ఆల్‌ ద బెస్ట్‌ హర్మన్‌

18 Feb, 2020 06:57 IST|Sakshi

విమెన్స్‌ టి20 వరల్డ్‌ కప్‌

క్రికెట్‌ మగవాళ్ల ఆట అని అనేవాళ్లు ఇప్పుడు జంకుతున్నారు. స్టేడియంలో స్త్రీలు కొడుతున్న సిక్సర్‌లు అలా ఉన్నాయి. మహిళా క్రికెట్‌ దినదినప్రవర్థమానమవుతోంది. సంప్రదాయ ఆటను దాటి టి20 స్థాయికి ఎదిగింది. పది దేశాల మహిళలు ప్రపంచ కప్‌ కోసం తలపడనున్నారు. వారు ఒకరితో ఒకరు పోటీ పడినా అందరూ కలిసి రుజువు చేయాలనుకుంటున్నది మాత్రం ‘క్రికెట్‌ మా ఆట కూడా’ అని చెప్పడమే.

మహిళలను ‘ఆకాశంలో సగం’... అంటుంటారు. కానీ ఆదరణ విషయంలో, ఆర్థిక అంశాల్లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఎంతో వివక్ష ఉంది. అయితే పురుష క్రికెటర్లకు దీటుగా తామూ మెరిపించగలమని, ధనాధన్‌ ఆటతో మైదానాన్ని దద్దరిల్లచేయగలని నిరూపించడానికి మహిళా క్రికెటర్లు అమితోత్సాహంతో వేచి చూస్తున్నారు. వారందరికీ ఆస్ట్రేలియా వేదిక కానుంది. మరో మూడు  రోజుల్లో ఆస్ట్రేలియాలో మహిళల టి20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. 17 రోజులపాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌ అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న విఖ్యాత మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇప్పటికే టైటిల్‌ వేట కోసం 10 జట్లు ఆస్ట్రేలియాకు చేరుకున్నాయి. సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. భారత మహిళల జట్టు మూడు వారాల క్రితమే ఆస్ట్రేలియా చేరుకుంది. 

మూడుసార్లు సెమిస్‌లోకి
11 ఏళ్ల క్రితం 2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్‌ జరిగింది. తర్వాతి ఏడాది రెండోసారి ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించారు. 2012 నుంచి ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు టి20 ప్రపంచకప్‌లలో భారత్‌ మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్‌ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్‌ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. 

హర్మన్‌ పంజా
వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతోన్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అనుభవం ఈసారి జట్టుకు పెద్ద అనుకూలాంశం. టీనేజర్‌గా 2009లో తొలి వరల్డ్‌ కప్‌ ఆడిన ఈ పంజాబీ అమ్మాయి ఇప్పుడు జట్టులో సీనియర్‌ సభ్యురాలిగా మారిపోయింది. 30 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ వరుసగా రెండో ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. ధనాధన్‌ ఆటకు పెట్టింది పేరైన హర్మన్‌ క్రీజులో నిలదొక్కుకొని బ్యాట్‌ ఝళిపించిందంటే స్కోరు బోర్డుపై పరుగుల వరద పారాల్సిందే. 2018 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై హర్మన్‌ప్రీత్‌ కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో 103 పరుగులు చేసింది. టి20ల్లో భారత్‌ తరఫున సెంచరీ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఓవరాల్‌గా కెరీర్‌లో 109 టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న హర్మన్‌ 2,156 పరుగులు సాధించింది. ఇందులో ఒక సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫీల్డర్‌గా 42 క్యాచ్‌లు పట్టిన హర్మన్‌ బంతితోనూ మెరిసి 29 వికెట్లు పడగొట్టింది. గత ప్రపంచకప్‌లో దొర్లిన పొరపాట్లను పునరావృతం చేయకుండా... పక్కా ప్రణాళికతో ఆడి... హర్మన్‌ నాయకత్వానికి ఇతర సభ్యుల ప్రతిభ తోడైతే భారత్‌ ఈసారి అద్భుతం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

నాన్న ప్రోత్సాహం..
1989లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో మార్చి 8న జన్మించిన హర్మన్‌కు క్రికెట్‌ కష్టాలేవీ లేవనే చెప్పాలి.  హర్మన్‌ తండ్రి హర్మీందర్‌ సింగ్‌ భుల్లర్‌ తనూ క్రికెటర్‌ కావడంతో కూతురు ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. హర్మన్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో స్థానిక కోచ్‌ కమల్దీష్‌ సింగ్‌ కూడా కీలకపాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణించి 19 ఏళ్లకే భారత సీనియర్‌ జట్టులో చోటు పొందిన హర్మన్‌ ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్‌ హోదాలో ప్రస్తుతం జట్టును ముందుండి నడిపించే బాధ్యతను నిర్వర్తిస్తోంది. బంతిని చూడటం... బలంగా బాదడమే హర్మన్‌కు తెలిసిన విద్య. భారత మాజీ ఓపెనర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ వీరాభిమాని అయిన హర్మన్‌.. 2017 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో  ఆస్ట్రేలియాపై (115 బంతుల్లో 171 నాటౌట్‌; 20 ఫోర్లు, 7 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చింది. 

తలో చేయి వేస్తేనే..
జట్టు క్రీడ అయిన క్రికెట్‌లో ప్రతిసారీ ఒకరిద్దరి ప్రతిభ కారణంగా గెలవలేం. భారత మహిళల జట్టు తొలిసారి విశ్వవిజేతగా అవతరించాలంటే ఆల్‌రౌండర్‌ హర్మన్‌ప్రీత్‌కు ఆమె సహచరులు కూడా తమ నైపుణ్యంతో తోడ్పాటు అందించాల్సిందే. ముందుగా ఓపెనర్లు స్మృతి మంధాన, 16 ఏళ్ల టీనేజ్‌ సంచలనం షఫాలీ వర్మ శుభారంభం ఇచ్చి గట్టి పునాది వేస్తే... ఆ తర్వాత 19 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ తదితరులు ఇన్నింగ్స్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారు. ఇక బౌలింగ్‌లో సీనియర్‌ పేసర్‌ శిఖా పాండే, హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి, పూజ వస్త్రకర్, స్పిన్నర్లు రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, పూనమ్‌ యాదవ్‌ విజృంభిస్తే భారత్‌ జైత్రయాత్రను ఎవరూ ఆపలేరు. 

ఏ జట్టు కెప్టెన్‌ ఎవరంటే...
ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
న్యూజిలాండ్‌: సోఫీ డివైన్‌
శ్రీలంక: చమరి ఆటపట్టు
బంగ్లాదేశ్‌: సల్మా ఖాతూన్‌
ఇంగ్లండ్‌: హీథెర్‌ నైట్‌
పాకిస్తాన్‌: బిస్మా మారూఫ్‌
దక్షిణాఫ్రికా: డేన్‌ వాన్‌ నికెర్క్‌
వెస్టిండీస్‌: స్టెఫానీ టేలర్‌
థాయ్‌లాండ్‌: సొర్నారిన్‌ టిపోచ్‌

► 7 - ప్రస్తుతం జరగబోయేది ఏడో టి20 ప్రపంచకప్‌. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) చాంపియన్‌గా నిలిచింది. ఒక్కోసారి ఇంగ్లండ్‌ (2009), వెస్టిండీస్‌ (2018) విజేతగా నిలిచాయి. 

 13- గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్‌ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

 ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ‘ఎ’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్‌)... ‘బి’ గ్రూప్‌లో ఐదు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, థాయ్‌లాండ్‌) ఉన్నాయి. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్స్‌లో నెగ్గిన రెండు జట్లు మార్చి 8న ఫైనల్లో టైటిల్‌ కోసం తలపడతాయి.

 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు మొత్తం నాలుగు నగరాల్లోని (పెర్త్, సిడ్నీ, మెల్‌బోర్న్, కాన్‌బెర్రా) ఆరు మైదానాల్లో జరుగుతాయి. టోర్నీలో జరిగే మొత్తం 23 మ్యాచ్‌లను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ప్రైజ్‌మనీ
విజేత జట్టుకు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.  
– కరణం నారాయణ, సాక్షి క్రీడా విభాగం

మరిన్ని వార్తలు