స్త్రీలోక సంచారం

29 Aug, 2018 00:12 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

ఏషియన్‌ గేమ్స్‌లో 50 కేజీల డివిజన్‌లో బంగారు పతకం గెలిచుకుని ఇండియా తిరిగొచ్చిన రెజ్లింగ్‌ స్టార్‌ వినేశ్‌ ఫోగట్‌కు, శనివారం విమానం దిగడంతోనే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె 24వ జన్మదినోత్సవం నాడే రెండు కుటుంబాల సమక్షంలో  చిరకాల స్నేహితుడైన ‘గ్రెకో–రోమన్‌’ స్టెయిల్‌ జాతీయ రెజ్లర్‌ సోమ్‌వీర్‌ రాథీతో నిశ్చితార్థం జరిగింది. జావెలీన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రాతో వినేశ్‌ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా మీడియాలో వినిపిస్తున్న వదంతులు ఈ నిశ్చితార్థంతో ఆగే అవకాశాలు ఉన్నప్పటికీ, ఆ వదంతుల్ని ఆపడం కోసమే ఈ నిశ్చితార్థం జరిగిందన్నా అన్న ప్రశ్నకు వినేశ్‌ నవ్వుతూ, ‘‘ప్రతి బర్త్‌డే ముందూ ఏదో ఒక ఈవెంట్‌లో నేను ఓడిపోవడం జరుగుతోంది. అనేక ఎదురుచూపుల తర్వాత దక్కిన ఈ అపురూపమైన విజయానికి నా జీవితంలోని మరొక అపురూపమైన సందర్భాన్ని జత చేయాలనుకుని నా ఫ్రెండ్‌ సోమ్‌వీర్, నేను పెద్దల అంగీకారంతో ఉంగరాలు మార్చుకున్నాం’’ అని చెప్పారు. 

పెద్దగా హానికరం కానివి అయిన నాలుగు ఇన్‌ఫెక్షన్‌లు.. టాక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగాలోవైరస్, హెర్పెస్‌ సింప్లెక్స్‌ వైరస్‌.. గర్భిణుల విషయంలో మాత్రం ప్రాణాంతకంగా పరిణమించి గర్భస్రావాలకు, శిశువులో పుట్టుక లోపాలకు, మృత శిశువులు జన్మించడానికి కారణం అవుతున్నాయని హైదరాబాద్‌లోని ప్రిన్సెస్‌ ఎస్రా హాస్పిటల్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయింది. డెక్కన్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లోని మైక్రోబయోలజీ విభాగం నుంచి ఒక బృందం, డెక్కన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ లోని ఫార్మాస్యూటికల్‌ మైక్రోబయోలజీ నుంచి ఒక బృందం కలిసి చేసిన అధ్యయనంలో పై నాలుగు వైరస్‌ల వల్ల చిన్న ప్రాణానికంటే పెద్ద ప్రాణానికే ఎక్కువగా ముప్పు వాటిల్లుతున్న విషయం బయటపడింది!

పదేళ్ల క్రితం 2007 డిసెంబరులో విజయవాడలో జరిగిన 19 ఏళ్ల బి.ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా అత్యాచారం, హత్య కేసులో.. ట్రయల్‌ కోర్టులో భద్రపరిచిన ఆమె ఒంటి మీది బట్టలు, ఇతర ధారణలు (సంఘటన జరిగిన రోజువి).. ట్రయల్‌ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దోషులు పైకోర్టుకు అప్పీల్‌ చేసుకోడానికి ముందే పాడైపోయాయని  ఆయేషా తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన  హైకోర్టు.. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను నాలుగు వారాల లోపు తమకు సమర్పించాలని ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు సత్యంబాబు అనే యువకుడిని దోషిగా నిర్ధారించడంలో ఏకపక్షంగా వ్యవహరించిందని  అభిప్రాయపడుతూ ఆ తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు, అప్పటికి పదేళ్లుగా జైల్లో ఉన్న సత్యంబాబును నిర్దోషిగా విడుదల చేసిన అనంతరం ఈ కేసు విచారణ ‘సిట్‌’ పరిధిలోకి వెళ్లింది. 

దావూదీ బోరా’ కమ్యూనిటీలో ఉన్న ‘ఫిమేల్‌ జెనిటల్‌ సర్కమ్‌సిషన్‌’ (బాలికల జననాంగానికి చేసే సున్తీ) ఆచారాన్ని నిషేధించాలని కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యానికి (పిల్‌) వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మాజీ అటార్నీ జనరల్‌ దివంగత గూలమ్‌ ఇ.వాహనవతి భార్య నఫీసా వాహనవతి తన మద్దతు ప్రకటించారు! ఈ విషయమై నఫీసా తరఫు న్యాయవాది మీనాక్షీ అరోరా.. సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. ఫిమేల్‌ జనిటల్‌ సర్కమ్‌సిషన్‌ అంటే క్లిటారిస్‌ను కత్తిరించడం అని ‘పిల్‌’లో పేర్కొన్నారనీ, నిజానికి అది క్లిటారిస్‌ పైన ఉండే చర్మాన్ని తొలగించడం మాత్రమేనని వివరించారు. 

మయన్మార్‌లోని 30 పోలీస్‌ స్టేషన్‌ల పైన, ఒక సైనిక స్థావరం మీద ‘అరహన్‌ రొహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ’ దాడులు జరిపినందుకు ప్రతీకారంగా గత ఏడాది ‘రోహాన్‌’ రాష్ట్రంలోని రొహింగ్యాలపై ప్రభుత్వ దళాలు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కాపాడు కోవడం కోసం పారిపోయి.. చెట్టుకొకరు పుట్టకొకరు అయిన 7 లక్షల మంది శరణార్థులలో వేలాదిమంది యువతులు, మహిళలు, బాలికలు.. అత్యాచారాలకు, లైంగిక హింసలకు గురై దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఐక్యరాజ్యసమితి దర్యాప్తు బృందాలు తాజాగా ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ మారణహోమాన్ని ఉద్దేశపూర్వకంగా నివారించలేకపోయిన మయన్మార్‌పై ఆంక్షలు విధించడంతో పాటు.. ఆ దేశాన్ని అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి ఈడ్చాలని కూడా యు.ఎన్‌. దర్యాప్తు నివేదిక.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సూచించింది. 

స్త్రీల అణచివేత ఉన్న వాతావరణంలో కన్నా.. స్త్రీ, పురుష ఆర్థిక సమానత్వం ఉన్న చోట్లే ఎక్కువగా మహిళల నుంచి సెక్సీ సెల్ఫీలు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ అవుతున్నట్లు ‘నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌లో వచ్చిన ఒక అధ్యయన వ్యాసం వెల్లడించింది. స్త్రీ సౌందర్యీకరణ ఉన్న చోట స్త్రీ సాధికార త సాధ్యం కాదనే అభిప్రాయానికి భిన్నంగా తమ అధ్యయన ఫలితాలు ఉన్నట్లు చెబుతూ, ఇందుకోసం 113 దేశాలలోని వేలాది సోషల్‌ మీడియా పోస్టులను పరిశీలించిన మీదట ఒక ఈ విధమైన ముగింపునకు వచ్చామని అధ్యయనానికి సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌ ప్రొఫెసర్‌ ఖండిస్‌ బ్లేక్‌ ఆ వ్యాసంలో రాశారు.

సుసాన్‌ అనే కెనడియన్‌ వధువు, ముందుగా తను కోరినప్పటికీ ఎవరూ తన పెళ్లికి నగదు బహుమతి పంపించనందుకు కలత చెంది, పెళ్లిని రద్దు చేసుకుని, ఆ విషయాన్ని ఫేస్‌బుక్‌లో ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్‌ చేసింది. ‘‘అందరూ వినండి. మీరు తగినన్ని నగదు బహుమతులు ఇవ్వకుంటే మా.. నవ జీవితం ఎలా ప్రారంభం అవుతుంది? అందుకే నేను, నా చిన్ననాటి స్నేహితుడైన వరుడు ఈ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాం. ఇందుకు పూర్తిగా బాధ్యత వహించవలసింది మీరే’’ అంటూ ఆమె ఆ సుదీర్ఘమైన పోస్టును ముగించింది. 

‘వేర్‌ ఈజ్‌ ద వెంకట లక్ష్మి’ అనే టైటిల్‌తో ప్రారంభమైన హారర్, కామెడీ తెలుగు చిత్రంలో రాయ్‌ లక్ష్మి.. సెక్సీ స్కూల్‌ టీచర్‌ పాత్రలో నటిస్తున్నారు. లక్కీ లక్కీ రాయ్‌ (బలుపు), తౌబా తౌబా.. (సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌), అమ్మడూ.. లెట్స్‌ డూ కుమ్ముడు (ఖైదీ నెం. 150) పాటలతో యువతరాన్ని డాన్స్‌ చేయించిన రాయ్‌ లక్ష్మి.. ఇప్పుడీ కొత్త సెక్సీ పాత్రలో ఒక అంతర్లీన సందేశాన్ని కూడా యూత్‌కి ఇవ్వబోతున్నారట.

మరిన్ని వార్తలు