స్త్రీలోక సంచారం

25 Oct, 2018 00:14 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

బ్రూస్‌ అలెగ్జాండర్‌ టెక్సాస్‌ నుంచి న్యూ మెక్సికోకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడొక సాధారణ ప్రయాణికుడు. అయితే ఫ్లయిట్‌ ఆల్‌బుకర్క్‌లో దిగాక మాత్రం ‘పేరుమోసిన’ ప్రయాణికుడు అయ్యాడు! పోలీసులు అతడి చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడంతో అతడలా పేరు మోశాడు! ప్రయాణంలో బ్రూస్‌ తన సహ ప్రయాణికురాలిపై కనీసం రెండుసార్లు కావాలని తలవాల్చాడు. ఒకసారి తన వేళ్లతో ఆమె వక్షోజాలను తాకాడు. ఆ మహిళ ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు, కోర్టు అంటూ తిరుగుతున్నాడు. ఇవన్నీ కాదు.. విచారణలో అతడు అన్న మాటలకు ఈ రెండు డిపార్ట్‌మెంట్‌లు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ‘‘నచ్చిన స్త్రీల అవయవాలను తాకడం తప్పేం కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు కొనాల్డ్‌ ట్రంపే అన్నాక.. (2005లో అన్నాడట) నేను చేసిన పని తప్పెలా అవుతుంది?’’ అని బ్రూస్‌ ప్రశ్నించాడు. దేవుడా.. ఈ మగాళ్లున్నారే...! 

‘ది షూటింగ్‌ స్టార్‌ : ఎ గర్ల్, హర్‌ బ్యాక్‌ప్యాక్‌ అండ్‌ ది వరల్డ్‌’ అనే కొత్త పుస్తకం మార్కెట్‌లోకి వచ్చింది. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ప్రచురణ ఇది. రచయిత్రి శివ్యానాథ్‌ ఎప్పటి నుంచో ‘సోలో’ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ అనుభవాలను, అనుభూతులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. శివ్యానాథ్‌ది డెహ్రాడూన్‌. ఆమె తొలి జర్నీ సింగపూర్‌. అక్కడినుంచి ఆగ్నేయాసియా దేశాలన్నీ చుట్టి వచ్చారు. కొంతకాలం సింగపూర్‌ టూరిజం బోర్డులో పనిచేశారు. మంచి ఉద్యోగమే కానీ, ఎందుకో ఆమెకు ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. 2011లో స్పితీ వ్యాలీకి (హిమాలయాలు) వెళ్లి, నెలపాటు సన్యాసినిగా గడిపినప్పుడు ఆ ఏకాంత ప్రశాంత వాతావరణంలో.. జీవితం అంటే ‘సోలో జర్నీ’ అని అర్థం చేసుకున్నారు శివ్యానాథ్‌. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ తిరిగొచ్చారు. ఊహల్లోకి, కలల్లోకి, నక్షత్రాల్లోకి, పచ్చటి పర్వతాల్లోకి, ప్రపంచ పచ్చిక బయళ్లలోకి శివ్యా చేసిన తొలి సోలో జర్నీ అది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడల్లో ప్రయాణించారు. రకరకాల మనుషుల్ని కలుసుకున్నారు. మారిషస్‌ కూడా వెళ్లారు. అక్కడ ఆమెకు స్వర్గం కనిపించింది! స్వర్గమే కానీ కొన్ని భయాలు కూడా వెంటాడాయి. శివ్యా.. మధ్య అమెరికా దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు స్పానిష్‌ భాష నేర్చుకున్నారు. అక్కడి మన్యన్‌ తెగలతో కలిసి జీవించే ప్రయత్నం చేశారు. 2014లో దక్షిణ ఆస్ట్రేలియాలోని ద్రాక్షతోటల్లో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ ఆమెకు హిందీ మాట్లాడే గుజరాత్‌ మూలాలున్న పోలెండ్‌ దేశస్థుడు పరిచయం అయ్యాడు. టర్కీ, బెహ్రెయిన్, కెనడా.. శివ్యా పర్యటించిన దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో అయితే ఆమె విహరించని ప్రదేశమే లేదు. ఈ అనుభవాలనన్నింటినీ శివ్యానాథ్‌ ఈ పుస్తకంలో రాశారు. పర్యాటనల అనుభవాలు ఎవరివి వారివే అయినా, శివ్యా అనుభవాలు ఒంటరి ప్రయాణాలకు మహిళల్ని ప్రేరేపించేంత శక్తిమంతంగా ఉన్నాయి. బహుశా ఆ శక్తి ఆమె రచనా శైలిది కావచ్చు. 

‘పిచ్చి అభిమానం’ అంటుంటారు.  ఈ స్థాయి అభిమానం సాధారణంగా ఫ్యాన్స్‌కి ఉంటుంది. అయితే అమెరికన్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌కు ఇంత పిచ్చి అభిమానం తన ఫ్యాన్స్‌ మీద ఉంది! వాళ్లకు ఏమైనా కష్టం వస్తే ఆమె తట్టుకోలేరు. తను చేయగలిగింది చేస్తారు. ఈ దయాగుణ సంపన్నురాలు చేయగలిగింది ఏముంటుంది? ఆర్థికంగా ఆదుకుంటారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు’ అనుకుంటారు. తాజాగా శాడీ బార్టెల్‌ అనే మహిళా అభిమానికి ఆమె 15,000 డాలర్లను విరాళంగా పంపించారు. శాడీ విషయం ఆమె వరకు ఎలా వచ్చిందంటే.. విరాళాల కోసం టేలర్‌ స్విఫ్ట్‌ను, ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ట్విట్టర్‌లో శాడీ ఒక మెసేజ్‌ పెట్టింది. టేలర్‌ వెంటనే ఆ మెసేజ్‌కు స్పందించి డబ్బు పంపారు. ‘‘హేయ్‌ గయ్స్‌! ఎంతో ఆవేదనతో ఈ పోస్ట్‌ పెడుతున్నాను. వీలైతే నాకు, నా కుటుంబానికి సహాయం చెయ్యండి. వెంటనే ఇప్పుడేం చెప్పలేను కానీ.. అకస్మాత్తుగా ఏంటిది అని అనుకోకండి. ఐ లవ్‌ యు గైస్‌. నేను మా అమ్మను బతికించుకోవాలి. అందుకే సహాయం అడుగుతున్నా. నా వయసు ఇప్పుడు 19 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో చేతులు చాస్తున్నాను’’ అని శాడీ ట్విట్టర్‌ పెట్టారు. ఆ అమ్మాయి చెబుతున్నదానిని బట్టి ఆమె తల్లికి అల్సర్‌ కారణంగా రక్తస్రావం జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్‌ అందక.. చివరికది ‘బ్రెయిన్‌ హెమరేజ్‌’కు దారి తీసింది. ఆమె చికిత్స కోసం టేలర్‌ డబ్బు పంపగానే శాడీ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఆమె దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. టేలర్‌ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని ఎమోషనల్‌ అయింది. 

ఇండియాలో స్థిరపడిన 34 ఏళ్ల ఫ్రెంచి ప్రయోగశీల నటి, రచయిత్రి కల్కీ కేక్లాన్‌.. దీపపు పురుగులా ఇప్పుడు డిజిటల్‌ స్పేస్‌లో తిరుగుతున్నారు. ‘స్మోక్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో ఆన్‌లైన్‌ వినోదాల ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెడుతున్న కేక్లాన్‌.. ‘స్కేర్డ్‌ గేమ్స్‌’ వెబ్‌ సిరీస్‌లోని అత్యుత్తమ కథా, సాంకేతిక, నట ప్రమాణాలను చూసి స్ఫూర్తి పొందారు. గోవాలో చిత్రీకరించిన ఈ ‘స్మోక్‌’ అనే క్రైమ్‌ డ్రామాలో కేక్లాన్‌ అసమాన ప్రతిభను కనబరిచినట్లు ‘స్మోక్‌’ దర్శకుడు నీల్‌ గుహా ఆమెను ప్రశంసిస్తుండగా.. ‘‘కనీసం ఆ మాత్రమైనా చేయలేకపోతే వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టడం దుస్సాహమే అవుతుంది’’ అని కేక్లాన్‌ నవ్వుతూ అంటున్నారు. రేపటి నుంచి (అక్టోబర్‌ 26) ‘ఈరోస్‌ నౌ’ లో వీక్షకులకు అందుబాటులోకి రానున్న 11 ఎపిసోడ్‌ల ‘స్మోక్‌’ ఇప్పటికే ఈ ఏడాది కాన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అవకాశం పొందింది. ఒక వెబ్‌ సిరీస్‌ కాన్స్‌ వెళ్లడం ఇదే మొదటిసారి. 

అన్ని వయసులలోని మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశార్హతను కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన మహిళా ఉద్యమకారులతో గతవారం శబరిమల ఆలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సున్నితమైన అంశంపై వ్యాఖ్యానించడానికి కేంద్రంలో అధికార పక్షం నుంచి ప్రముఖులెవరూ ఇంతవరకు ముందుకు రాని పరిస్థితుల్లో తొలిసారి స్మృతీ ఇరానీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం నా ఉద్దేశం కాదు. కానీ మనసుకు అనిపించిన మాట చెబుతాను. నెలసరి రోజుల్లో రక్తస్రావంతో తడుస్తున్న వస్త్రంతో (ప్యాడ్‌) మనం మన స్నేహితుల ఇళ్లకు వెళతామా?! వెళ్లము కదా. ఇదీ అంతే అనుకోవాలి. ఆచారశుభ్రత ఎంత ముఖ్యమో, ఆచారాలను పాటించడానికి వ్యక్తిగత శుభ్రతా అంతే అవసరం. నాకు ప్రార్థించే హక్కు ఉండొచ్చు. కానీ అపవిత్రం చేసే హక్కు లేదు’’ అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి అన్నారు. వ్యక్తిగత హోదాలో, ఒక పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు దుమారం రేగుతోంది. 

 

మరిన్ని వార్తలు