స్త్రీలోక సంచారం

30 Jul, 2018 00:37 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

స్వయంప్రభ అనే బెంగళూరు యువతి వంశపారంపర్యంగా తనకు సంక్రమించిన బీఆర్‌సీఏ1 (బ్రెస్ట్‌క్యాన్సర్‌ జన్యువు) తన నుంచి తనకు పుట్టబోయే బిడ్డలకు వ్యాపించకుండా ఉండేందుకు తన అండాల నుంచి ముందే ఆ జన్యువును వేరు చేయించుకుని గర్భం దాల్చడం ద్వారా ఇద్దరు ఆరోగ్యకరమైన మగ కవలలకు జన్మనిచ్చారు! ఐదేళ్ల క్రితం వైద్యులు హాలీవుడ్‌ నటి ఏంజెలీనా జోలీ వక్షోజాలను, అండాశయాన్ని తొలగించడానికి కారణం ఈ బీఆర్‌సీఏ1 క్యాన్సరే ::: న్యూఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో ఆ కళాశాల బెంగాలీ సాహితీ సమితి ఆగస్టు 1న ఏర్పాటు చేసిన సభలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించవలసి ఉండగా, ఆఖరి నిమిషంలో విధివిధానాలను కారణంగా చూపి, కళాశాల యాజమాన్యం అందుకు అనుమతిని నిరాకరించింది! మొదట చికాగోలోని వివేకానంద కార్యక్రమానికి, తర్వాత చైనా పర్యటనకు..అవాంతరాలు ఏర్పడటం, ఇప్పుడీ స్టీఫెన్స్‌ కాలేజీ అనుమతి రద్దవడం వెనుక బి.జె.పి., ఆర్‌.ఎస్‌.ఎస్‌.ల హస్తం ఉందని మమత కేడర్‌ బలంగా నమ్ముతుండగా, ఈ నెల 31న ఢిల్లీలోనే ‘క్యాథలిక్‌ బిషప్స్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఇండియా’ నిర్వహిస్తున్న ‘లవ్‌ యువర్‌ నైబర్‌’ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానంపై వెళ్లేందుకు సిద్ధమైన మమతా బెనర్జీకి మళ్లీ ఇటువంటి చేదు అనుభవమే ఎదురైతే కనుక ఏం చేయాలన్నదానిపై మమత పార్టీలోని ముఖ్య నాయకులు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

పాకిస్తాన్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఇచ్చిన సదవకాశాన్ని స్వీకరించి, కశ్మీర్‌లోని వేర్పాటువాదులను చర్చల్లోకి ఆహ్వానించి రెండు దేశాల్లో శాంతిస్థాపనకు వీలు కల్పించాలని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఇటీవలే రాజీనామా చేసిన పి.డి.పి. (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ కార్యకర్తలో మాట్లాడుతున్నప్పుడు ఈ విజ్ఞప్తిని చేసిన మెహబూబా.. ‘రెండేళ్ల అధికారంలో మీ ముఖం మీద ఏనాడూ చిరునవ్వు ఎందుకు లేకపోయింది?’ అని ఇప్పటికీ అనేక మంది తనను అడుగుతూనే ఉన్నారని చెబుతూ, బి.జె.పి.తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే ఎవరూ బలవంతం చెయ్యకుండానే విషాన్ని తాగడమేనని చమత్కరించారు ::: ఈ ఆగస్టు 1న షూటింగ్‌ మొదలుపెట్టి, వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల చేసే పక్కా ప్రణాళికతో వాల్ట్‌ డిస్నీ నిర్మిస్తున్న ‘స్టార్‌వార్స్‌ : ఎపిసోడ్‌ నైన్‌’ చిత్రంలో.. 2016 డిసెంబర్‌లో మరణించిన స్టార్‌ వార్స్‌ సిరీస్‌ నటి క్యారీ ఫిషర్‌ కనిపించబోతున్నారు! 2015లో విడుదలైన స్టార్‌ వార్స్‌ చిత్రం ‘ది ఫోర్స్‌ అవేకెన్‌’లో ఆమె నటించి, సినిమాలో జోడించని కొన్ని సన్నివేశాలను ఈ కొత్త చిత్రంలో కలపబోతున్నట్లు వాల్ట్‌ డిస్నీ ప్రకటించింది ::: మహిళా రిజర్వేషన్‌లపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతూ, మహిళలు సొంతంగా రాజకీయాలలో రాణించాలనీ, రిజర్వేషన్‌లు అన్నవి రాజకీయ నాయకుల భార్యలకు, కూతుళ్లకు మాత్రమే ఉపయోగపడతాయని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ అభిప్రాయపడ్డారు.

లోక్‌సభలో, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే రిజర్వేషను బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించాలని విపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్న సమయంలో రేఖా శర్మ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ::: ఉపాధికి ఆశ చూపించి, లక్షల జీతాల ఉద్యోగాలను ఎరగా వేసి మహిళలను, నిరుద్యోగులను అక్రమంగా విదేశాలకు తరలించి, వారి ఖర్మకు వారిని వదిలిపెట్టి పరారవుతున్న ఏజెంట్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ, మహారాష్ట్ర మహిళా సంఘం కలిసి.. ఎన్నారై భర్తల ఆగడాలు; మహిళలు, చిన్నారుల అక్రమ రవాణాపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, లోక్‌సభలో బుధవారం ఆమోదం పొందిన ‘ది ట్రాఫికింగ్‌ ఆఫ్‌ పర్సన్స్‌’ (ప్రివెన్షన్, ప్రొటెక్షన్, రిహాబిలిటేషన్‌) 2018 చట్టాన్ని.. అక్రమాలకు, దారుణాలకు పాల్పడుతున్న ఏజెంట్‌లపై ఒక అస్త్రంలా ప్రయోగించాలని ఆమె సీఎంలను కోరారు :::  బాయ్‌ఫ్రెండ్‌ నిక్‌ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయిందన్న కారణం చూపి ‘భారత్‌’ చిత్రం కాంట్రాక్టును రద్దు చేసుకున్న ప్రియాంకా చోప్రా అన్‌ప్రొఫెషనల్‌గా బిహేవ్‌ చేశారని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, అదే చిత్రంలో తనతో కలిసి నటిస్తున్న దిశా పటానీని, తనను కలిపి ఒకే పోస్టర్‌లో చూపించడంపై ప్రియాంక అభ్యంతరం వ్యక్తం చేశారన్న మరో వార్త ఇప్పుడు తాజాగా బయటికి వచ్చింది!

దక్షిణకొరియా చిత్రం ‘ఓడ్‌ టు మై ఫాదర్‌’ ఆధారంగా సల్మాన్‌ని హీరోగా పెట్టి ‘రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్‌’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనుకున్న ‘భారత్‌’ చిత్రం.. ప్రియాంక ఇలా అర్ధంతరంగా వైదొలగడంతో తాత్కాలిక అవాంతరానికి గురయింది ::: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై గత రెండు రోజులుగా జాతీయ మీడియా అంచనాల మీద అంచనాలు వేస్తోంది. మోదీ పాలన అమోఘంగా ఉందనీ, అలాంటి వ్యక్తికి ఐదేళ్ల పాలనా కాలం సరిపోదనీ, 2019లో కూడా తిరిగి ఆయనే విజ యం సాధించాలని జీటీవీ ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన కంగనా.. ‘మీ రాజకీయరంగ ప్రవేశం ఎప్పుడు?’ అన్న ప్రశ్నకు.. తనకింకా తగిన వయసు రాలేదనీ, తగిన సమయం కూడా అవసరమని అనడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా ఆశ్చర్యం లేదని రాజ కీయ పరిశీలకులు భావిస్తు న్నారు:::  

మరిన్ని వార్తలు