స్త్రీలోక సంచారం

5 Jan, 2019 00:45 IST|Sakshi

ఇంత మంచి గుడ్‌ వరల్డ్‌లో ఉన్నాం కదా.. ‘కన్యత్వ పరీక్ష’ అనే బ్యాడ్‌ వర్డ్‌ ఇంకా వినిపిస్తూనే ఉంది! ఒక ఆడపిల్ల కన్యా, కాదా? అని తెలుసుకోడానికి చేసే అనాగరికమైన పరీక్ష ఇది. ఇందులోనే ఇంకా అనాగరికం.. కొందరు డాక్టర్లు చేసే ‘టూ–ఫింగర్‌ టెస్ట్‌’. సాధారణంగా.. ఒక యువతి, లేదా బాలికపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణల్లో నిజముందా లేదా నిర్థారించడానికి చేసే పరీక్షల్లో టూ–ఫింగర్‌ టెస్ట్‌ ఒకటి.  బాధితురాలి జననావయవంలోకి రెండు వేళ్లు చొప్పించి, ఆ వేళ్లు సులువుగా లోపలికి ప్రవేశించగలిగితే ఆమె కన్య కాదనీ, వేళ్ల ప్రవేశం కష్టం అయితే ఆమె కన్య అని ఒక కంక్లూజన్‌కి వస్తారు! ఈ టెస్ట్‌లోనే వేళ్లకు కన్నెపొర (జననావయవ అంతర్‌ ముఖద్వారంలో ఉండే పొర) అడ్డుపడితే ఆమె కన్య అయినట్లు, పొర అడ్డుపడకపోతే ఆమె కన్య కానట్లు భావిస్తారు. ఇదొక అర్థం లేని పరీక్ష అని నికార్సైన వైద్య నిపుణులు ఏనాడో తేల్చి పారేసినప్పటికీ.. ఇప్పటికీ చాలాచోట్ల అత్యాచారం కేసులలో అధికారికంగా, నూతన వరుడు సందేహపడిన సందర్భంలో అనధికారికంగా ఈ ‘టూ–ఫింగర్‌ టెస్ట్‌’ చేస్తున్నారు. కన్నెపొర లేకపోవడానికి, జననాంగ గోడలు వదులుగా ఉండడానికి కన్యత్వాన్ని కోల్పోవడమే కారణమవక్కర్లేదు.

పొర, వదులు అన్నవి ఆటల్లో పోవచ్చు. ఇప్పుడీ బ్యాడ్‌ టాపిక్‌ ఎందుకొచ్చిందంటే.. ఓ గుడ్‌ డాక్టర్‌ ఈ ‘టూ–ఫింగర్‌ టెస్ట్‌’ను వైద్య పాఠ్యాంశాలలోనే లేకుండా తొలగించాలని కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారు. ఆ డాక్టరు గారి పేరు ఇంద్రజిత్‌ ఖండేకర్‌. మహారాష్ట్రలోని సేవాగ్రామ్‌లో ఉన్న ‘మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’ లో ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయినా ‘టూ–ఫింగర్‌ టెస్ట్‌’ అనే ఈ పరీక్ష.. వైద్యపుస్తకాల్లో ఎందుకు ఉన్నట్లు? మొదట ఎవరో చేర్చారు. తర్వాత ఎవరూ మార్చలేదు. డాక్టర్‌ ఖండేకర్‌ ఆరోగ్య శాఖకు మాత్రమే రాయలేదు. భార త వైద్య మండలికి, కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, మహారాష్ట్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కూ.. ఈ టూ–ఫింగర్‌ టెస్ట్‌ ప్రస్తావనను పుస్తకాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తులు పంపారు. ‘ఇదొక బుద్ధిలేని, అసంబద్ధమైన పరీక్ష’ అని ఆయన ‘టూ–ఫింగర్‌ టెస్ట్‌’ను వర్ణించారు. ఆడపిల్లను ఫిజికల్‌గా బాధ పెట్టి, అవమానించే ఈ పరీక్ష మహిళపై జరిగే హింస కంటే కూడా ఎక్కువే అని అంటారు ఖండేకర్‌. 2018 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి విభాగం అయిన ‘యు.ఎన్‌. ఉమెన్‌’  కూడా ఇదే మాట చెప్పింది. అయితే మొత్తం అన్ని రకాలైన కన్యత్వ పరీక్షల గురించి చెప్పింది. ఇలాంటి పరీక్షలకు ముగింపు పలకాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చింది. 

‘ది క్వింట్‌’ భారతదేశంలో పేరున్న న్యూస్‌ వెబ్‌సైట్‌. ఇంగ్లిష్, హిందీ భాషల్లో వస్తోంది. క్వింట్‌ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ‘మి, ది ఛేంజ్‌’ క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయబోతున్న 18–23 ఏళ్ల మధ్య వయసు గల యువతులలోంచి ‘ఉమన్‌ అచీవర్‌’ని ఎంపిక చేయడం కోసం నామినేషన్‌లను ఆహ్వానిస్తోంది. సైట్‌లోకి వెళ్లి, నామినేషన్‌ ఫారమ్‌లో మీకు తెలిసిన యంగ్‌ ఉమెన్‌ అచీవర్‌ వివరాలను పొందుపరిస్తే చాలు. మీరు నామినేట్‌ చేస్తున్నప్పుడు మీ పేరును వెల్లడించడం తప్పనిసరేం కాదు. మీ ఇ–మెయిల్, మీ కాంటాక్ట్, మీరు సూచిస్తున్న యువతి పేరు, ఆమె వయసు, ఆమె సాధించిన విజయం, ఆమె వివరాలు ఇస్తే సరిపోతుంది. మీ ఫ్రెండ్స్, మీ సోదరి.. వారెవరైనా సరే మీరు నామినేట్‌ చెయ్యొచ్చు. ‘మి, ది ఛేంజ్‌’ కాంపెయిన్‌కి ప్రముఖ మలయాళీ నటి పార్వతి తన సహకారం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు