వింతై వింతింతై

15 Oct, 2015 23:18 IST|Sakshi
వింతై వింతింతై

బ్యూటీ  మీల్స్
 
పబ్లిసిటీ స్టంట్‌లు పలురకాలన్నట్లు ఉంది వాషింగ్‌టన్‌లోని ఓ హోటల్ తీరు. ఈ సౌత్ కొరియన్ హోటల్ కస్టమర్స్‌కి బంపర్ ఆఫర్ పెట్టింది. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేస్తే లంచ్ ఫ్రీ అనో.. ఓ రకం చైనీస్ బ్రేక్‌ఫాస్ట్ తింటే ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ ఉచితమనో.. బిల్లులో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్  అనో అనుకునేరు...ఇవేవీ కావు! హోటల్ తెరిచినప్పటి నుంచే వచ్చే మొదటి 50 మంది కస్టమర్లకు ఫ్రీ మీల్స్‌ని ఆఫర్ చేస్తోంది. అయితే...ఆ 50 మందీ అందంగా ఉంటేనే అని  కండీషన్‌ను  అప్లయ్ చేస్తోంది. కస్టమర్ల అందానికి వీళ్ల దగ్గరున్న కొలమానమేంటో అని పెదవి విరవకండి.. హోటల్ రిసెప్షన్లో ‘బ్యూటీ ఐడెంటిఫికేషన్ ఏరియా’ని ఏర్పాటు చేశారట. అక్కడ కను, ముక్కు తీరు, పెదువులు, ముఖాకృతిని పరిశీలించి టోకెన్ ఇస్తారట. ఎత్తు నుదురున్న వాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువట. వాళ్ల కనుముక్కుతీరు ఎలా ఉన్నా నుదురు ఎత్తుగా ఉంటే చాలు అందగత్తెలు, అందగాళ్ల కింద కన్సిడర్‌చేసి ఫ్రీ మీల్ ఆఫర్‌కి ప్రిఫర్ చేసేస్తున్నారట. ఈ ఆఫర్‌తో కస్టమర్ల తాకిడి పెరగడంతో ‘రెస్టారెంట్ ఫర్ గుడ్ లుకింగ్’ గా హోటల్ పేరునూ మార్చామని, ఫ్రీ మీల్ సౌకర్యాన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని అంటున్నాడు హోటల్ మేనేజర్ గ్జ్యూ హెగ్జిన్.
 
 
పాండా ప్రెగ్నెన్సీ!

నకరాలు, నటనలు నరులకే కాదు నాలుగు కాళ్ల జీవులకూ తెలుసు! భోగం సాగించుకోవడానికి రోగమున్నట్టు మనుషులు నటించినట్టే జంతువులూ నటిస్తాయి! ఈ విషయం రుజువైంది తైవాన్ రాజధాని తైపీలోని ఓ జూలో. రుజువు చేసింది ఓ పాండా. భోగం కోసం రోగమున్నట్టు కాదు కానీ గర్భం వచ్చినట్టు నటించింది. ఈ జూలోని ప్నెగ్నెంట్ పాండాలకు జూ సిబ్బంది ఇరవైనాలుగు గంటలు సేవలందించడం, రకరకాల పళ్లు ఇవ్వడం, సింగిల్ ఎయిర్‌కండీషన్డ్ గదిలో ఉంచడం వంటి సదుపాయాలు చూసి కన్నుకుట్టింది పదకొండేళ్ల ఆ పాండాకు. గర్భందాల్చినట్లు నటిస్తే తప్ప తనకు ఆ సౌకర్యాలు అందే ఛాన్స్‌లేదనుకుంది. ఇంకేముందు ఓ ఫైన్ మార్నింగ్ మొదలెట్టింది మార్నింగ్‌సిక్‌నెస్‌తో యాక్షన్. నీరసంగా ఉండి లేవలేనట్టుగా పడుకుండిపోయిందట. ఆకలి లేనట్టు, ఏదైనా తింటే వొమిట్ సెన్సేషన్ ఉన్నట్టు వాక్ వాక్ అనడం స్టార్ట్ చేసిందట. దీని ప్రవర్తనను చూసిన జూ సిబ్బంది అదీ ప్రెగ్నెంటేమో అనుకొని పాండాను సింగిల్ ఎయిర్ కండీషన్డ్ రూమ్‌లోకి మార్చారట. దానికిష్టమున్న తిండిని పెట్టారట. ఈలోపూ జూ లోని వెటర్నరీ డాక్టర్లకు పాండా విషయం చెప్పి టెస్ట్ చేయడం కోసం పిలిపించారట. టెస్టింగ్‌లో గుట్టు రట్టయింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో  పాండాకు ప్రెగ్నెన్సీ లేదన్న నిజం బయటపడింది. ఏముందీ.. అప్పటికప్పుడే దాన్ని ఎయిర్‌కండీషన్డ్ గదిలోంచి మిగిలిన పాండాలున్న చోటకి చేర్చారు. తన నాటకం తెలిసిపోయినందుకు సిగ్గుతో ముడుచుకుపోయిందట పాండా! ఇదెందుకిలా నకరాలు చేసిందని ఆరా తీస్తే ప్రత్యేకమైన సౌకర్యాల కోసమే అలా చేసి ఉంటుందని ఓ అంచనాకొచ్చారట జూ సిబ్బంది. పాపం పాండా!
 
120 ఏళ్లనాటి పెళ్లిగౌను
 పెళ్లిలో పెళ్లి కూతురికి అన్నీ కొత్తవే కాకుండా  నాన్నమ్మ నెక్లెసో.. అమ్మమ్మ గాజులో, అత్తయ్య చెవి దిద్దులో వంటి కొన్ని పాతవాటినీ ఆనవాయితీగా ఇస్తారు. ఈ సంప్రదాయం పాశ్చాత్య దేశాల్లోనూ ఉంది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఎబిగలి అనే పెళ్లికూతురుకీ అలాంటి వంశపారంపర్య కానుక ఒకటి వచ్చింది. ఏంటో కాదు వెడ్డింగ్ గౌనే! అదీ 120 ఏళ్ల కిందటిది. ఆ గౌన్ వేసుకున్న పదకొండో తరం పెళ్లికూతురుట ఆమె. వీళ్ల వంశంలో ఆ గౌను వేసుకున్న మొదటి వధువు  మేరీ లోరీ వారెన్. 1895లో తన పెళ్లి సందర్భంగా ఈ గౌన్‌ను తనే డిజైన్ చేసుకుంది. అప్పటి నుంచి 120 ఏళ్లుగా  చేతులు మారుతూ ఎబిగలి దగ్గరకు వచ్చేసరికి ముట్టుకుంటే చిరిగిపోయే స్థితిలో ఉందట ఈ పట్టుగౌను. పన్నెండు మంది డిజైనర్స్ 200 గంటలు కష్టపడి దీన్ని బాగుచేశారట. కేవలం కాక్‌టెయిల్ పార్టీ టైమ్‌లో అదీ  పార్టీ ప్రారంభించేంత వరకు మాత్రమే ఈ డ్రెస్‌ను ధరించిందట ఎబిగలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్.. అందుకే అన్నేళ్లయినా దానికంత క్రేజ్ అంటుంది కొత్త పెళ్లికూతురు.
 
 
 ఓ మంచిదొంగ కథ

 యూరప్‌లోని క్రోయేషియా దేశం.. ఓ ఇంట్లో.. కాలింగ్ బెల్ మోగింది. డోర్ తెరిచాడు జెర్కోవిక్. చేతిలో పార్సిల్‌తో కొరియర్ బాయ్. అందులో ఏముందోనన్న ఉత్సుకతతో పార్సిల్ తెరిచాడు. అంతే! అతని ముఖం ఆశ్చర్యంతో నిండిపోయింది. అందులో ఉన్నది 14ఏళ్ల కిందట పోగొట్టుకున్న పర్సు. అందులోని డబ్బును తన ఇంటి పైకప్పు రిపేరింగ్ కోసం బ్యాంకు నుంచి డ్రా చేశాడట. దాన్ని ఫంక్షన్‌లో పోగొట్టుకున్నాడో లేక తెలిసిన వారికి ఆరోగ్యం బాలేదని ఆస్పత్రికి వెళ్తుంటే పోగొట్టుకున్నాడో గుర్తులేదట. ఇన్నేళ్ల తర్వాత అతని పర్సు, అందులోని డబ్బును చూసి జెర్కోనిక్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు తను పోగొట్టుకున్న పర్సులో కేవలం
 1000 యూరోలు (రూ.73,000) ఉన్నాయట. పార్సిల్‌లో తనకు అందిన పర్సులో 1440 యూరోలు
 (రూ.1,05,120) ఉన్నాయి. దాంతో మొదట జెర్కోవిక్ అనుమానంతో అవి దొంగ నోట్లోమోనని నిర్ధారణకు కూడా వెళ్లాడట. ‘‘ఆ రోజు నా పర్సును ఎవరో అవసరార్థం దొంగిలించి ఉంటారు. ఆ డబ్బు వారిని ఆపద నుంచి కాపాడి ఉంటుంది. అందుకే వారు కృతజ్ఞతతో ఎక్కువ డబ్బు పంపించారేమో’’నని జెర్కోవిక్ అందరికీ ఆనందంగా చెబుతున్నాడు. అయితే ఫ్రమ్ అడ్రస్ లేనందుకు మాత్రం బోలెడంత నిరుత్సాహపడిపోయాడు.
 
 చల్లని మంట!
 ఐస్‌క్రీమ్... పేరు వింటేనే ఎవరికైనా నోరూరుతుంది కదా! ఐస్‌క్రీమ్ అంటే స్వీట్ అండ్ కూల్... అనే భ్రమతో ఈ ఫొటోలో కనిపించే పదార్థాన్ని ఏమరపాటుతో నోటపెట్టుకున్నారో... ఇక అంతే సంగతులు! దాని మంటకు నవరంధ్రాల్లోంచి ఆవిర్లు రావాల్సిందే! ఎందుకంటారా..? దీని తయారీలో రుచి కోసం వాడేది పంచదార కాదు. ప్రపంచంలోకెల్లా అత్యంత ఘాటైన ‘ఘోస్ట్ పెప్పర్’ అనే మిరపకాయలు మరి! ఈ ఐస్‌క్రీమ్ పైభాగంలో అలంకరణగా వాడే ఒక స్పూను మోతాదు భాగం మాత్రమే కాస్త తీపిగా ఉంటుంది. ఆ తర్వాత ఉండేదంతా... మంటే... మంట! ఇదెక్కడ దొరుకుతుందంటారా..? అమెరికాలోని డెలావేర్ రాష్ట్రంలో... అక్కడ రెహోబోత్ బీచ్‌లోని ‘ద ఐస్‌క్రీమ్ స్టోర్’ దీన్ని విక్రయిస్తోంది.
 
బా.. బా.. యాక్ట్ షీప్...
‘జీవితమే ఒక నాటకరంగం... మనమంతా నటీ నటులం’ అన్నాడు షేక్స్‌పియర్. ‘మనమంతా’ అంటే ఎవరు? అనే ప్రశ్న ఉద్భవిస్తే, మోకాళ్లలో ఉన్న మెదళ్లతో ఆలోచించి ‘మనుషులం’ అనే సమాధానం ఇస్తాం. ఫొటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు మాత్రం కాస్త తాత్వికంగా ఆలోచించాడు. ‘మనమంతా’ అంటే మనుషులమే కాదు, గొర్రెలు కూడా అనే నిర్ధారణకు వచ్చాడు. అంతేనా..? ఈ విషయాన్ని రంగస్థలం సాక్షిగా నిరూపిస్తున్నాడు కూడా! మనుషుల్లో మెజారిటీ జనాభా గొర్రెల్లాంటి వాళ్లే అయినప్పుడు మనుషులకు, గొర్రెలకు తేడా ఏమిటనేది ఇతగాడి అభిప్రాయం కాబోలు! ఇతగాడి పేరు అలస్దైర్ సక్సేనా. భారత సంతతి వాడే గానీ, లండన్‌లో ఉంటాడితడు. రంగస్థలం అంటే వెర్రి మమకారం. పైగా, షేక్స్‌పియర్‌కు వీరాభిమాని. షేక్స్‌పియర్ నాటకాలను మానవమాత్రులు పాత్రధారులుగా చాలామంది చాలాసార్లు ప్రదర్శించారు. ఇందులో వెరైటీ ఏముంది..? అనుకుని, ఇతగాడు ఏకంగా గొర్రెలనే పాత్రధారులుగా తీర్చిదిద్ది, వాటి చేతే షేక్స్‌పియర్ నాటకాలను ప్రదర్శిస్తున్నాడు. నటించేవి గొర్రెలే అయినా, వ్యాఖ్యానం మాత్రం ఇతగాడే చెబుతాడు లెండి. గొర్రెలతో ఇటీవల ఇతగాడు ప్రదర్శించిన ‘కింగ్ లియర్’ నాటకాన్ని లండన్ ప్రేక్షకులు వేలం వెర్రిగా తిలకించారు.
 

మరిన్ని వార్తలు