టాక్స్ ఫ్రీ బాండు పన్ను కొరకని పండు

15 Feb, 2016 23:13 IST|Sakshi
టాక్స్ ఫ్రీ బాండు పన్ను కొరకని పండు

ఉమన్ ఫైనాన్స్
సాధారణంగా చాలామంది దంపతులు తమ తల్లిదండ్రులకు ప్రతి సంవత్సరం ఒక ఆదాయ వనరు సమకూరాలనో, అలాగే తమ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలనో.. రిస్క్ తక్కువగా ఉండే సాంప్రదాయిక మార్గాలలో (బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్, పోస్టాఫీస్ డిపాజిట్లు మొదలైనవి) పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాంటి వారికి టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ ఒక చక్కటి పెట్టుబడి మార్గం.
 టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ అంటే ఈ బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడి మీద వచ్చిన వడ్డీకి టాక్స్ (పన్ను) వర్తించదు. అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి మీ ఆదాయం మొత్తం లెక్కించేటప్పుడు ఆ ఆర్థిక సంవత్సరంలో మీకు టాక్స్ ఫ్రీ ఇంట్రెస్ట్ బాండ్స్ మీద లభించిన వడ్డీని ఆదాయంలో కలపనవసరం లేదు.
     
* ఈ బాండ్లు చాలా తక్కువ రిస్క్‌తో కూడినవి. ఎందుకంటే ఇవి చాలావరకు ప్రభుత్వం సంస్థల చేత జారీ అయే బాండ్స్. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు (మౌలిక సదుపాయాలను కల్పించే ప్రాజెక్టులు) ప్రభుత్వం వినియోగిస్తుంది.
     
* ఈ బాండ్లు తీసుకుంటే నిర్ణీత వడ్డీని సంవత్సరానికి ఒకసారి అందజేస్తారు. వడ్డీని నేరుగా ఖాతాదారుని బ్యాంకు ఖాతాకు బదలీ చేస్తారు. టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తించదు.
     
* ఈ బాండ్‌లు 10, 15, 20 సంవత్సరాల కాల పరిమితితో జారీ అవుతాయి.
     
* వీటిని ఫిజికల్‌గా, డీమ్యాట్ పద్దతిలోనూ పొందవచ్చు.
     
* ఒకవేళ గడువు తీరక ముందే డబ్బు అవసరమైతే సెకండరీ మార్కెట్‌లో అమ్మవచ్చు.
     
* సెకండరీ మార్కెట్‌లో అమ్మితే వచ్చే లాభానికి కాపిటల్ గైన్ టాక్స్ వర్తిస్తుంది.
 
* ఎవరైతే ఒక నిర్ణీత, భద్రమైన వడ్డీ రావాలని కోరుకుంటారో, అలాగే పన్ను భారం ఆ నిర్ణీత వడ్డీ మీద వర్తించకూడదని భావిస్తారో వారికి ఈ బాండ్లు చాలా చాలా మంచి పెట్టుబడి మార్గం. అలాగే మనం వడ్డీ రేట్లు గమనించినట్లయితే అవి క్రమేణా తగ్గుతూ ఉన్నాయి కనుక, ఈ బాండ్లు దీర్ఘకాలానికి ఎక్కువ రిటర్న్స్ అందజేయడాన్ని గమనించవచ్చు.
 ఎక్కువ టాక్స్ పడే కేటగిరీలో ఉండేవారికి బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌తో పోలిస్తే ఈ టాక్స్ ఫ్రీ బాండ్లు ఎక్కువ పోస్ట్ టాక్స్ రిటర్న్‌ని అందజేస్తాయి. ఎందుకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద వచ్చే వడ్డీకి పన్ను కట్టవలసి ఉంటుంది.
- రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

మరిన్ని వార్తలు