స్త్రీలోక సంచారం

6 Dec, 2018 00:10 IST|Sakshi

 భారతీయ సంతతి అమెరికన్‌ సెనెటర్‌ కమలాహ్యారిస్‌ 2020లో జరిగే  ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసేదీ లేనిదీ ఒకటీ రెండు రోజుల్లో తేలిపోనుంది. ఏదైనా తన కుటుంబ నిర్ణయం ప్రకారం జరుగుతుందని ‘మాణింగ్‌ జో’ అనే టీవీ కార్యక్రమంలో కమల వెల్లడించారు. 54 ఏళ్ల కమలకు డెమొక్రటిక్‌ పార్టీలో ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు, ప్రజాదరణ కూడా ఉంది. కమల కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లి డాక్టర్‌ శ్యామలా గోపాలన్‌ చెన్నై నుంచి 1960లో అమెరికా వలస వచ్చారు. కమల తండ్రి జమైకన్‌ ఆఫ్రికన్‌. ఒమాబా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సెనెట్‌లో ఆమెనంతా ‘ఫిమేల్‌ ఒబామా’ అనేవారు. 

హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలు కాలేజ్‌కి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడకూడదని ఒడిశాలోని వీర్‌ సురేంద్ర సాయి యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (వి.ఎస్‌.ఎస్‌. యు.టి.) లోని ఐదు గర్ల్స్‌ హాస్టళ్లలో ఒకటైన ‘రోహిణి హాల్‌ ఆఫ్‌ రెసిడెన్స్‌’ ఆంక్షలు విధించింది! ‘గౌరవనీయులైన వైస్‌ చాన్స్‌లర్‌ సూచనల మేరకు.. రోహిణి హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలు రోడ్డు మీద అబ్బాయిలతో మాట్లాడ్డం నిషేధించడమైనది కనుక, నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోబడుతుంది’ అని డిసెంబర్‌ 1న హాస్టల్‌ నోటీస్‌ జారీ చేసింది. హాస్టల్‌ వార్డెన్‌ సంతకం చేసిన ఆ నోటీసును హాస్టల్‌ బోర్డులో పెట్టడంతో పాటు నోటీస్‌ కాపీలను స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డీన్‌కు, వైస్‌ చాన్స్‌లర్‌ పి.ఎ.కు పంపించారు. విద్యార్థినుల రక్షణ కోసమే ఈ విధమైన ఆంక్షలు విధించవలసి వచ్చినట్లు యూనివర్సిటీ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఇన్‌చార్జి ప్రొఫెసర్‌ సి.సి. స్వెయిన్‌ వివరణ ఇచ్చారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని మరో కేంద్ర మంత్రి (కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖలు) ఉమా భారతి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాజకీయాల నుంచి బయటికి వచ్చేసి పూర్తి ఆధ్యాత్మిక జీవితం గడపడంలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో పాలు పంచుకోవాలని ఉందని కూడా ఆమె అన్నారు. రెండు వారాల క్రితం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తోందనీ ప్రకటించారు. 

 గర్భంతో ఉన్నప్పుడు తల్లులు వాడే టూత్‌పేస్ట్‌లు, మేకప్‌ క్రీములు, సబ్బులు, ఇతర వ్యక్తిగత సంరక్షణ లేపనాలు, పౌడర్‌లలోని రసాయనాల వల్ల.. వారికి పుట్టే ఆడ శిశువులు సమయానికన్నా ముందే యవ్వనదశకు (ప్యూబర్టీ) చేరుకునే ప్రమాదం ఉన్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఆ రసాయనాలలోని డీథిల్‌ ఫాలేట్, ట్రైక్లోజన్‌ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌ల ప్రభావమే ఇందుకు కారణమని వారు తెలిపారు. 

ఆఫ్ఘనిస్తాన్‌ మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ టీమ్‌లోని క్రీడాకారిణులను ఆ దేశ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ సహా అధికారులు కొందరు లైంగికంగా వేధించి, వారిని లోబరుచుకున్నట్లు ‘గార్డియన్‌’ పత్రికలో వచ్చిన సంచలనాత్మక కథనంలోని ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ ఆదేశించారు. లైంగిక వేధింపులకు పాల్పడిన అత్యున్నతస్థాయి అధికారుల బెదిరింపులకు భయపడి దేశం వదిలి పారిపోయిన నేషనల్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌  మాజీ కెప్టెన్‌ ఖలీదా పోవల్‌ను ఉటంకిస్తూ గార్డియన్‌ ఈ వార్తా కథనాన్ని కొన్ని రోజుల క్రితమే ప్రచురించింది. 
 

>
మరిన్ని వార్తలు