స్త్రీలోక సంచారం

18 Dec, 2018 00:34 IST|Sakshi

అరవై ఐదేళ్ల ఆమ్రాదేవి నలభై ఏడేళ్ల నిరీక్షణ ఈ ఆదివారం ‘విజయ్‌ దివస్‌’ రోజున ఫలించింది. ఆమె నిరీక్షిస్తున్నది తన భర్తను చూడడం కోసం. ఆమ్రాదేవి ఉత్తరకాశీ అమ్మాయి. పద్దెనిమిదేళ్ల వయసులో పెళ్లయింది. అప్పటికి ఆమె భర్త వయసు ఇరవై ఏళ్లు. అతడి పేరు సుందర్‌. పెళ్లయ్యే నాటికి సుందర్‌ భారత సైన్యంలో ‘బ్రిగేడ్‌ ఆఫ్‌ ద గార్డ్స్‌’ రెజిమెంట్‌లో సైనికుడు. పెళ్లయ్యాక ఫొటో దిగడం కోసం దగ్గరలోని దుండా పట్టణానికి పెద్దవాళ్లు ఈ దంపతుల్ని తీసుకెళ్లబోతుండగా సుందర్‌కి కబురొచ్చింది, తక్షణం వచ్చి యుద్ధంలో చేరమని! భార్య చెయ్యి వదిలి అప్పటికప్పుడు యుద్ధక్షేత్రంలోకి దుమికాడు సుందర్‌. 1971 ఇండో–పాక్‌ వార్‌ అది. అయితే యుద్ధానికి వెళ్లాక అతడు మళ్లీ తిరిగి రాలేదు. అతడి మృతదేహం తూర్పు పాకిస్తాన్‌ భూభాగంలో ఎక్కడో గుర్తు తెలియని చోట ఖననం అయింది. ఇన్నేళ్లలోనూ భర్త ఎలా ఉంటాడో మర్చిపోయింది కానీ, భర్తతో తన బంధాన్ని మర్చిపోలేదు ఆమ్రాదేవి. మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. సైన్యంలో ఉండగా అతడు తీయించుకున్న ఫొటోనైనా (ఒకవేళ తీయించుకుని ఉంటే) చూడకపోతానా అని ఎదురుచూస్తూ ఉంది. అందుకోసం ప్రయత్నాలు కూడా చేసింది. జిల్లా యంత్రాంగంలోని అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఎట్టకేలకు డిసెంబర్‌ 16న.. ఆ యుద్ధంలో పాకిస్తాన్‌పై ఇండియా గెలిచిన ‘విజయ్‌ దివస్‌’ రోజు ఆమ్రాదేవి చేతికి ఆమె భర్త ఫొటో అందింది. సైనికుల గ్రూప్‌ ఫొటోలోంచి సుందర్‌ని వేరు చేసి, అతడి ఫొటోను పెద్దదిగా చేసి, దానికి ఫ్రేమ్‌ కట్టించి జిల్లా అధికారులు ఆమెకు కానుకగా అందజేశారు! లక్కీ కదా! ‘‘అయితే ఆమె కాదు, మేము లక్కీ’’ అంటున్నారు  సైనిక్‌ వెల్ఫేర్‌ బోర్డు డి.డి.పంత్‌. ‘‘ఆమ్రాదేవి అభ్యర్థన మేరకు సిపాయి సుందర్‌ ఫొటో ఎక్కడైనా దొరుకుతుందా అని మావాళ్లు కూడా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక దొరకదని అనుకున్నాక సుందర్‌ బొమ్మను వేయించి ఆమ్రాదేవికి అందజేశాం. అయితే పోలికలు గుర్తుపట్టలేకపోతున్నానని ఆమె అన్నారు!. మళ్లీ వెతుకులాట ప్రారంభించాం. చివరికి అతడు పని చేసిన రెజిమెంట్‌ ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్రలో రికార్డులన్నీ గాలించాం. మొత్తానికి ఓ గ్రూప్‌ ఫొటోలో సుందర్‌ దొరికాడు’’ అని పంత్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఎలా ఉండేవారో, ఎలా మాట్లాడేవారు మర్చేపోయాను. కానీ ఆయన స్వరూపం లీలగా నేటికీ నా కళ్లలో కదలాడుతూనే ఉంది. యుద్ధంలో శత్రువుతో పోరాడుతూ ఆయన చనిపోయారని తెలుసుకోగానే గర్వంగా అనిపించినప్పటికీ, నా శరీరంలోని ఒక భాగాన్ని కోల్పోయినట్లుగా బాధపడ్డాను’’ అన్నారు ఆమ్రాదేవి, ఫొటోలో తన భర్తను కళ్ల నిండా చూసుకుంటూ. 

ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఎంపీలు, పార్లమెంటు అధికారులతో పాటు ఒక సాధారణ మహిళ కూడా ఆ ప్రాంగణంలో  కనిపిస్తున్నారు! ఆమె పేరు పూర్ణిమా గోవిందరాజులు. వయసు 54. చేతిలో కాగితాల కట్ట పెట్టుకుని, స్పష్టతనిచ్చే ఒక ప్రజాప్రతినిధి కోసం ఆమె వెదుకుతున్నారు. అది ఆమె జీవిత సమస్యకు అవసరమైన స్పష్టత. ఈ ఏడాది అక్టోబర్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఒక ప్రకటన చేశారు. బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా ‘పోక్సో’ చట్టం (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌)– 2012 కింద ఎప్పుడైనా నిందితుడిపై ఫిర్యాదు చేయవచ్చుననీ, అందుకు కాలపరిమితి అంటూ ఏమీ లేదన్నది ఆ ప్రకటన సారాంశం. పూర్ణిమ ప్రస్తుతం కెనడాలో కన్సర్వేషన్‌ బయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమె కుటుంబం చెన్నైలో ఉన్నప్పుడు పదేళ్ల వయసులో సమీప సన్నిహితుడొకరు పూర్ణిమను లైంగికంగా వేధించి, కొన్నాళ్లపాటు నరకం చూపించాడు. అతడింకా జీవించే ఉన్నాడు. ఇప్పుడు అతడిపై పోక్సో చట్టం కింద కేసు వేసేందుకు కెనడా నుంచి ఇండియా వచ్చారు పూర్ణిమ. అయితే పోక్సో చట్టం అమల్లోకి రావడానికి ముందు జరిగిన సంఘటన కనుక దానిపై పోక్సో చట్టం ప్రకారం కేసు వేయవచ్చా అన్న స్పష్టత వచ్చే వరకు కేసును స్వీకరించడం కుదరక పోవచ్చునని పూర్ణిమ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఆ స్పష్టత కోసమే పూర్ణిమ పార్లమెంటు ప్రాంగణంలో మంత్రులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మేనకాగాంధీని సంప్రదించే ఆలోచనలోనూ ఉన్నారు. శుక్రవారం నాడు పార్లమెంటులో ఒక ఎంపీ.. ‘బాధితులెవరైనా, ఏ వయసులో లైంగిక వేధింపులకు గురైనా’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ప్రకటనపై స్పష్టతను కోరడంతో పూర్ణిమలో ఆశలు చిగురించాయి. 2019 జనవరి 11న పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు తన  సమస్యకొక పరిష్కారం దొరకొచ్చని ఆమె భావిస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు