స్త్రీలోక సంచారం

27 Sep, 2018 00:12 IST|Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో.. ముస్లింని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువతిని నలుగురు పోలీసులు వ్యానులోకి ఎక్కించి, ఆమెను కొట్టుకుంటూ తీసుకెళుతున్న వీడియో ఒకటి వైరల్‌ అవడంతో మీరట్‌ పోలీసులు ఆ నలుగురినీ సస్పెండ్‌ చేసి, వారిపై శాఖపరమైన విచారణ చేపట్టారు. హెడ్‌ కానిస్టేబుల్‌ సాలెక్‌ చంద్, కానిస్టేబుల్‌ నీతూ సింగ్, ఉమన్‌ కానిస్టేబుల్‌ ప్రియాంక, హోమ్‌ గార్డు సైన్‌సెర్పాల్‌గా నిందితులను గుర్తించిన  మీరట్‌ జోన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రశాంత్‌ కుమార్‌.. బాధితురాలైన ఆ యువతికి వి.హెచ్‌.పి. కార్యకర్తల నుంచి బెదరింపులు వస్తున్నందున ఆమెకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. 

టి.ఆర్‌.ఎస్‌. పార్టీ వరంగల్‌ తూర్పు నియోజవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవడంతో టి.ఆర్‌.ఎస్‌.లో చీలికలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తన కుమారుడు కె.టి.ఆర్‌.ను ముఖ్యమంత్రిని చేసేందుకే సీఎం కేసీఆర్‌.. మంత్రి హారీష్‌రావుకు సన్నిహితంగా ఉండేవారిని తప్పిస్తున్న క్రమంలో తమనూ పక్కనపెట్టేశారని ఆరోపించిన సురేఖ.. ఆ తర్వాత కొద్ది గంటలకు భర్త కొండా మురళితో కలిసి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరడంతో.. కేసీఆర్‌ ముందస్తు తంత్రం మరిన్ని అసమ్మతి సెగలకు ఆజ్యం పోసే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య నిత్యం పోరుసాగే జమ్ముకశ్మీర్‌ లోని కుల్గామ్‌ జిల్లాలో శుక్రవారం నాడు ముగ్గురు స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌లను ఉగ్రమూకలు కాల్చి చంపడంతో చలించిపోయిన రఫీకా అఖ్తర్‌ అనే 39 ఏళ్ల వింతతు పోలీస్‌ ఆఫీసర్‌ ఆ మర్నాడే తన పదవికి రాజీనామా చేశారు. తొలి మహిళా స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా 15 ఏళ్ల క్రితం డిపార్ట్‌మెంట్‌లో చేరిన రఫీకా.. ‘‘నా పిల్లల భద్రత నాకు ముఖ్యం. నా కుటుంబానికి నేనే దిక్కు. ఇన్నేళ్లూ నేను జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం కోసం, ప్రజల భద్రత కోసం పని చేశాను. ఇక చేసింది చాలనుకున్నాను. డిపార్ట్‌మెంట్‌ నాకు ఇచ్చిన రెండు జతల యూనిఫామ్‌ని కుల్‌గామ్‌ పోలీస్‌ స్టేషన్‌కి తిరిగి ఇచ్చేశాను’’ అని తన రాజీనామాకు గల కారణాలను వివరించారు.


ప్రపంచాన్ని తాము పుట్టినప్పటి స్థితి నుంచి మరింతగా మెరుగుపరచడానికి ప్రయత్నించిన యువతీ యువకులకు కోసం ‘బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌’ ఏటా ఇచ్చే ‘గ్లోబల్‌ గోల్‌కీపర్స్‌ అవార్డు’ ఈ ఏడాది 18 అమికా జార్జితో పాటు మరో ఇద్దరికి లభించింది. లండన్‌లోని పేద కుటుంబాల ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ అందించే లక్ష్యంతో ‘పీరియడ్‌ పావర్టీ’ పేరిట.. గత డిసెంబరులో అమికా ప్రారంభించిన ఉద్యమానికి స్పందించిన యు.కె.ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకు 10 లక్షల 50 వేల పౌండ్లను కేటాయించడం కూడా అమికాకు ఈ గుర్తింపు రావడానికి తోడ్పడింది.  

మరిన్ని వార్తలు