహిళా ప్రతినిధులను ఎన్నికొని. ముఖ్యంగా  బ్లాక్‌ విమెన్‌ ఎక్కువ మంది ఎన్నికయ్యారు. వాళ్లలో ఆఫ్రికన్‌ ముస్లిం ఇల్హా ఒమర్‌ ఒకరు. 

5. ఇరాన్‌ స్త్రీల సాహసం..
ఇరాన్‌లో  పురుషులతో కలిసి మైదానంలో ఆటలను చూడ్డం స్త్రీలకు నిషేధం. అయినా లెక్కచేయకుండా గత యేడాది జూన్‌ 25న  టెహరాన్‌లోని ఆజాది స్టేడియంలో జరిగిన వరల్డ్‌ కప్‌ గ్రూప్‌ బి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను చూశారు ఇరానీ ఆడపడుచులు.‘‘ పురుషులతో కలిసి’’. 

6. మరిన్ని మంచి సంగతులు..
2018 నోబెల్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది... ఆ యేడు నోబెల్‌ శాంతి బహుమతిని ఇద్దరు కలిసి తీసుకున్నారు. వాళ్లలో ఒకరు డాక్టర్‌. రేప్‌ బాధితులకు వైద్యసేవలందించే సర్జన్‌.. డెనిస్‌ ముక్‌వేజ్‌. ఇంకొకరు రేప్‌ విక్టిమ్‌. నాదియా మురాద్‌. ఇరాక్‌లోని యజిది అనే ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన యువతి. ఐఎస్‌ఐఎస్‌ చెరకు చిక్కి.. కొన్నేళ్లు లైంగిక హింస భరించి చివరకు తప్పించుకుని యాక్టివిస్ట్‌గా మారి.. తనలాంటి ఎందరో రేప్‌విక్టిమ్స్‌కు సేవలందిస్తున్న సాహసి. వీళ్లద్దరూ కలిసి ఆ యేటి నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్నారు.
– సరస్వతి రమ

ప్రపంచంలో...
మహిళల హక్కుల సాధనలో 2018 ప్రపంచానికి అద్భుతమైన ప్రేరణను.. తర్వాత సంవత్సరాలకు గొప్ప స్ఫూర్తినీ పంచింది. ఉదాహరణలు చాలా... కొన్నిటిని ప్రస్తావన..

ఆస్కార్స్‌తో శుభారంభం...
ఆస్కార్‌లో బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్, బెస్ట్‌ షార్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ విభాగాల్లో మహిళలే ఆస్కార్స్‌ గెలుచుకొని ఈ యేటికి శుభారంభం పలికారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ ‘షాలో’ (ఎ స్టార్‌ ఈజ్‌ బార్న్‌)కి లేడీగాగా, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌కిగాను (బ్లాక్‌పాంథర్‌ సినిమా) రుత్‌ కార్టర్, బెస్ట్‌ ప్రొడక్షన్‌కు (బ్లాక్‌ ఫాం«థర్‌) హాన్నా బీచ్‌లర్‌ ఆస్కార్‌ పురస్కారం పొందారు. అలాగే బెస్ట్‌ డాక్యుమెంటరీ (షార్ట్‌)కోసం ‘పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’కు దర్శకత్వం వహించిన రేయ్‌కా జెహతాబ్చీ ఆస్కార్‌ అందుకున్నారు. 2018 .. అమెరికా రాజకీయ చరిత్రలో వర్ణ వివక్ష (మహిళ విషయంలో)ను బ్యాలెట్‌ బాక్స్‌ల్లో కుక్కేస్తే.. 2019.. ఆస్కార్‌ స్టేజ్‌ మీద ఓడించింది.. నల్ల కలువలను గెలిపించి. ఈ యేడాదంతా ఈ ఒరవడే సాగుతుందని.. తర్వాత సంవత్సరాలకూ బదిలీ చేస్తుందని విశ్వసిద్దాం.

మరిన్ని వార్తలు