స్త్రీలోక సంచారం

31 Aug, 2018 00:13 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

వచ్చే ఏడాది మార్చిలో ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో, సమాఖ్యేత దేశాలతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలలో భాగంగా ఆఫ్రికా ఖండంలో మూడు దేశాల పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే.. దక్షిణాఫ్రికా పట్టణం కేప్‌ టౌన్‌లోని ఏద్‌ ఎంకిజే హైస్కూల్‌ను సందర్శించినప్పుడు, ఆ పాఠశాల పిల్లలతో కలిసి చేసిన నృత్యంపై సోషల్‌ మీడియాలో వెక్కిరింపులు, విపరీత వ్యాఖ్యలు మొదలయ్యాయి. 61 ఏళ్ల థెరిసా మే.. మనిషి మొత్తం బిగదీసుకుపోయి కాళ్లు, చేతులు మాత్రమే కదుపుతూ రోబోలా డ్యాన్స్‌ చేశారని, ఓ ఆత్మ నిద్రలోంచి లేచి వచ్చినట్లుందనీ, ఆమె అసలు డ్యాన్స్‌ చేయకుండా ఉండినా బాగుండేదని ఆమెపై విమర్శలే ఎక్కువగా రాగా, అతి కొద్దిమంది మాత్రం.. పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడు ఎవరికైనా ఉత్సాహం రావడం సహజమే కాబట్టి, థెరిసా మే నృత్యాన్ని సహజమైనదిగా, పసి మనసంత అందమైనదిగా చూడాలని కామెంట్‌లు పోస్ట్‌ చేశారు. 

ప్రిన్స్‌ హ్యారీ భార్య మేఘన్‌ మార్కెల్‌ ఈ ఏడాది మే 19న పెళ్లి రోజు ధరించిన వెడ్డింగ్‌ గౌన్‌ను అక్టోబర్‌ 26 నుంచి జనవరి 6 వరకు బెర్క్‌షైర్‌లోని విండ్సర్‌ పట్టణంలో ఉన్న విండ్సర్‌ క్యాజిల్‌లో,  వచ్చే జూన్‌ 14 నుంచి అక్టోబర్‌ 6 వరకు స్కాట్లాండ్‌లోని హోలీరూడ్‌ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచుతున్నారు. వజ్రాలు పొదిగిన ఆ తెల్లటి గౌనుతో పాటు.. పెళ్లికి ప్రిన్స్‌ హ్యారీ ధరించిన దుస్తులను కూడా పౌరవీక్షణకు ఉంచుతున్నారు. 

ఒక హాస్యభరిత కార్యక్రమంలో (స్కిట్‌) మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ సతీమణి కొరెట్టా స్కాట్‌ పాత్రను పోషించి, మార్టిన్‌పై జోకులు వేసినందుకు తను ఎంతగానో చింతిస్తున్నట్లు అమెరికన్‌ పాప్‌ గాయని కార్డీ బీ.. మార్టిన్‌ కుమార్తెకు క్షమాపణలు చెప్పుకున్నారు. ‘రియల్‌ హౌస్‌వైఫ్స్‌’ అనే నాలుగు నిమిషాల నిడివి గల ఆ స్కిట్‌లో 24 ఏళ్ల కార్డీ.. పౌరహక్కుల నాయకుడైన మార్టిన్‌కు అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నట్లు, అణకువ గల భార్యగా కొరెట్టా స్కాట్‌ ఆయన్ని సహనంగా భరించినట్లు కథ అల్లడంతో విమర్శలు మొదలై, విషయం అపాలజీ వరకు వెళ్లింది.

మయన్మార్‌ సైన్యం ముస్లిం రోహింగ్యాలపై మారణహోమం జరిపిందని ఐక్యరాజ్య సమితి దర్యాప్తు బృందాలు నివేదిక ఇచ్చినందున.. అందుకు ప్రాయశ్చిత్తంగా ప్రస్తుత మయన్మార్‌ కౌన్సిలర్, విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఆంగ్‌ సాన్‌ సూచీకి తాము 1991లో ఇచ్చిన నోబెల్‌ శాంతి బహుమతిని వెనక్కు తీసుకుంటామని వస్తున్న వార్తల్లో నిజం లేదని నోబెల్‌ కమిటీ స్పష్టం చేసింది. నోబెల్‌ ప్రైజ్‌ అన్నది.. అది ఫిజిక్స్‌లో గానీ, ‘పీస్‌’లో గానీ ఒక వ్యక్తి జరిపిన కృషికి ఇచ్చేదే కానీ.. తిరిగి వెనక్కు తీసుకునేది కాదని, కమిటీలో అలాంటి నియమ నిబంధనలు కూడా ఏమీ లేవని నోబెల్‌ కమిటీ సెక్రెటరీ ఓలవ్‌ ఎన్‌జోల్‌స్టాండ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 

బంగ్లాదేశ్‌లో ‘ఆనంద’ అనే ఓ ప్రైవేటు టీవీ చానెల్‌లో పనిచేస్తున్న సుబర్ణ అఖ్తర్‌ నోడీ అనే 32 ఏళ్ల మహిళా జర్నలిస్టును.. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో నరికి చంపేశారు. తొమ్మిదేళ్ల కూతురుతో ఉంటున్న నోడీ, తన భర్త ఉండి విడాకుల కోసం కొంతకాలంగా న్యాయపోరాటం చేస్తూ ఉన్న క్రమంలో మంగళవారం రాత్రి పదిన్నర, పదకొండు గంటల సమయంలో కాలింగ్‌ బెల్‌ నొక్కి, ఆమె తలుపు తియ్యగానే లోనికి ప్రవేశించిన దుండగులు కత్తితో ఆమెను నరికి చంపేయడం వెనుక ఆమె భర్త హస్తం ఉండివుండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 

ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో కొత్తగా తెర చిన ఒక బేకరీకి ‘యాన్‌ అండ్‌ ఫ్రాంక్‌’ అనే పేరు పెట్టడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ వెంటనే ఆ పేరును మార్చాలని ఒత్తిడి తేవడంతో.. ఆశ్చర్యానికి లోనైన రోబెర్టో అనే ఆ బేకరీ యజమాని.. ‘‘యాన్‌ ఫ్రాంక్‌ నివసించిన ఇంటికి సమీపంలో మా షాపు ఉంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాను. ఇందులో తప్పేమిటో నాకు అర్థం కాలేదు కనుక నా బేకరీ పేరును మార్చాలని నేను అనుకోవడం లేదు’’ అని స్పష్టం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల చేత చిక్కి, నిర్బంధ శిబిరంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన సాహస బాలిక ప్రపంచంలోనే ఎంతోమందికి అభిమాన కథానాయిక.. అలాగే నాక్కూడా’’ అని రోబెర్టో కరాఖండిగా చెప్పేశారు.

కరుణానిధి భార్య.. 80 ఏళ్ల దయాళు అమ్మాళ్‌ చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గోపాలపురం నివాసంలో ఉంటున్న అమ్మాళ్‌కు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స అందించిన అనంతరం ఆమెను డిశ్చార్జ్‌ చేసిన వైద్యులు.. అమె ఆరోగ్య స్థితి ఎలా ఉందన్న విషయంపై మాత్రం స్పష్టమైన వివరాలు ఇవ్వలేదు. 

86 ఏళ్ల వయసులో 2005 అక్టోబర్‌ 31న మరణించిన నవలా రచయిత్రి, కవయిత్రి, ప్రముఖ వ్యాసకర్త అయిన అమృతాప్రీతమ్‌ జయంతి నేడు. 1919 ఆగస్టు 31న ఢిల్లీలో జన్మించి, తొలి పంజాబీ కవయిత్రిగా ప్రసిద్ధురాలైన అమృత.. జ్ఞానపీuŠ‡తో పాటు, సాహిత్య అకాడమీ, పద్మశ్రీ, పద్మ విభూషణ్, శతాబ్ది సమ్మాన్‌ అవార్డులను పొందారు.  

మరిన్ని వార్తలు