స్త్రీలోక సంచారం

7 Sep, 2018 00:07 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (త్రిపుల్‌ ఐటీ–హెచ్‌) లో మెషీన్‌ లెర్నింగ్‌ ల్యాబ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న శ్రీజా కామిశెట్టి.. గూగుల్‌ ‘గెట్‌–ఎహెడ్‌’ ఇ.ఎం.ఇ.ఎ. (యూరప్, మిడిల్‌ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్లు) ప్రోగ్రామ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. టెక్నాలజీ రంగంలో మహిళల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఆగస్టు 7–9 తేదీలలో లండన్‌లో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు ప్రపంచం మొత్తం మీద గూగుల్‌ 20 మందిని ఎంపిక చేయగా, భారతదేశం నుంచి శ్రీజ ఒక్కరికే ఈ అరుదైన అవకాశం లభించింది. 

కేంద్రంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ‘నల్సా’ (నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ) రూపకల్పన చేసిన పరిహార పథకానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్‌ 2 నుంచి అత్యాచార బాధితురాలికి రు.4 లక్షలు, సామూహిక అత్యాచార బాధితురాలికి రు. 5 లక్షలు తప్పనిసరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తమ పరిహార నిధి నుండి అత్యాచార బాధితురాలికి అందిస్తున్న సహాయం పది వేల నుంచి (ఒడిశా), పది లక్షల వరకు (గోవా) ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో అసలు పరిహారాన్ని చెల్లించే విధానమే లేకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దేశం మొత్తం మీద ఈ పథకం విధిగా అమలయ్యేలా చేయడం కోసం ‘నల్సా’ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని, ‘స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అ«థారిటీ (ఎస్‌.ఎల్‌.ఎస్‌.ఎ) లతో సమన్వయం కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

‘గూప్‌’ కంపెనీ వినూత్న ఉత్పత్తి ‘జేడ్‌ ఎగ్‌’.. ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వస్తున్న ఫిర్యాదులకు పరిహారంగా ఆ కంపెనీ యజమాని, హాలీవుడ్‌ నటి, బిజినెస్‌ ఉమన్, లైఫ్‌స్టెయిల్‌ గురు, సింగర్, ఫుడ్‌ రైటర్‌ అయిన 45 ఏళ్ల గ్వినెఫ్‌ పాల్ట్రో కోటీ నాలుగు లక్షల రూపాయలు (1,45,000 డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించారు. జేడ్‌ ఎగ్‌ను స్త్రీలు తమ జననాంగంలో చొప్పించుకోవడం ద్వారా అపరిమిత లైంగికశక్తిని, లైంగికేచ్ఛను పొందవచ్చని ‘గూప్‌’ కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి, వాటిని ఉపయోగించిన మహిళలు వాటి వల్ల తమకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదని ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియాలోని కోర్టు గ్వినెఫ్‌ పాల్ట్రోను పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఇండోనేషియాలోని అచ్‌ ప్రావిన్స్‌ పరిధిలోని రెస్టారెంట్‌లు, హోటళ్లలో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు అయితే తప్ప ఒక ఆడ, ఒక మగ కలిసి భోజనం చేయకూడదని ప్రభుత్వం తాజాగా నిషేధాజ్ఞలు విధించింది. ప్రస్తుతానికి అచ్‌లోని బిరుయన్‌ జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ నిషేధం ప్రకారం స్త్రీ తన భోజనాన్ని పురుషుడితో పంచుకోవడం కూడా జరిమానాకు దారి తీసే నేరం కాగా.. ఈ విధమైన నియంత్రణ వల్ల బహిరంగ ప్రదేశాలలో స్త్రీ, పురుషులు సభ్యతగా ఉంటారని, స్త్రీలు మరింత సౌకర్యవంతంగా ఉండగలుగుతారని స్థానిక షరియా ఏజెన్సీ అధికారి జుఫ్లివాన్‌ అంటున్నారు. 

ట్రంప్‌ దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఈ ఏడాది ఆరంభంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారి ఒకరిని శిక్ష పడకుండా గట్టెక్కించిన రియాలిటీ టెలివిజన్‌ స్టార్‌ కిమ్‌ కర్దేషియాన్‌ వెస్ట్‌ బుధవారం నాడు అనూహ్యంగా వైట్‌ హౌస్‌లోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు! ‘క్షమాభిక్ష, జైలు సంస్కరణలు’ అనే అంశంపై ఏర్పాటైన ఈ సమావేశంలోని ‘లిజనింగ్‌ సెషన్‌’లో కనిపించిన కిమ్‌ కర్దేషియాన్‌.. ట్రంప్‌ కూతురు ఇవాంకాను, ఆమె భర్త జేరెడ్‌ కుష్నర్‌ను  కలిసేందుకు వచ్చిన విషయాన్ని వైట్‌ హౌస్‌ సిబ్బంది ఒకరు బహిర్గతం చేశారు.  

తూర్పు ముంబైలోని ఘట్కోపర్‌లో ఇటీవల గోకులాష్టమి వేడుకలకు హాజరైన ఘట్కోపర్‌ ఎమ్మెల్యే రామ్‌ కడమ్‌.. ఒక యువకుడు తనకు వినిపించిన ప్రేమ గోడుకు స్పందిస్తూ.. ‘‘నీకు, నీ తల్లిదండ్రులకు ఇష్టమైతే చెప్పు. ఆ అమ్మాయిని కిడ్నాప్‌ చేయించైనా సరే తెప్పించి, నీతో పెళ్లి జరిపిస్తాను’’ అని భరోసా ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన ‘మహారాష్ట్ర స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌’.. ఆయన అన్న మాటలకు అర్థం ఏమిటో చెప్పాలని నోటీసు జారీ చేయడంతో.. అందుకు తిరుగు సమాధానంగా రామ్‌ కడమ్‌ క్షమాపణలు చెప్పారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు ఆలోచించి మాట్లాడకపోతే ఆ మాటలు సమాజంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని రామ్‌ కడమ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, కమిషన్‌ చైర్‌ పర్సన్‌ విజయ రహత్కర్‌ వ్యాఖ్యానించారు. 

దేశాభివృద్ధిలో మహిళల ఆర్థిక సాధికారత ఒక ప్రాధాన్యతాంశం కావాలని ఐశ్వర్యా రాయ్‌ అన్నారు. ఎన్‌.ఎస్‌.సి.ఐ. (నేషనల్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం నాడు ముంబైలో జరిగిన ఫ్యాషన్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్‌ మహాజన్, రశ్మీ ఠాక్రే, జూహీ చావ్లా, అమృతా రాయ్‌చంద్ర, షబానా అజ్మీలతో పాటు పాల్గొన్న ఐశ్వర్య.. ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, మహిళ ఆర్థిక సాధికారత దేశాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. 

80 ఏళ్ల వయసులో 2005 డిసెంబర్‌ 24న మరణించిన ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతి రామకృష్ణ జయంతి నేడు. 1926 సెప్టెంబర్‌ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించిన భానుమతి.. ‘వర విక్రయం’తో సినీ రంగ ప్రవేశం చేసి, లైలా మజ్ను, చండీరాణి, తాసీల్దారు, మల్లీశ్వరి వంటి అనేక చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందారు. 
 

మరిన్ని వార్తలు