మారిపోయేది ధర్మమ్,మారనిది సత్యమ్‌

22 Sep, 2019 05:45 IST|Sakshi

స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం.  ‘ధర్మము’ అనే మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎప్పుడూ కూడా అవతలి వారిని బట్టి ఉండదు. ధర్మం అంటే వ్యావహారికంలో ఒక దీనుడికి జేబులోనుంచి ఒక రూపాయి ఇస్తే ధర్మం చేసాడు అంటూంటారు... ఇది అది కాదు. ధర్మం అంటే–ఎలా ప్రవర్తించమని పరమేశ్వరుడు వేదంలో చెప్పాడో తెలుసుకుని అలా ప్రవర్తించడానికి ‘ధర్మము’ అని పేరు. అందుకే ఏది ధర్మం? అని చెప్పే సాధికారత ఒక్క వేదానికే ఉంది. వేదం తరువాత అటువంటి అధికారం స్మృతికి ఉంది. తరువాత వరుసగా పురాణం, శిష్టాచారాలు, అంతరాత్మ. ఈ అయిదూ ప్రమాణాలు. ‘ధర్మం ఇది’ – అని చెప్పడానికి ఆరవ ప్రమాణం లేదు. ధర్మాన్ని అనుష్ఠించేటప్పుడు తనకి దేశకాలాల్లో ఏది విధింపబడిందో దాన్ని అవతలివారి ప్రమేయం లేకుండా చేస్తారు. అప్పడు అది ధర్మమవుతుంది. అందుకే ధర్మం ఎప్పుడూ ఒక్కలా ఉండదు.

కానీ సత్యం మాత్రం మార్పు లేకుండా ఒక్కలాగే ఉంటుంది. మనం సినిమా చూడ్డానికి వెడతాం. ముందు ఒక తెర ఉంటుంది. ఆ తెర మారదు. 50 సంవత్సరాలపాటు ఆ సినిమా హాలు అలాగే ఉన్నా, అందులో ఇప్పటికి ఏడువేల సినిమాలు వేసినా...ఎంతో మంది ఏడ్చిన వాళ్ళున్నారు, నవ్వినవాళ్ళు ఉన్నారు...పరమానందంతో వెళ్ళిపోయిన వాళ్ళున్నారు... కథలు మారాయి, పాత్రలు మారాయి, బుద్ధులు మారాయి...కానీ తెర మాత్రం అలాగే ఉంది. సత్యమూ అంతే. సత్యం మారదు. మారని దానిని సత్యము అంటారు. మారిపోయే దానిని ధర్మం అంటారు. మారిపోయే ధర్మాన్ని శాస్త్ర విహితంగా ఎవడు పట్టుకున్నాడో వాడు మారని సత్యంగా మారిపోతాడు. అదే మోక్షం.ధర్మం దేశ, కాల, వర్ణ, ఆశ్రమాలనే నాలుగింటినిబట్టి మారిపోతూ ఉంటుంది. ఒక దేశంలో(ప్రాంతంలో అని) ఉన్న ధర్మం మరొక దేశంలో ఉండదు. నేనింట్లో ఎంత పూజ చేస్తానో దానిలో పదోవంతు నేను పై ఊరు వచ్చినప్పుడు కూర్చుని చేస్తే చాలు.

ఏకాదశినాడు ఉపవాసం ధర్మం, ద్వాదశినాడు తినడం ధర్మం. దేశాన్నిబట్టి, కాలాన్ని బట్టి ధర్మం మారిపోతుంది. అలాగే వర్ణం కూడా. యజ్ఞోపవీతం ఉన్నవాడికి సంధ్యావందనం ధర్మం. అదిలేనంతమాత్రం చేత తక్కువ వారు కాదు. సూర్యనమస్కారం చేసి సూర్యస్తుతి చదివితే చాలు, వారికది ధర్మం. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారికి చదువుమీద దృష్టి పెట్టడం ధర్మం. ఆయనకు ఉపవాసం లేదు. గృహస్థు భార్యతో సహజీవనం చేస్తాడు. భవిష్యత్‌ అవసరాలకోసం ఇల్లు కట్టుకుంటాడు. ఆయనకా అధికారం ఉంది. వానప్రస్థు భార్యను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళి ఒక కుటీరం కట్టుకుని ఎప్పుడూ తనలో తాను ఆత్మవిచారం చేస్తుంటాడు. పుణ్యకార్యాలు చేస్తూ భగవంతుని చేరడానికి ప్రయత్నిస్తాడు. చిట్టచివరిదయిన తురీయాశ్రమంలో ఇక దేనితో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం. బ్రహ్మచారిలా గృహస్థు బతక కూడదు. గృహస్థులా వానప్రస్థు బతకకూడదు. ఒకరిలా మరొకరు బతకరు. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ధర్మం మారిపోతుంటుంది మారిపోతున్న ధర్మాన్ని పట్టుకునేటప్పుడు అవతలివాడి వలన ఇవతలివాడి ధర్మం మారదు.

మరిన్ని వార్తలు