స్త్రీలోక సంచారం

20 Aug, 2018 00:07 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

చిన్నారులపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలను నివారించే విషయమై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో ‘ఇనఫ్‌ ఈజ్‌ ఇనఫ్‌’ (జరిగింది చాలు) అంటూ ఒక వర్క్‌షాప్‌ జరిగింది. ప్రభుత్వ టీచర్ల కోసం ‘షీ’ టీమ్స్, భరోసా సెంటర్లు నిర్వహించిన ఈ వర్క్‌షాపులో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్, అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ సిట్‌) శిఖా గోయెల్‌ పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. 

యు.ఎస్‌.లో నివాసం ఉంటున్న 9 ఏళ్ల సోహా నాజ్‌ అనే మూడో తరగతి బాలిక, ఎవరి సహాయమూ తీసుకోకుండా తనకై తనే తన ఇంటి ముందు కేక్స్, మిల్క్‌షేక్స్, మింట్‌ గ్రోన్‌ (పుదీనా) అమ్మి సంపాదించిన 300 డాలర్లను (సుమారు 21 వేల రూపాయలు) హైదరాబాద్‌ పాతబస్తీలోని దబీర్‌పురాలో ఉన్న ‘సానీ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌’కు విరాళంగా అందజేసింది! తినేందుకు తిండే లేని నిరుపేదలకు ఉచితంగా భోజనం పెడుతున్న ధార్మిక సంస్థల వీడియోలను చూసి స్ఫూర్తి పొంది, కష్టపడి డబ్బు సంపాదించి సోహా నాజ్‌ పంపిన ఈ డబ్బుతో 21 బియ్యం బస్తాలు వచ్చాయని ఫౌండేషన్‌ ప్రకటించింది.

వెనుకా ముందూ చూడకుండా బయోకాన్‌ కంపెనీ సి.ఎం.డి. కిరణ్‌ మజుందార్‌ షా ఆస్తిని జప్తు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇ.డి.) ను ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్, 2002’ ట్రిబ్యునల్‌ తప్పు పట్టింది. కిరణ్‌కు కనీస వివరణకు కూడా అవకాశం ఇవ్వకుండా.. బెంగళూరు కింగ్‌ఫిషర్‌ టవర్స్‌లో విజయ్‌ మాల్యా హౌసింగ్‌ ప్రాజెక్టు కింద కిరణ్‌ మజుందార్‌ షా 2012లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను ఇ.డి.జప్తు చేయడంపై విస్మయాన్ని వ్యక్తం చేసిన ట్రిబ్యునల్‌.. ఫ్లాట్‌ను జప్తు నుంచి విడిపించింది.

తలకొరివి పెట్టేందుకు, ఇతర అంత్యక్రియల్ని నిర్వహించేందుకు, కనీసం చితిస్థలికి వచ్చేందుకు మహిళల్ని అనుమతించని హైందవ సంప్రదాయంలో.. భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కర్మకాండల సందర్భంగా కాస్త పట్టు విడుపు కనిపించింది. వాజ్‌పేయి పెంపుడు కూతురు నమితా కౌల్‌ భట్టాచార్య ఆయన చితికి నిప్పు పెట్టడాన్ని.. మహిళలపై సమాజంలో ఉన్న నిషేధాలు క్రమంగా తొలిగిపోతున్నాయనడానికి ఒక సంకేతంగా సామాజిక పోకడల పరిశీలకులు పరిగణిస్తున్నారు. 

శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్లనే.. కేరళలో జలప్రళయం సంభవించిందని వ్యాఖ్యానించిన ఆర్‌.బి.ఐ. సలహాదారు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆర్థిక విభాగమైన ‘స్వదేశీ జాగరణ్‌ మంచ్‌’ కో కన్వీనర్‌ ఎస్‌.గురుమూర్తి ఇప్పుడు సోషల్‌ మీడియాలోని విమర్శల వరదల్లో చిక్కుకున్నారు. ప్రకృతి విలయాలకు, మానవ నిర్ణయాలకు ముడిపెట్టి ప్రజల్లో లేనిపోని అనుమానాలను కలిగించడం ద్వారా స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడం మంచిది కాదని ట్విట్టర్‌లో కొందరు ఆయనకు హితవు చెప్పారు. 

యు.ఎస్‌. ఆరిజోనా రాష్ట్రంలోని మెసా పట్టణంలో ‘బ్యానర్‌ డెజర్ట్‌ మెడికల్‌ సెంటర్‌’ ఐ.సి.యు.లో సేవలు అందిస్తున్న మొత్తం 16 మంది నర్సులూ గర్భిణులేనన్న విషయం అనుకోకుండా బయటికి వచ్చింది. ఫేస్‌బుక్‌ గ్రూపులో ఉన్న ఈ నర్సులందరూ ఒకరి గురించి ఒకరు వ్యక్తిగతమైన విషయాలు షేర్‌ చేసుకుంటున్నప్పుడు వీళ్లంతా కూడా గర్భిణులేననీ, వచ్చే అక్టోబర్‌–జనవరి నెలల మధ్య వీరు ప్రసవించబోతున్నారని.. వీరిలోనే ఒకరైన రోషల్‌ షర్మన్‌ పట్టలేని ఆనందంతో బహిర్గతం చేయడంతో ఈ ఆసక్తికరమైన సంగతి వెలుగులోకి వచ్చింది. 

 బ్రెస్ట్‌ క్యాన్సరో, లంగ్‌ క్యాన్సరో వైద్యులు నిర్థారించే క్రమంలోనే క్యాన్సర్‌కు చికిత్సను పొందుతూ 56 ఏళ్ల వయసులో 1974లో మరణించిన అమెరికన్‌ రచయిత్రి జాక్వెలీన్‌ సుసాన్‌ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 20న ఫిలడెల్ఫియాలో జన్మించిన సుసాన్‌ ‘వ్యాలీ ఆఫ్‌ ది డాల్స్‌’ (1966), ‘ది లవ్‌ మెషీన్‌ (1969), ‘వన్స్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’ (1973) పుస్తకాలతో విశేష పాఠకాదరణ పొందారు. 

21 ఏళ్ల వయసులో జేమ్స్‌బాండ్‌ చిత్రం ‘డై అనదర్‌ డే’ (2002)తో సినీ రంగ ప్రవేశం చేసిన రోసామండ్‌ పైక్‌.. ఆ చిత్రంలోని బాండ్‌ గర్ల్‌ పాత్ర ఎంపిక కోసం అండర్‌వేర్‌ మినహా తన ఒంటి మీద బట్టలన్నీ విప్పమని అడిగారని, అందుకు తను తిర స్కరించినప్పటికీ చివరికి ఆ పాత్ర తననే వరించిందని ఇన్నేళ్ల మౌనం తర్వాత ఇప్పుడు బయటపడ్డారు! రెండు రోజుల క్రితం ‘అమెజాన్స్‌ ఆడిబుల్‌ సెషన్స్‌’కి వెళ్లినప్పుడు ఈ రహస్యోద్ఘాటన చేసిన రోసామండ్‌.. తన తిరస్కారానికి ముగ్ధులవడం వల్లనే ఆ పాత్రను తనకు ఇచ్చినట్లు ఆ తర్వాత నిర్మాతలు తనతో అన్నారని కూడా చెప్పారు.
 

మరిన్ని వార్తలు