స్త్రీలోక సంచారం

27 Nov, 2018 00:19 IST|Sakshi

బహుజన సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి నేడు తెలంగాణాకు వచ్చే అవకాశాలున్నాయి. ఆమె పర్యటనలో ఆఖరి నిమిషపు మార్పులేమీ లేకుంటే.. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సయ్యద్‌ ఇబ్రహీం తరఫున ఎన్నికల ప్రచార సభలో మంగళవారం ఆమె ప్రసంగిస్తారు. మాయావతి 1989తో ఎం.పి. అవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1994లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 

1995లో ముఖ్యమంత్రి అయ్యారు! తిరిగి 1997లో, తర్వాత 2002 నుంచి 2003 వరకు, అనంతరం  2007 నుంచి 2012 వరకు పూర్తి ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అగ్రవర్ణాల ప్రాబల్యం, నిరంతర రాజకీయ అనిశ్చితి ఉన్న ఒక పెద్ద రాష్ట్రానికి ఓ దళిత మహిళ ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా అది పెద్ద విశేషమే. మాయావతి దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు ఉత్తరప్రదేశ్‌ను పాలించారు. దళితులు, ఇతర వెనకబడిన వర్గాల వారి సంక్షేమం కోసం పాటు పడ్డారు. పార్టీ నాయకత్వానికి వారసురాలిగా 2001లో కాన్షీరామ్‌ మాయావతిని ప్రకటించినప్పుడు కనుబొమలు ఎగరేసి, పార్టీ నుంచి వెళ్లి పోయిన అగ్రనేతలు సైతం... ఆ తర్వాత్తర్వాత ఆమె నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించారంటే కారణం.. మాయావతికి దళితుల్లో ఉన్న ఆదరణ, ప్రజాకర్షణ. ఆమె వాక్పటిమ సాటిలేనిది. ఆలోచనా రచన తిరుగులేనిది. మాయావతి తొలినాళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘మిరకిల్‌ ఆఫ్‌ డెమోక్రసీ’గా ప్రధాని పి.వి. నరసింహారావు అభివర్ణించారు. సోనియాగాంధీ కూడా మాయావతి దక్షతను అనేక సందర్భాలలో ప్రస్తుతించారు. మాయావతికి కూడా సోనియా అంటే ప్రత్యేక అభిమానం. ఈ ఏడాది జూలైలో సోనియాను విదేశీయురాలు అని అన్నందుకు మాయావతి తన సొంత పార్టీ నాయకుడినే పార్టీ నుంచి బహిష్కరించారు. 

మొన్న ఆదివారం ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయలెన్స్‌ అగైన్‌స్ట్‌ ఉమెన్‌’ జరుపుకున్నాం. (మహిళలపై హింసను నిర్మూలించే దినం). అందులో భాగంగానే నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు పదహారు రోజుల పాటు భారతదేశంలో మహిళా సంక్షేమ సమాలోచనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల కార్మిక సంఘాలు.. గృహహింసకు గురైన మహిళలకు వేతనంతో కూడా సెలవును మంజూరు చెయ్యాలన్న ప్రతిపాదనతో క్యాంపెయిన్‌ నడుపుతున్నాయి. గృహహింసకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను, విధానాలను రూపొందించడంలో ఇదొక ప్రభావవంతమైన అంశంగా ఉంటుందని ఆ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. న్యూజిలాండ్‌లో ఇప్పటికే మహిళా ఉద్యోగుల కోసం ఇలాంటి చట్టం అమలులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహహింసకు గురవుతున్నారు!

టెస్టుల్లోను, వన్డే ఇంటర్నేషనల్స్‌లోనూ మిథాలీనే ఇప్పటికీ భారత మహిళా జట్టుకు కెప్టెన్‌. ఇటీవలి ఐసీసీ ఉమెన్స్‌ వరల్డ్‌ ట్వంటీ20 టోర్నమెంట్‌కు మాత్రం హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఆ సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో ఆడుతున్నప్పుడు హర్మన్‌ప్రీత్‌.. జట్టులో ఉన్న సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ని పక్కన పెట్టడం మీద ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇప్పుడిక మిథాలీ తర్వాతి స్టెప్‌ ఏమిటన్నది ప్రశ్న. టి20 ఇంటర్నేషనల్స్‌ వ్యూహాలకు మిథాలీ ఫిట్‌ కారని హర్మన్‌ప్రీత్‌ అంటున్నారు. టీమ్‌కి యువరక్తం ఎక్కించడానికి, స్ట్రయిక్‌ రేట్‌ని పెంచడానికి మిథాలీకి ‘విరామం’ ఇవ్వక తప్పలేదన్నది హర్మన్‌ చెబుతున్న కారణం. త్వరలో 50 ఓవర్ల ఫార్మాట్‌ ఉంది. టి20 ఇంటర్నేషనల్‌ సిరీస్‌ ఉన్నాయి. ఐసీసీ ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ చాంపియన్‌షిప్‌ ఉంది. భవిష్యత్తులో జరగబోయే వన్‌డే ఇంటర్నేషనల్‌ కప్పుకు క్వాలిఫై చేసే సిరీస్‌ కొన్ని ఉన్నాయి. కాబట్టి టి20 ఇంటర్నేషనల్స్‌లో మిథాలీ (ఒకవేళ) కనిపించకపోయినా.. ఆడేందుకు ఆమెకు మరికొన్ని వన్డే ఇంటర్నేషనల్స్‌ ఉన్నాయి. వచ్చే వరల్డ్‌కప్‌ 2021లో జరుగుతుంది. అంతకన్నా ముందు 2020లో మరో వరల్డ్‌కప్‌ (టి20) ఆస్ట్రేలియాలో ఉంది. వాటిల్లో మనం మిథాలీని మిస్సయ్యే చాన్సే లేదు. సో.. బీ హ్యాపీ.   
 

>
మరిన్ని వార్తలు