టెర్రరిజానికే టెర్రర్

13 Aug, 2018 00:22 IST|Sakshi

స్వాట్‌ / కొత్త మహిళాశక్తి

మనదేశంలో ఇప్పటివరకు పురుషులకే పరిమితమై ఉన్న మరో రంగాన్ని స్త్రీ శక్తి బద్దలు కొట్టి కొత్త చరిత్రను సృష్టించింది. మగవారి కంటే తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని సగర్వంగా నిరూపించింది. అదీ కూడా.. ఉగ్రవాద, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఉద్దేశించిన ప్రత్యేక పోలీసు భద్రతా బలగంలో ధీరవనితగా నిలిచి విధులు నిర్వహించబోతోంది.

భారత పోలీసు బలగంలో మహిళలతో పోల్చితే మగవారి సంఖ్య ఎంతో ఎక్కువగా ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే చూసినా.. కేవలం 7 శాతం మాత్రమే యువతులున్నారు! ఇది ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 33 శాతం కంటే ఎంతో తక్కువ. ఇలాంటి నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా 36 మందితో కూడిన ‘మహిళా కమాండో బృందం’ తాజాగా ఢిల్లీలో విధుల్లో చేరింది. తీవ్రవాద కార్యకలాపాల నిరోధానికి ఏర్పాటై, అందరూ మహిళలే ఉన్న ఇలాంటి ఒక బృందం ఇంతవరకు మరే పోలీసు ఫోర్సు లోనూ లేదు.

ఢిల్లీ పోలీసు విభాగంలోకి తీసుకున్న ఈ  బృందాన్ని ‘స్పెషల్‌ వెపన్స్‌ అండ్‌ టాక్టిక్స్‌ టీమ్‌’ (స్వాట్‌)గా పిలుస్తున్నారు. పూర్తిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యువతులతోనే ఏర్పాటైన ఈ టీమ్‌ తన ప్రారంభ విధిగా.. వచ్చే బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు నగరంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో అప్రమత్తమై ఉంటుంది. ఈ సందర్భంగా ఐదు పురుష కమాండో బృందాలతో సమానంగా ఈ టీమ్‌ విధులను నిర్వర్తిస్తుంది.

15 నెలల కఠోర శిక్షణ
బందీలను విడిపించడం, బాంబులు పేలకుండా చేయడం, బిల్డింగ్‌లు ఎక్కడం, ఇతర  విభాగాల్లో  శిక్షణతో పాటు వివిధరకాల ఆధునిక ఆయుధాల వినియోగం, కౌంటర్‌ టెర్రరిజం వంటి అంశాల్లో ఈ బృందం  దాదాపు ఏడాది పాటు కమాండో ట్రైనింగ్, 3 నెలల ప్రత్యేక స్వాట్‌ ట్రైనింగ్‌లో మొత్తం పదిహేను నెలలు కఠోర శిక్షణ పొందింది.

పోలీసు, మిలటరీ భద్రతలో అత్యున్నతస్థాయి ప్రతిభ కనబరిచే ఇజ్రాయెల్‌ భద్రతాదళం మొదటిసారిగా ఉపయోగించిన  ‘క్రావ్‌ మాగా’  సెల్ఫ్‌ డిఫెన్స్‌ టెక్నిక్స్‌లోనూ (మార్షల్‌ ఆర్ట్స్‌) ఈ ధీరవనితలు చక్కటి తర్ఫీదు పొందారు. ఆయుధాలు లేకుండా కూడా ముష్కరులను ఎదుర్కోగలగడం, ఎంపీ–5 సబ్‌ మిషన్‌గన్స్, ఏకే–47, గ్లాక్‌–17, 26 పిస్టల్స్‌ వినియోగంలోనూ సుశిక్షితులయ్యారు. మానేసర్‌లోని నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ కేంద్రంలో, జారోడా కలాన్‌లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలోనూ తమ నైపుణ్యాలకు మరింత పదును పెట్టుకున్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో కీలకం
పట్టణప్రాంతాల్లో ఉగ్ర దాడులు ఎదుర్కోవడంతో పాటు, తీవ్రవాదులు ప్రజలను బందీలుగా తీసుకున్న సంక్షోభ పరిస్థితుల్లో ఈ మహిళలు మగవారికంటే ఏమాత్రం తక్కువ కాకుండా  సమర్థవంతంగా  వ్యవహరించగలరని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ పేర్కొన్నారు. ఆయనకు వచ్చిన ఆలోచనకు అనుగుణంగానే ఈ ప్రత్యేక మహిళా బృందం రూపుదిద్దుకోగలిగింది.‘మహిళలు ఇదే చేయగలరు. అది చేయలేరు అనే భావన కొందరిలో ఏర్పడింది.

అయితే స్వాట్‌ మహిళలు  పురుష కమాండోలతో సరిసమానంగా కొన్ని సందర్భాల్లో వారి కంటే మెరుగ్గా కూడా పనిచేయగలరని నేను గర్వంగా చెప్పగలను’ అని సీనియర్‌ అధికారి ప్రమోద్‌ కుషవాహ వ్యాఖ్యానించారు. అత్యుత్తమమైన వారిగా పరిగణ పొందుతున్న కొందరు పురుష కమాండోలు కూడా ఈ ధీరవనితలు చేసే కొన్ని సాహసకృత్యాలను చేయలేరని ఈ అధికారి అన్నారంటే ఈ టీమ్‌ ఎంత శక్తిమంతంగా ఉందో మనం అంచనా వేయొచ్చు.
 

‘స్వాట్‌’ ప్రత్యేకత ఏమిటి?
దాడులు, ప్రతిదాడులు, జంగిల్‌ ఆపరేషన్‌తో పాటు  మిగతా అంశాలన్నింట్లో అత్యున్నత నైపుణ్యం కనబరిచిన కారణంగానే వీరు స్వాట్‌ బృందంలో సభ్యులు కాగలిగారు. ఎలాంటి తీవ్రమైన పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు వీలుగా వీరి కిట్‌లలో హ్యాండ్‌ గ్రెనేడ్లు, వైర్‌లెస్‌సెట్, 20 మీటర్ల నైలాన్‌తాడు, పెన్సిల్‌ టార్చి, బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్, శక్తివంతమైన టార్చి, కట్టర్, కమాండోలు ఉపయోగించే డాగర్, తదితర సామగ్రి ఉంటుంది.

భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన ‘కౌంటర్‌ టెర్రరిస్ట్‌ యాక్టివిటీస్‌ స్పెషలిస్ట్‌లు’ వీరికి శిక్షణనిచ్చిన వారిలో ఉన్నారు. ఈ టీమ్‌లో అస్సాం నుంచి అత్యధికంగా 13 మంది, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, మణిపూర్‌ల నుంచి ఐదుగురేసి చొప్పున, మేఘాలయా నుంచి నలుగురు, నాగాలాంగ్‌ నుంచి ఇద్దరు, మిజోరం, త్రిపురల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

– కె. రాహుల్‌

మరిన్ని వార్తలు