స్త్రీలోక సంచారం

10 Jul, 2018 00:13 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

గోవా గవర్నర్‌ మృదుల సిన్హా.. గోవా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టభద్రులైన యువతీయువకులందరి చేతా.. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా వివాహాబంధాన్ని గట్టిగా నిలుపుకుంటాం’ అని.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. నిరుడు ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మృదుల ఇదే విధమైన ప్రతిజ్ఞ చేయిస్తూ, ‘‘చిన్న చిన్న విషయాలకు గొడవపడి, దాంపత్య బంధం నుంచి బయటికి వచ్చేయకండి. చివరి వరకు కలిసి మెలిసి ఆనందంగా జీవించండి. పెళ్లికి ముందు మ్యారేజీ కౌన్సిలింగ్‌ తీసుకుంటే, పెళ్లి తర్వాత కౌన్సెలింగ్‌ తీసుకునే అవసరం రాదు’’ అని హితవు చెప్పారు ::: హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్‌ రెండో వర్ధంతి సందర్భంగా కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగి, రాళ్లు విసురుతున్న మూకలను అదుపుచేయడం కోసం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక టీనేజ్‌ బాలికతో పాటు ముగ్గురు పౌరులు మరణించారు.

సున్నితమైన ప్రాంతాలలో సైనికులు ‘ఏరియా డామినేషన్‌ పెట్రోలింగ్‌’ జరుపుతున్నప్పుడు భవనాలపైకి ఎక్కి సైన్యంపై రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపినప్పుడు అద్లీబ్‌ జాన్‌ అనే 16 ఏళ్ల బాలిక మరణించిన మాట నిజమేనని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు అంగీకరించారు :::  త్రిపుల్‌ తలాక్‌కు  వ్యతిరేకంగా ఉద్యమించిన సామాజిక హక్కుల కార్యకర్త షయార బానో భారతీయ జనతా పార్టీలో చేరారు. మూడుసార్లు తలాక్‌ చెబితే చాలు, వివాహబంధం నుంచి తప్పుకోవచ్చనే వెసులుబాటును రద్దు చేయాలని 2016లో కోర్టును ఆశ్రయించి తొలిసారిగా దేశప్రజల దృష్టిలో పడిన ఉథమ్‌సింగ్‌నగర్‌ జిల్లా (ఉత్తరాఖండ్‌) కాశీపూర్‌ నివాసి షయార.. త్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమైనదని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ముస్లిం మహిళాహక్కుల పోరాటయోధురాలిగా గుర్తింపు పొందారు ::: తెలంగాణలో ‘షీ టీమ్‌’లు ఈవారంలో రెండు బాల్య వివాహాలను అడ్డుకుని, బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇప్పించాయి. భువనగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 16 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో, చౌటుప్పల్‌ పరిధిలో 15 ఏళ్ల బాలికకు 26 ఏళ్ల పురుషుడితో జరగబోతున్న వివాహాలను షీ టీమ్‌లు సమర్థంగా నివారించి, బాలికలను రక్షించాయి ::: ఈ ఏడాది మే 21న తొమ్మిదేళ్ల బాలికపై లైంగికదాడి జరిపిన వ్యక్తికి మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడినవారికి మరణశిక్ష విధించాలని గత ఏడాది డిసెంబరులో మధ్యప్రదేశ్‌ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ చేసిన ప్రతిపాదన అసెంబ్లీ ఏకగ్రీవ సమ్మతిని పొంది, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌ 21న అమలులోకి వచ్చాక, ఆ చట్టం కింద న్యాయస్థానం విధించిన తొలి మరణశిక్ష ఇదేనని అంటూ, ఈ మరణశిక్ష నేరస్తులకు ఒక బలమైన భయ సంకేతం అవుతుందని ఆ రాష్ట్ర హోమ్‌ శాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌ అన్నారు.

రాజకీయ చర్చల్లో ట్విట్టర్‌ ఒక శక్తిమంతమైన వేదికగా అవతరించాక, ఆ చర్చల్లోకి మహిళా జర్నలిస్టులను రానివ్వకుండా పురుష జర్నలిస్టులు తమకు తామే ప్రత్యేక గ్రూపులుగా ఏర్పడుతున్నారని ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రెస్‌/పాలిటిక్‌’లో వచ్చిన ఒక అధ్యయన ఫలితం వెల్లడించింది. ఒకవేళ మహిళా జర్నలిస్టులు ఎవరైనా పురుష జర్నలిస్టుల చర్చలకు రీ ట్వీట్‌ చేసినా, పురుషులు స్పందించడం లేదని, ఆ కారణంగా.. ట్విట్టర్‌లో రాజకీయ వేదికలపై మహిళా జర్నలిస్టులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, ఇది ఆరోగ్యవంతమైన పరిణామం కాబోదని.. అధ్యయ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది ::: స్త్రీవాదిగా ప్రసిద్ధుడైన కెనడా యువ ప్రధాని జస్టిన్‌ ట్రూడో రాజకీయాలలోకి రాకముందు రెండు దశాబ్దాల క్రితం ఒక మహిళా జర్నలిస్టు ఒంటిపై ఒకట్రెండు చోట్ల ఉద్దేశపూర్వకంగా చేతులతో తాకినట్లు (గ్రోపింగ్‌) అప్పటి ఒక పత్రిక తన సంపాదకీయంలో రాసిన విషయం.. మళ్లీ ఇప్పుడు కాలగర్భంలోంచి పైకి లేచిన నేపథ్యంలో ‘ఆ మహిళా రిపోర్టర్‌ను నేనే’ అంటూ రోజ్‌ నైట్‌ అనే జర్నలిస్టు ఒక ప్రకటన ఇచ్చారు. ‘‘నేనెందుకు ఆమెను తాకానో తెలియదు కానీ, మీరు అనుకుంటున్న ఉద్దేశంతోనైతే మాత్రం తాకి ఉండను’ అని జస్టిన్‌ ట్రూడో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన మర్నాడే రోజ్‌ నైట్‌ ఇలా బహిర్గతం అయ్యారు ::: ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె.. పదిహేనేళ్ల గాయత్రి.. అండర్‌–19 గర్ల్స్‌ సింగిల్‌ టైటిల్‌ గెలుచుకుని ఏషియన్‌ గేమ్స్‌కి ఎంపిక అయింది. కొచ్చిలో జరిగిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ ఫైనల్‌ పోటీలలో ‘అన్‌ సీడెడ్‌’ అయిన గాయత్రి తన ప్రత్యర్థి, నాలుగో సీడ్‌ ప్లేయర్‌ అశ్వినీభట్‌పై విజయం సాధించింది :::  

మరిన్ని వార్తలు