వారిని స్మరించడమే ఒక సౌరభం

6 Mar, 2015 23:12 IST|Sakshi
వారిని స్మరించడమే ఒక సౌరభం

మహిళా దినోత్సవం  ప్రత్యేకం
 
ఇంతకాలంగా జీవితంలోనూ, సాహిత్యంలోనూ నేను చేసిన ప్రయాణంలో నా వెనుక నా మిత్రులూ, గురువులూ, కుటుంబసభ్యులు మాత్రమే కాదు, ఎందరో మహానుభావులైన కవులూ, రచయితలూ కూడా ఉన్నారు. ముఖ్యంగా కవయిత్రులూ, రచయిత్రులూను. ఒక ప్రతిభారాయి, ఒక అనితాదేశాయి, ఒక ఇందిరా గోస్వామి, ఒక నళినీ జమేలా.... తెలుగులో చెప్పాలంటే కీర్తిశేషులూ, నా హృదయవాసులూ అయిన రచయిత్రులెందరో... అటువంటి మహనీయ ప్రతిభామూర్తుల్లో కొందర్ని ఈ మహిళా దినోత్సవంనాడు తలచుకోవడమే ఒక ఉత్సవ సౌరభం అనిపిస్తుంది.
 
భండారు అచ్చమాంబ: స్త్రీ విముక్తి గురించి, స్వేచ్ఛ గురించిన మొదటి కథతో పాటు ఎన్నో కథలు రాసిన రచయిత్రి. ‘బృందావన స్త్రీ సమాజం’ అన్న పేరుతో మహిళా సమాజాన్ని స్థాపించారు కూడా.  తమ్ముడు కొమర్రాజు లక్ష్మణరావు చదువుకొంటూ ఉంటే విని మహారాష్ట్ర, బెంగాల్, గుజరాతీ, సంస్కృతం భాషలు నేర్చుకుందామె. స్త్రీలను ఇంటిలో నిర్బంధించి ఉంచడం పురుషులకు మంచిది కాదని తన కథల ద్వారా చెప్పాలని ప్రయత్నించింది. ఆమె రాసిన ‘స్త్రీ విద్య’ కథ తెలుగు భాషలో మొదటి కథగా గుర్తింపుకు రావడం స్త్రీ జాతికే ఒక గౌరవం. ఆ రోజుల్లో భార్య చదువుకుంటే భర్తకు ఆయుక్షీణం అని ఒక మూఢనమ్మకం ఉందట. స్త్రీ విద్య కథలో అచ్చమాంబ ఆ మూఢ నమ్మకాన్ని ఒక పురుష పాత్రచేత ఖండిస్తారు. స్త్రీ సాధికారత కోసం మాట్లాడేటప్పుడు స్మరించుకోవలసిన భద్ర మహిళ అచ్చమాంబ గారు.
 
కనుపర్తి వరలక్ష్మమ్మ: వరలక్ష్మమ్మగారిని మొదటి మహిళా కాలమిస్టని చెప్పొచ్చు. వీరు ఆంధ్రపత్రికలో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’ అనే కాలం రాసి అందరినీ ఆకర్షించారట. లేఖా సాహిత్యం కూడా రాశారు.  ఆ రోజుల్లో ఎన్నో సాంఘిక కార్యక్రమాలు నిర్వహించారు.  ‘హిందూ సుందరి’, ‘వివేకావతి’ లాంటివి ఆ పత్రికలో ఆమె రచనలు చేశారు. ఆమె రాసిన ‘ఐదు మాసముల ఇరువది దినములు’  కథ ఆ రోజుల్లో జాతీయ ఉద్యమం పట్ల స్త్రీల అవగాహనని, నిబద్ధతను తెలియజేస్తుంది. స్త్రీలు వంటిళ్ళకే పరిమితం కారాదనీ సమాజ సేవలో భాగస్వాములు కావాలనే స్ఫూర్తి వరలక్ష్మమ్మగారి రచనలలోనూ జీవిత విధానంలోనూ కనిపిస్తుంది.
 
పి.శ్రీదేవి: రచయిత్రిగా శ్రీదేవి కూడా కాలాతీత వ్యక్తే, ఆమె రాసిన ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఇప్పటికీ స్త్రీలకు ఆదర్శ గ్రంథమే. అందులో ‘ఇందిర’, ‘కళ్యాణి’ పాత్రలు శక్తులకు, గుణాలకు ప్రతీకలు. అంతవరకూ స్త్రీలను గుణవంతులుగా వుండమన్నారే తప్ప శక్తిమంతుల్ని కమ్మని ఎవరూ అనలేదు. శక్తిమంతులు కాకపోవడం వల్లనే స్త్రీలు అణగారిపోతున్నారు. అందుకే శ్రీదేవిగారు ఇందిరను సృష్టించారు. శ్రీదేవిగారు మెడికల్ డాక్టర్ కూడా. దేహాన్ని పరిశీలించి రోగాన్ని చెప్పినట్టు సమాజాన్ని పరిశీలించి ఆ రోజుల్లోనే స్త్రీవాదపు ఆనవాళ్ళు పసిగట్టారు. ఇందిర ఏం మాట్టాడు తుంది?  తన అస్తిత్వం కోసం  ఎట్లా పోట్లాడుతుంది? ఈనాటి అస్తిత్వవాద నేపథ్యమంతా ఇందిరలో కనిపిస్తుంది. అందుకే శ్రీదేవి  కాలాతీత వ్యక్తి.
 
చావలి బంగారమ్మ: తెలుగువాళ్ళకి ఒక ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఒక తోరూదత్, ఒక సరోజినీనాయుడు లేని లోటు తీర్చిన కవయిత్రి. ఈ పేరు వినగానే ‘అందాలు తానె చూచింది. నీటిలో అందాలు తానె చెప్పింది. నాతోటి, ఒడ్డున్న మందార వొంగి బొట్ట్టెట్టుకుని’ అన్న కవితా వాక్యాలు పూలపరిమళంలా గుప్పున తాకుతాయి. చెరువులో ఆకాశం కూలిపోవడం, సూర్యుడు చెట్టెక్కి చూడడానికి భయపడడం లాంటి గొప్ప పదచిత్రాలను ఆనాడే ఆమె రాయడం గమనించవలసిన విషయం.  ‘మంచులో మునిగింది/మాయమైపోయింది/ ఆకాశమున గలసెనే ఆ కొండ/ అక్కడే పడి యుండెనో’ అంటూ ‘ఆకొండ’ కవితలో రైలు ప్రయాణంలో తనకు కనిపించే కొండ గురించి ఆమె చెప్పిన అనుభూతి మన అందరిదీను.

కళ్యాణ సుందరీ జగన్నాథ్: ‘అలరాస పుట్టిళ్లు’ అనే కథ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు ఈమేదే. ఆ కథ గుర్తుకు రాగానే రాచ కుటుంబాల్లో పురుషాధిపత్య అహంకారాల మధ్య చితికిపోయిన ఆడపిల్లల ప్రేమలు గుర్తొస్తాయి. ఆ జ్ఞాపకాల సాయంత్రపు ముసురులో సాలెగూళ్ళు అల్లుకున్న లోగిళ్ళ మధ్య పశ్చాత్తాపాల పాలైన పెద్దలు ఏడుస్తూ కనిపిస్తారు. మన గుండె నిండా చెప్పలేనంత బరువు. ఒక చెంగల్వ రాయుడు అమాయకంగా నేలకొరిగి నిజమైన ప్రేమకు నిత్య మల్లెలా నిలుస్తాడు. ఇది కళ్యాణ సుందరి గారి కలంలోని మహత్యం. ఆ రోజుల్లోనే ఆంగ్ల సాహిత్యంలో అత్యున్నత విద్యని అభ్యసించిన ఆమె మాటల్లో ఉత్సహం, విజ్ఞానం కలగలసి ఉరకలు వేస్తూ ఉండేవి. స్త్రీల మనోవేదనలను భావుకతలో ముంచి తేల్చి వారిని చిరస్మరణీయులను చేసిన రచయిత్రి. చేదుచెట్టుకి  పూసిన వేపపూల పరిమళం లాంటివి ఆమె రాసిన కథలు.
 
పి. యశోదా రెడ్డి:  తెలంగాణ స్త్రీ ప్రతిభాపతాక. మహబూబ్‌నగర్ బిజినేపల్లిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులుగా అధ్యాపకులుగా సమర్థవంతంగా సేవలు అందించారు. తెలుగు భాషను, ముఖ్యంగా తెలంగాణ మాండలికాన్ని సాహిత్య వంతం చెయ్యడానికి ఎంతో కృషి చేసారు. ‘మహాలక్ష్మి ముచ్చట్లు’ అనే ధారావాహిక రేడియో కార్యక్రమం శ్రోతలు మరవలేనిది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. ప్రఖ్యాత చిత్రకారుడు పి.టి.రెడ్డి సతీమణిగా వారిద్దరిదీ పసిడికి తావు అబ్బిన దాంపత్యం. మహిళా సాధికారతకు ప్రథమ ఉదాహరణ. 1951 నుంచి గ్రామీణ జీవన నేపధ్యంతో కథలు రాశారు. సాధికారికత కోరుకునే మహిళలు ఆమె నుంచి నేర్చుకోవలసింది ఆ నిరాడంబరమూ, ఆ నిగర్వమూనూ.
 
తాడి నాగమ్మ: చాలామందికి తెలియని తొలితరం దళిత రచయిత్రి. ఆమె రచనలు గృహలక్ష్మి పత్రికలో తరచూ వచ్చేవి. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో చదువుకుని స్కూల్ టీచరుగా పని చేశారు. ఆ కాలంలో  ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు కూడా అందుకున్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ పలువిధాలుగా సమాజ సేవ చేసారు. ఊటుకూరి లక్ష్మికాంతమ్మ గారు తన ‘ఆంధ్ర కవయిత్రులు’ పుస్తకంలో ఆమెను కథా రచయిత్రిగా పేర్కొన్నారు. వీరు రాసిన ‘ఒక ముద్దు’ కథ గొప్పగా ఉంటుంది. ఒక మద పురుషుడు ఉద్యమంలో ఉన్న యువతిని ఒక ముద్దు ఇస్తే విదేశీయతను వదిలి స్వదేశ దీక్ష తీసుకుంటానంటాడు. చుట్టూ ఉన్న వారందరూ భయపడతారు. ఆమె ఇలా అంటుంది- ‘విదేశీ వ్యామోహం నుంచి బయటికి వస్తానంటే తప్పక ఇస్తాను. నువ్వు నాకు మూడవ సోదరుడివి’ అని వాడి నోరు మూయిస్తుంది. అదీ నాగమ్మగారి రచనా శక్తి.
 
తెన్నేటి హేమలత: అవును. మీ ఆలోచన కరెక్టే. ఆమె ‘ఊహాగానం’ లతే. ఓ స్త్రీ తన మనోలోకాన్ని ఎంత విశాలం చేసుకుని ఎంత దూరం ప్రయాణించగలదో ఊహాగానం పుస్తకం చెప్తుంది. ఆమె ఆలోచనాపథం విశ్వనాథ చేత, చలం చేత కూడా ప్రభావితమైనదే. ప్రాచీన నవీనాల రచనలు చేసిన మొదటి మహిళా రచయిత కూడా లతయే. ‘లత సాహిత్యం’ అంటూ తన సాహిత్యానికొక ముద్ర తేగలిగింది. సొంతగొంతు వినిిపించడమే అస్తిత్వ నిరూపణగా భావిస్తే లతని బలమైన అస్తిత్వనిరూపణ చేసుకున్న సాహితీ స్త్రీమూర్తి అని చెప్పవలసి ఉంటుంది.
 
వాసిరెడ్డి సీతాదేవి: సీతాదేవిగారి జీవిత ప్రయాణమే ఎంతో ఉత్తేజపూరితం. చిన్నప్పుడు  హైస్కూలు రోడ్డుకి అవతల ఉంటే ఆ రోడ్డు దాటి వెళ్లడం వాళ్ల పల్లెలో ఆడపిల్లకి నిషేధం కాబట్టి ఆమె హైస్కూలు చదువు చదవ లేకపోయారు కానీ పట్టుదల అనేది ఎలా ఉంటుందంటే తనదంటూ ఒక మార్గం వెతుక్కుని, చదువుకుని, ప్రభుత్వంలో ఉన్నత పదవులు నిర్వహిస్తూ సాహిత్య ప్రయాణం చేస్తేకాని విశ్రమించలేదామె. ఒకటి ఆమె ప్రజ్ఞకీ రెండవది ఆమె పట్టుదలకీ అన్నట్టు రెండు గౌరవ డాక్టరేట్లు వరించాయామెని. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నవలలు రాసి పోరు సల్పిన యోధురాలు. ఆమె రాసిన ‘మట్టిమనిసి’ నవల నిలువెల్లా కదిలించే నవల.  సీతాదేవిగారు ఒక లెజెండ్.  
 
రేవతీదేవి: ఈమె మొదటి స్త్రీవాద కవయిత్రి. నిజానికి వాదపు పరిధిని దాటిన ఆవేశవంతమైన స్త్రీమూర్తి అంటే బావుంటుంది. ‘ఈ హృదయం రసజ్వలిత. దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు’ అని తన గురించి తాను చెప్పుకున్నారు. సంపూర్ణమైన స్త్రీత్వ శక్తిని భరించలేక చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె రాసిన ‘శిలాలోలిత’ కావ్యం తెలుగులో అపురూపకావ్యం. ‘రేవతీదేవి తన కళ్లతో చూసే జీవిస్తుంది. రచిస్తుంది’ అని సంజీవ్‌దేవ్ అంటారు. ఇంతకన్నా అస్తిత్వ ప్రకటనకు గొప్ప మాధ్యమం ఉంటుందా?   
 -   డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి, 9848016442
 
మాలతీ చందూర్:  స్త్రీ జాతిలోని విజ్ఞాన భాండాగారం. బహుముఖీనమైన ప్రజ్ఞను స్వంతం చేసుకుని సమతూకంలో జీవితాన్ని సాహిత్యబద్ధం చేసిన రచయిత్రి. తన అనుభవసారాన్ని ‘జవాబులు’గా ప్రమదావనంలో పూయించిన కల్పలత.  ‘సద్యోగం’ అన్న నవలతో స్త్రీలు ఉద్యోగాలెందుకు చేయాలో సునాయాసంగా వివరించిన స్త్రీవాద రచయిత్రి. ‘పాతకెరటాలు’, ‘కొత్తకెరటాలు’  పేరిట ఆమె చేసిన ఆంగ్ల భాషా నవలల పరిచయాలు సూక్ష్మంలో మోక్షాన్నిస్తాయి. ఆ మోక్షం అందుకున్న చదువరులు ఆంధ్రదేశం అంతటా నిండి ఇప్పటికీ ఆమెకు నివాళి ఇస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు