ఉడ్ వర్క్...

18 Oct, 2015 02:14 IST|Sakshi
ఉడ్ వర్క్...

మెట్రో కథలు
 ఎలా ఉంది?
 ఊ... మూలిగింది.
 నీళ్లు తాగుతావా?
 ఊ...
 గ్లాస్‌లో నీళ్లు తెచ్చిచ్చాడు. ఒక్క గుక్క తాగి మళ్లీ పడుకుంది. చూస్తూ కూచున్నాడు.
 కార్పెంటర్ వచ్చాడా?
 వస్తాళ్లే...

 ఎన్నిసార్లు చెప్పినా వినరు కదా. ఈసరికి వచ్చి పని మొదలెడతాడని అబద్ధాలు చెప్తున్నారు...
 మళ్లీ కళ్లు మూసుకుంది.
 ఫోన్ మోగితే ఎత్తాడు.
 ఎలా ఉంది?...
 పర్లేదు....
 కళ్లు తెరిచి అడిగింది- ఎవరూ?
 ఫోన్ ఆపి చెప్పాడు- మీ అన్నయ్య.

 నన్ను చూడ్డానికి రావద్దనండి. ఒకవేళ వచ్చినా రాత్రి పదయ్యాక రమ్మనండి. వచ్చేప్పుడు కూడా గడ్డం అదీ లేకుండా లాల్చీ పైజామా లేకుండా ప్యాంట్ షర్ట్‌లో రమ్మనండి. సెక్యూరిటీ రిజిస్టర్‌లో ఏదైనా తెలుగు పేరు రాసి రమ్మనండి...

 అవతల వైపు వినిపిస్తూ ఉన్నట్టుంది. హడలిపోయి పెట్టేశాడు.
 ప్రాబ్లమ్ ఈ మధ్యే మొదలయ్యింది. పదీ పదిహేను రోజులు అయి ఉంటుంది. ఒకరోజు ఇంటికి వచ్చేసరికి స్నానం అదీ ఏమీ లేకుండా కూచుని ఉంది. పిల్లలు కాలేజ్ నుంచి వచ్చినా పట్టించుకోకుండా ఉంది. వంట కూడా చేయలేదట. పలకరిస్తే పలకరించడం లేదట. కంగారుగా అనిపించింది. పలకరించే లోపలే కోపంగా హూంకరించింది.
 ఉడ్‌వర్క్ ఎప్పుడు చేయిస్తారు?

 ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఈ గొడవెందుకొచ్చింది.
 ఎప్పుడు చేయిస్తారు?... మళ్లీ రెట్టించింది.
 ఆ తర్వాత చేయి పట్టుకుని విసురుగా కిచెన్‌లోకి తీసుకెళ్లింది.
 ఇదంతా చేయించాలి... ఈ అరలు ఈ అరలు ఈ అరలు... ఏదీ కనపడకూడదు... అన్నింటికీ తాళాలు ఉండాలి... ఆ తాళాలు కనపడకుండా దాచేయాలి.... ఏం కనపడకుండా దాచేయాలి....
 మామూలుగానే ఉందా... ఏమైనా అయ్యిందా... అర్థం కానట్టుగా ఉంది.

 ఫ్లాట్ కొన్నప్పుడు ఎవరైనా వస్తే బాగోదని హాల్లో కొంచెం ఉడ్ వర్క్ చేయించాడు. బెడ్‌రూమ్‌లో బట్టలు పెట్టుకోవడానికి తప్పదని ఇంకొంచెం. మరో బెడ్‌రూమ్ కిచెన్ వదిలేశాడు. ఇద్దరబ్బాయిలూ ఆ రూమే వాడతారు. మెటల్ రాక్స్ తెచ్చుకుని వాళ్ల బట్టలు పుస్తకాలు సర్దుకున్నారు. డైనింగ్ ఏరియాలో రెండు ర్యాక్స్ పెట్టుకుని తన పుస్తకాలు అమర్చుకున్నాడు. ఉన్న డబ్బులకు స్తోమతకూ ఇదే ఎక్కువ. ఆ సంగతి తెలుసు. ఏం పర్లేదు లేండి... ఉన్నప్పుడే చేయించుకుందాం అనేది. ఇప్పు డేంటి?
 చేయిస్తారా లేదా... చెప్పండి చేయిస్తారా లేదా... మీరు చచ్చి మమ్మల్నీ చంపుతారా... హఠాత్తుగా నుదురు కొట్టుకుంటూ ఏడ్వడం మొదలుపెట్టింది. పిల్లలు హడలిపోయారు. ఎప్పుడూ ఇలా ఏడ్చింది లేదు.

 ఊరుకో.. ఊరుకో.. వెంటనే చేయిస్తాగా...
 బజారుకు పరిగెత్తి తెలిసిన క్లినిక్ ఉంటే సంగతి చెప్పి రెస్టిల్ ఒకటి తెచ్చి వేసి నిద్ర పుచ్చాడు. ఏమై ఉంటుంది?
 ఎవరింటికైనా వెళ్లొచ్చిందా? వేరే ఫ్లాట్స్ వాళ్ల ఉడ్ వర్క్ ఏమైనా చూసొచ్చిందా? పిల్లల్ని అడిగాడు
 లేదు. ఇంట్లోనే ఉంది. రోజంతా టీవీ చూస్తూ ఉంది.

 మరి... ఈ గొడవ ఎందుకు రేపింది. ఒకవేళ రేపినా ఇప్పుడు ఉడ్ వర్క్ చేయించాలంటే అరవై డెబ్బై వేలు కావాలి. ఎక్కణ్ణుంచి తేవడం. అదీగాక వాటికి తాళాల గొడవ ఏమిటో..
 రెండు రోజులకు సంగతి తెలిసింది. ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి ఏదో దుర్వాసన వస్తోంది. పిల్లలు ఏంటమ్మా అని అడిగితే జవాబు చెప్పడం లేదట. అలాగే కూచుని ఉంది. తను అడిగినా చెప్పలేదు. హడలిపోయి ఇల్లంతా వెతికితే బెడ్‌రూమ్‌లో కప్‌బోర్డ్ నుంచి వస్తున్నట్టుగా అర్థమైంది. దానికి తాళం వేసే వీలుంది. ఇంటి తాళం కప్ప దానికి వేసి ఉంది.

 ఏంటీ పిచ్చిపని... బలవంతంగా తాళం వెతికి లాక్కుని తెరిచి చూస్తే పాలిథిన్ కవర్. కోపం వచ్చేసింది.
 ఏంటిది?
 మీరు తెచ్చిందే. చికెన్.
 మరి డీప్ ఫ్రిజ్‌లో పెట్టక ఇక్కడెందుకు దాచావ్?
 ఎవరైనా చూస్తే?
 చూస్తే?
 చూసి చంపేస్తే?....

 భయంగా చూశాడు. గబగబా చెప్పింది.
 అందుకే చెప్పేది... మీరు ఉడ్ వర్క్ చేయిస్తే అక్కడే రహస్య అరలు చేయించి ఇలాంటివి దాచుకుందామని... రోజులు ఎలా ఉన్నాయని... మీకేం తెలుసు... టీవీ చూడండి తెలుస్తుంది... చంపేస్తారు... గొణుగుతూ ఉండిపోయింది.

 ఎప్పుడూ మొహల్లాల్లో ఉండటానికి ఇష్టపడదు. టోలీచౌకీలో ఒక ఫ్లాట్ చీప్‌గా వస్తుందని చెబుతున్నా మనవాళ్ల మధ్యే మళ్లీ ఎందుకండీ. పిల్లలకు వేరేవి తెలవొద్దూ. కాస్త తెలుగోళ్లు ఉండే చోట చూడండి అనంటే ఇక్కడ చూశాడు. అందరితో స్నేహంగా ఉంటుంది. అందరూ స్నేహంగా ఉంటారు. కాని కొత్తగా ఇప్పుడు భయపడుతోంది.

 మనం ఒక్కళ్లే అయిపోయామండీ... ఇన్ని ఫ్లాట్లున్నాయ్... ఒక్కళ్లూ మనవాళ్లు లేరే...
 హాస్పిటల్‌కు తీసుకెళ్లి తెచ్చాక కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు చిన్నచిన్న పనులకు బయటకు వెళితే బురఖా వాడేది. ఇప్పుడు మానేసింది. జుబ్బాలు దాచేసింది. ప్యాంట్ షర్ట్ వేసుకుని టక్ చేసి వెళ్లాలట. అబ్బాయిలిద్దరి మెడల్లో తావీజులు ఉండేవి. తీసేదాకా ఊరుకోలేదు.
 మనం ఎవరమో తెలియకూడదండీ...
 తెలిస్తే?

 అమ్మో... చంపేయరూ...
 ఆ తర్వాత పుస్తకాల వెంట పడింది. వాటిని తీసుకెళ్లి తూకానికి వేసి రావాలట. కథలూ కవిత్వం రాయకూడదట. నా మీద ఒట్టే అని కూచునింది.
 ఏం రాస్తే?
 భలేవారే. చంపేస్తారండీ బాబూ....
 ఏం చంపరు.

 అయ్యో.. మీకు తెలియదండీ. మొన్న మీ ఫ్రెండ్‌ని చూళ్లేదు... టీవీలో చూపించారు లేండి... ఒక నలభై యాభై మంది ఆఫీస్‌లో దూరి చంపాలనుకోలేదూ? చంపడం ఎంతసేపండీ నాయనా.... గట్టి పిండాలెవరైనా నాలుగైదు పిడిగుద్దులు కురిపిస్తే చాలు... చచ్చి ఊరుకుంటారు....
 టైమ్ రెండయ్యింది. చూసుకొని డోస్ వేశాడు. మందులు పడుతున్నాయి. కాని గుణమే.... బాగా తినిపించండి అన్నాడు డాక్టర్. ఏం తినిపించడం.

రెడ్ మీట్ మంచిది కాదంటే మటన్ మానేసి చాలా కాలం అయ్యింది. సముద్రం ఒడ్డున పెరిగి వచ్చిన వారికి ఇక్కడ దొరికే రొయ్యలు నచ్చవు. ఫ్రెష్ చేపలు దొరికినప్పుడు. లేదంటే అదిగో ఆ కాస్త చికెనే. అది కూడా బంద్ చేయించింది.
 వద్దు బాబోయ్ వద్దు. తెస్తే ఎవరైనా చూస్తారు. లేని పోని గొడవ...
 నీకు పిచ్చెక్కింది.

 నాక్కాదు. మీకు ఎక్కింది. రోజులు తెలియడం లేదు. చికెనూ గికెనూ తినకూడదమ్మా. ఇవేమిటి... ఇన్ని గుడ్లు తెచ్చారు. హమ్మ బాబోయ్... ఈ మనిషి నన్నూ నా బిడ్డల్ని నట్టేట ముంచుతాడమ్మా... ఉడ్ వర్క్ చేయిస్తే దాచుకోనన్నా దాచుకుంటానే.... తాళాలు వేసుకుంటానే.... ఇప్పుడు నలుగురూ చూసేలా ఇక్కడ పెట్టి... ఒక్కోటి తీసి నేలకేసి పగలగొడుతూ ఉంది.
 ఆ రాత్రి వేరే గొడవేం చేయలేదు. మూడు నాలుగు రోజులు గడిచాయి. గుణం కనిపిస్తుందేమోనని ఉడ్ వర్క్ మొదలేయించాడు. కాని కార్పెంటర్ రెండ్రోజులకు పారిపోయాడు. ఒక్కో కప్‌బోర్డ్‌లో ఏడు అరలు ఉండాలట. అవి ఒకదాని లోపల ఒకటి ఉండాలట. వాటికి తాళాలు ఉండాలట. కూచోబెట్టి అడిగాడు-
 ఎందుకు?

 ఎండు చేపలు ఇష్టం అని తెలియదా. ఎప్పుడైనా ఊరి నుంచి వస్తే ఎవరి కంటా పడకుండా దాచుకోవద్దూ? గొంతు తగ్గించి రహస్యంగా అంది.
 డాక్టర్‌కి ఫోన్ చేసి మందు మార్పించాడు. డోస్ పెరిగిందో ఏమో రోజు రోజుకూ నీరసపడిపోతూ ఉంది.
 ఆ రోజు రాత్రి ఆఫీసు నుంచి వచ్చాక మరో పది నిమిషాలకు వాళ్లన్నయ్య వచ్చాడు. సెలవు పెట్టి దర్గాకు వెళ్లి వచ్చాడట. లేమ్మా.. లే అని నుదురు తాకి జబ్బకు నల్లదారం కట్టాడు. కాస్త తినరాదూ అని తెచ్చిన ప్యాకెట్టు విప్పాడు. పామును చూసినట్టు ఉలిక్కిపడింది.
 ఏంటివి?

 ఖర్జూరాలు...
 ఖర్జూరాలా... అరేబియావి కదూ.
 అవును. ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ...
 అయ్యో అన్నయ్యా... ఇవి మనకు పండవు. మనవి కాదు. మనం తినకూడదు...
 తింటే?
 తింటేనా? తెలియదా? చంపేస్తారే... చంపేస్తారే... చంపేస్తారే... దేవుడా... ఏమిటి చేయడం...
 నుదురు కొట్టుకుంటూ కాళ్లూ చేతులూ విదిలిస్తూ ఇంటినీ భర్తనూ పిల్లలనూ చూసుకుంటూ బతికే ఆ పిచ్చి మాతల్లి తనకు అపసవ్యంగా అనిపించేవాటికి అపసవ్యపు విరుగుడు వెతుక్కుంటూ వేరే ఏ వీలూ లేక స్పృహ... తప్పి.. పో..యిం..ది.
 - మహమ్మద్ ఖదీర్‌బాబు

మరిన్ని వార్తలు