స్త్రీలోక సంచారం

25 Sep, 2018 00:12 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

26 ఏళ్ల అమెరికన్‌ పాప్‌ గాయని సెలెనా గోమెజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో చాటింగ్‌ చేస్తూ.. ‘‘మీ బెస్టీ (బెస్ట్‌ ఫ్రెండ్‌) టేలర్‌ స్విఫ్ట్‌ ఎలా ఉన్నారు?’’ అన్న ప్రశ్నకు.. ‘‘ఆమె చాలా బాగున్నారు. ఐ లవ్‌ హర్‌. షి ఈజ్‌ అమేజింగ్‌. ఇవాళే తనతో మాట్లాడాను. ఆమె నాకు పెద్దక్క లాంటిది. ప్రతి విషయాన్నీ తనతో షేర్‌ చేసుకుంటాను. ఆమె చాలా తెలివైంది. నాకు మంచి సలహాలు ఇస్తారు. ప్రతి మనిషికీ జీవితంలో ఇలాంటి ఒక బెస్టీ ఉండాలి’’ అని రిప్లయ్‌ ఇచ్చారు. ప్రియాంక చోప్రాను పెళ్లి చేసుకోబోతున్న నిక్‌ జోనాస్‌ (26) కొంత కాలం సెలెనా గోమెజ్‌ బెస్టీగా ఉండగా, అదే సమయంలో అతడి అన్న నిక్‌ జోనాస్‌..  టేలర్‌ స్విఫ్ట్‌కి బెస్టీగా ఉండడంతో.. ఈ నలుగురు పాప్‌ సింగర్‌లు అరమరికల్లేకుండా ఉండేవారు. 

ఒక నన్‌పై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల కొచ్చిలో ఐదుగురు నన్‌లు చేపట్టిన ప్రదర్శనకు మద్దతు ఇచ్చిందన్న ఆగ్రహంతో వయనాడు లోని మనంతవాడి డయోసిస్‌ ఆధ్వర్యంలోని సెయింట్‌ మేరీస్‌ చర్చి.. సిస్టర్‌ నాన్సీపై చర్య తీసుకుంది. అత్యారానికి గురయిన నన్‌కు న్యాయం జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఒక న్యూస్‌ చానల్‌ డిబేట్‌లో కూడా పాల్గొన్న సెయింట్‌ మేరీస్‌ ప్రావిన్స్‌ పరిధిలోని ఫ్రాన్సిస్కన్‌ క్లారిస్ట్‌ కాంగ్రెగేషన్‌ సభ్యురాలైన సిస్టర్‌ లూసీ కలప్పుర.. ఇక నుంచి చర్చికి సంబంధించిన ఏ ఒక్క విధినీ నిర్వహించడానికి వీల్లేకుండా చర్చి యాజమాన్యం ఆంక్షలు విధించింది. 

ప్రాచీన ఇంగ్లండ్‌ వివాహ సంప్రదాయంలో భాగంగా వధువు సంథింగ్‌ ఓల్డ్‌ (నిరంతరత), సంథింగ్‌ న్యూ (భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథం), సంథింగ్‌ బారోడ్‌ (సంతోషం), సంథింగ్‌ బ్లూ (స్వచ్ఛత, ప్రేమ, విశ్వసనీయత)లను గుర్తుగా ఉంచుకోవలసి ఉండగా.. ప్రిన్స్‌ హ్యారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ వీటిల్లో ఒకటైన ‘సంథింగ్‌ బ్లూ’గా హ్యారీతో తన తొలి డేటింగ్‌ రోజు వేసుకున్న నీలం రంగు డ్రెస్‌లోంచి చిన్న దారం ముక్కను తీసి, వెడ్డింగ్‌ డ్రెస్‌కు కలిపి కుట్టించుకున్నానని ఒక టీవీ డాక్యుమెంటరీలో చెప్పారు. అయితే ఇంగ్లండ్‌ రాణిగారిలా పూర్తిస్థాయిలో సంప్రదాయాలను తను పాటించలేకపోవచ్చని, అయినప్పటికీ అందుకు ప్రయత్నిస్తానని ‘క్వీన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ పేరుతో నేడు (మంగళవారం) బ్రిటన్‌లో ప్రసారం కానున్న ఈ డాక్యుమెంటరీలో మేఘన్‌ తెలిపారు. 

సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌ వెళుతున్న బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఆదివారం నాడు చెక్‌–ఇన్‌ సందర్భంగా సిడ్నీ విమానాశ్రయంలో మెల్‌ అనే ఆస్ట్రేలియన్‌ మహిళా సిబ్బంది తన పట్ల జాత్యాహంకారంతో ప్రవర్తించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చూస్తూ.. మనిషి రంగును బట్టి మర్యాద ఇవ్వడం హీనాతిహీనమైన స్వభావం అని మెల్‌పై విరుకుపడ్డారు. శిల్ప ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. తన లగేజ్‌ బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో తనను చాలాసేపు లోపలికి అనుమతించలేదని, మాన్యువల్‌గానైనా స్క్రీనింగ్‌ చెయ్యమని కోరినప్పటికీ.. తనను ఐదు నిముషాలకు పైగా అలాగే నిలబెట్టారని తన ఆవేదనను షేర్‌ చేసుకున్నారు. 

స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ గ్యాలన్‌ ప్రాంతంలో ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో బహిరంగ ప్రదేశాలలో ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడంపై నిషేధం విధించడం సబబే అని 67 శాతం మంది ఓటు వేశారు. బుర్ఖాను నిషేధిస్తూ స్విట్టర్లాండ్‌ ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టంపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండడంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో విడివిడిగా మళ్లీ రెఫరెండం తీసుకునేందుకు గత ఏడాది ఇదే గ్యాలన్‌ ప్రాంతంలో ప్రభుత్వం పోలింగ్‌ జరిపినప్పుడు కూడా.. దేశ ప్రజల భద్రత రీత్యా ముఖం కనిపించకుండా బుర్ఖా ధరించడం క్షేమకరం కాదు అని స్థానికులు తీర్పు ఇచ్చారు. 

మనోపాజ్‌ అన్నది పైకి మాట్లాడదగని విషయం కాదనీ, స్త్రీ దేహ పరిణామక్రమంలో సంభవించే ఒక స్థితి అని, స్త్రీ, పురుషులిద్దరికీ మోనోపాజ్‌పై అవగాహన ఉంటే స్త్రీల దైనందిన ఉద్యోగ జీవితంలో మానసిక ఒత్తిడులను మనం దూరం చేయవచ్చునని తెలియజెప్పేందుకు యు.కె.లోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ లస్టర్‌’ యాజమాన్యం తన సిబ్బంది కోసం ‘మెనోపాజ్‌ కే ఫ్‌’ లను ఏర్పాటు చేసింది. యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ బిజి¯ð స్‌ మహిళా ప్రొఫెసర్‌ ఆండ్రియా డేవిస్‌ చొరవతో మొదలై, నెలకొకసారి జరిగే ఈ మెనోపాజ్‌ కేఫ్‌లలో స్త్రీ, పురుష ఉద్యోగులు మెనోపాజ్‌పై నిర్బిడియంగా తమ ఆలోచనలు పంచుకుంటారు. 

సౌదీ అరేబియాలో 2016లో జుమనా అల్‌షమీ అనే మహిళ టీవీలో ఉదయం వార్తలు చదివిన తొలి మహిళగా గుర్తింపు పొందగా.. ఇప్పుడు వియమ్‌ అల్‌ దఖీల్‌ అనే మహిళ సౌదీ అరేబియా అధికారిక టీవీ చానల్‌ ‘టీవీ 1’లో ఒమన్‌ అల్‌ నష్‌వాన్‌ అనే యాంకర్‌తో కలిసి వార్తల్ని చదవడం ద్వారా.. ఈవెనింగ్‌ న్యూస్‌ బులెటిన్‌ను సమర్పించిన తొలి సౌదీ మహిళగా రికార్డు సృష్టించారు. దేశంలో సంస్కరణలు తెచ్చే ప్రయత్నంలో మహిళలపై ఉన్న ఆంక్షలను ఒకటొకటిగా తొలగించుకుంటూ.. ఇటీవలే మహిళలు డ్రైవింగ్‌ చెయ్యడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ ఆదేశాలు జారీ చేసిన సౌదీ రాజు ముహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. తాజాగా మహిళలు సాయంకాలపు వార్తలను చదవడానికి అనుమతి ఇచ్చారు. 

తొలి చిత్రం ‘బేఖుండి’ తో పాటు, దుష్మన్‌ (1998) కూడా తను నటించిన చిత్రాలతో తనకు ఇష్టమైన సినిమా అని చెబుతూ, దుష్మన్‌లో రేప్‌ సీన్‌ ఉన్నకారణంగా మొదట తను నటించనని చెప్పానని, అయితే దర్శక నిర్మాతలు ‘బాడీ డబుల్‌’తో (డూప్‌) ఆ సీన్‌ని లాగించేస్తామని చెప్పడంతో ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించానని తాజాగా పి.టి.ఐ.కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజోల్‌ వెల్లడించారు. తన పాతికేళ్ల బాలీవుడ్‌ కెరీర్‌లో 30 పైగా చిత్రాలలో నటించిన కాజోల్‌ అక్టోబర్‌ 12 రిలీజ్‌ అవబోతున్న ‘హెలికాప్టర్‌ ఈలా’ చిత్రంలో కనిపించబోతున్నారు.  

మరిన్ని వార్తలు