స్త్రీలోక సంచారం

26 Sep, 2018 00:07 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

అమెరికన్‌ రియాలిటీ టెలివిజన్‌ పర్సనాలిటీ కిమ్‌ కర్దేషియాన్‌ (37), ఆమె మూడో భర్త, అమెరికన్‌ పాప్‌ సింగర్‌ అయిన కాన్యే వెస్ట్‌(41)ల ముద్దుల కుమార్తె నార్త్‌ వెస్ట్‌(5).. లాజ్‌ ఏంజిల్‌ సమీపంలోని పసిఫిక్‌ పాలిసైడ్‌లో జరిగిన ఫ్యాషన్‌ షో ర్యాంప్‌పై మోడల్‌గా అరంగేట్రం చేసింది. మైఖేల్‌ జాక్సన్‌  ‘థ్రిల్లర్‌’ ఆల్బమ్‌లోని ‘థ్రిల్లా’ బొమ్మలా తయారైన ఈ చిన్నారి.. రెడ్‌ లెదర్‌ జాకెట్, మ్యాచింగ్‌ మినీ స్కర్ట్, జిప్‌–అప్‌ బ్లాక్‌ క్రాప్‌ టాప్, వైట్‌ సాక్స్, బ్లాక్‌ షూజ్, బ్లాక్‌ పర్స్, రెడ్‌ లిప్‌స్టిక్‌ ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తున్నప్పుడు అంతా మంత్రముగ్ధులై చూస్తుండిపోగా ఆ తల్లి కిమ్‌ కర్దేషియాన్‌ మనసు ఉప్పొంగిపోయింది. 

 బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, అపోహల్ని పోగొట్టేందుకు యు.ఎస్‌.లో మొదలైన ‘పింక్‌ రిబ్బన్‌ క్యాంపైన్‌’లో భాగంగా హైదరాబాద్‌లో సోమవారం 10 ఎడిషన్‌ క్యాంపైన్‌ ప్రారంభమైంది. పాశ్చాత్యదేశాలతో పోలిస్తే మన దేశంలో బ్రెస్ట్‌ తొలగింపు కేసులు తక్కువగా నమోదు అవడానికి కారణం తొలి దశలోనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను గుర్తించి తగిన చికిత్సను అందించడమేనని పిక్‌ రిబ్బన్‌ క్యాంపైన్‌ ద్వారా ఇది సాధ్యం అయిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య నిపుణులతో పాటు ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్, కిమ్స్‌–ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌ సీఈవో, డైరెక్టర్‌ తమ ప్రసంగంలో తెలిపారు. 

తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఏ విధంగానైనా  వదిలించుకోవాలని చూడడం, చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లలను ఆడపిల్లలు తప్పించుకోవాలని చూడడం ఆదివాసీ తెగల్లోని యువతులను మావోయిస్టుల పోరుబాటలోకి నడిపిస్తున్నాయనీ, ఈ  పరిస్థితిని వామపక్ష తీవ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుని అమాయకులైన బాలికల్ని, యువతుల్ని తమ ఉద్యమంలోకి వలవేసి లాక్కుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ పోలీస్, హోమ్‌శాఖల అధికారులు ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టుల నియామకాల్లో మహిళల సంఖ్య 50 శాతానికి మించిపోయిందనీ, ఆదివారం జరిగిన టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె.సోములను చంపడంలో మహిళా మావోయిస్టులే కీలక పాత్ర పోషించారనీ వారు తెలిపారు. 

బోస్టన్‌ యూనివర్సిటీలో చదువుతున్న 22 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని జేన్‌ విల్లెన్‌బ్రింగ్‌ రిసెర్చి నిమిత్తం తన మెంటర్, జియాలజిస్టు అయిన డేవిడ్‌ మర్చంట్‌తో కలిసి అంటార్కిటా ప్రాంతానికి వెళ్లినప్పుడు అతడు చెప్పినట్లు ఆమె వినకపోవడంతో అనేక విధాలుగా ఆమెను వేధించి, ఆమె శరీరాకృతిలోని ఒంపుసొంపుల గొప్పతనాన్ని వర్ణించి, అప్పటికీ ఆమె లొంగకపోవడంతో ఆమెను మంచు లోయల్లోకి తోసి, ఆమె కళ్లల్లోకి బూడిదను పోసి నానా తిప్పలు పెట్టడంతో.. గతంలో అతడి ప్రతిభకు గుర్తింపుగా అక్కడి ఒక గ్లేసియర్‌కు పెట్టిన అతడి పేరును ఉపసంహరించుకుంటున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. ‘‘డేవిడ్‌ మర్చెంట్‌పై యూనివర్సిటీ తీసుకున్న ఈరకమైన చర్య ద్వారా మీకు న్యాయం జరిగిందని సంతృప్తి చెందారా?’’ అని అడిగిన ప్రశ్నకు.. ‘‘దీనిని నేను న్యాయం జరగడం అనుకోవడం లేదు. మొత్తానికైతే ఏదో జరిగింది’’ అని బాధితురాలు జేన్‌ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

పద్దెనిమిదేళ్ల వయసులోనే డిప్రెషన్, ఈటింగ్‌ డిజార్డర్, సెల్ఫ్‌ హార్మ్, బుల్లీయింగ్‌లతో మనోవ్యాధి పీడితురాలై ప్రత్యేక చికిత్సా కేంద్రంలో గడిపిన అమెరికన్‌ పాప్‌ సింగర్‌ డెమీ లొవాటో (26).. ఈ ఏడాది జూన్‌ 21న మళ్లీ డిప్రెషన్‌ బారిన పడి, ఓవర్‌డోస్‌ మందులు వేసుకోవడంతో ప్రాణాంతక స్థితిలోకి జారిపోయిన రెండు నెలల తర్వాత తొలిసారి బయటి ప్రపంచానికి కనిపించారు! యు.ఎస్‌.లో ఆమె చికిత్స పొందుతున్న ఆశ్రయ కేంద్రం బయట ఆదివారం ఉదయం, కుక్కను నడిపించుకుంటూ వెళుతున్న ఒక మహిళతో డెమీ లొవాటో మాట కలుపుతూ కనిపించారని బ్రేకింగ్‌ న్యూస్‌ ఇచ్చిన టి.ఎం.జడ్‌. (థర్టీ మైల్‌ జోన్‌) వెబ్‌సైట్‌ ఆమె తాజా ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. 

ట్రంప్‌ పాలనా యంత్రాంగంలోని జాత్యహంకారాన్ని, లైంగిక వైపరీత్యాలను తట్టుకోలేక అక్కడ పని చేస్తున్న భారతీయ సంతతి అమెరికన్‌ మహిళ ఉజ్రా జేయా తన  పదవికి రాజీనామా చేశారు. యు.ఎస్‌. విదేశాంగ శాఖలో పాతికేళ్లుగా అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉద్యోగంలో రాణిస్తూ వస్తున్న ఉజ్రా.. ట్రంప్‌ వచ్చాక, పైస్థాయి పురుష అధికారుల్లో పెడధోరణులు పెచ్చరిల్లాయని, వాటి వల్ల మైనారిటీ మహిళలకు స్వేచ్ఛగా, సమర్థంగా పని చేసే వాతావరణం లేకుండా పోయిందని ఆరోపించారు. 

హాలీవుడ్‌లో వచ్చిన ‘మీ టూ’ లాంటి శక్తిమంతమైన ఉద్యమం బాలీవుడ్‌లో ఏనాటికీ రాదని, వచ్చి ఉంటే 2008లో ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ చిత్రంలో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బాహాటంగా చెప్పినప్పుడే నలుగురూ కలిసి వచ్చేవారని రెండేళ్ల తర్వాత ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చిన తనుశ్రీ దత్తా అన్నారు. ‘ఆ రోజు నా విషయంలో పెదవి విప్పని వారు కూడా ఇప్పుడు స్త్రీసాధికారత గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తోంది. ఎవరి స్వార్థం వారిదైపోయినప్పుడు కలికట్టు మహిళా ఉద్యమాలు ఎలా సాధ్యమౌతాయి?’ అని ‘న్యూస్‌ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు