స్త్రీలోక సంచారం

16 Nov, 2018 00:01 IST|Sakshi

బర్మా రాజకీయ నాయకురాలు, తిరుగుబాటు యోధురాలు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూచీకి 2009లో ఇచ్చిన ‘ది అంబాసిడర్‌ ఆఫ్‌ కన్‌సైన్స్‌ అవార్డు’ను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఉపసంహరించుకుంది. మానవహక్కుల కోసం ఒకప్పుడు బర్మా నియంత ప్రభుత్వంతో అలుపెరగక పోరాడిన సూచీ.. బర్మాలో రొహింగ్యా ముస్లింల ఊచకోత జరుగుతుంటే.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయారనీ, ఆ ధోరణి.. ఒకప్పుడు ఆమె పాటించిన విలువలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వ్యాఖ్యానించింది. అయితే అవార్డును వెనక్కు తీసుకోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని సూచీ తిరుగు సమాధానం ఇచ్చారు. 

 భారత ఎన్నికల సంఘం తొలిసారిగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో అందరూ మహిళలే ఉండే ఐదు పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసింది. స్థానిక భాషలో ‘స్నేహితురాలు’ అనే అర్థం వచ్చే ‘సంఘ్వారీ’ అనే పేరును ఈ ప్రత్యేక మహిళా పోలింగ్‌ బూత్‌లకు పెట్టింది. మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే ఈ బూత్‌లలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌లు, సూపర్‌వైజర్‌లు, భద్రతా సిబ్బంది.. అంతా మహిళలే కావడంతో.. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలైనప్పటికీ మహిళలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి బూత్‌లనే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

 హవాయి రాష్ట్రం నుంచి అమెరికన్‌ ‘కాంగ్రెస్‌’కు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్‌ (37) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2020) పోటీ చేయబోతున్నట్లు లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఒక సదస్సులో ఇండియన్‌ అమెరికన్‌ సంపత్‌ శివాంగి ప్రకటించారు. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో ఏవిధమైన అనువంశిక సంబంధాలూ లేనప్పటికీ ఆమె తల్లి.. హైందవ ధర్మాలను, ఆచారాలను పాటించడంతో తులసి కూడా తన పద్దెనిమిదవ ఏట నుంచీ హిందుత్వానికి ఆకర్షితురాలై, భారతీయురాలిగా పరిగణన పొందుతున్నారు. కాగా, తను అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు డాక్టర్‌ సంపత్‌ చేసిన ప్రకటనను తులసి ఖండించడం గానీ, నిర్ధారించడం గానీ చేయలేదు. 

మరిన్ని వార్తలు