మాట పడడం గొప్ప పని

25 Jun, 2018 00:55 IST|Sakshi

గిలు జోసెఫ్‌ కేరళలో పేరున్న రచయిత్రి. ఎంత పేరున్నా.. రచయితలు, రచయిత్రుల రచనలు మాత్రమే çపత్రిక లోపల కనిపిస్తాయి కానీ, వారి ఫొటోలు పత్రిక కవరు పేజీ మీద సాధారణంగా కనిపించవు. అయితే గత మార్చిలో ప్రముఖ మలయాళీ పక్షపత్రిక ‘గృహలక్ష్మి’ ముఖచిత్రంగా గిలు కనిపించారు. ఆ సంచిక స్టాండ్స్‌లోకి రాక ముందు వరకు రచయిత్రిగా ఉన్న గిలు.. తెల్లారేసరికి రచయిత్రి కాకుండా పోయారు. ఆమెకు బాగా చెడ్డపేరు వచ్చేసింది. ‘బజారు మనిషి’ అన్నారు. ఇది అభ్యంతరమైన మాటే గానీ, గిలు ఆ మాటను పడవలసి వచ్చింది. బిడ్డకు చనుబాలు ఇచ్చే తల్లిగా ఆ పత్రిక కవర్‌ పేజీకి మోడలింగ్‌ చేయడం వల్ల గిలు మూట కట్టుకున్న మాట అది. ఒక్కసారిగా గిలు లోకం తలకిందులయింది. తనను ఎంతో అభిమానించే పాఠకులే ఆమెను దూషించడం మొదలుపెట్టారు.

‘ఇందులో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. సమాజానికి ఒక మంచి సందేశం ఇవ్వడానికే కదా నేను ఇలా మోడలింగ్‌ చేశాను’ అని గిలు వివరణ ఇచ్చినా.. దాన్నెవరూ స్వీకరించడానికి సిద్ధమైపోలేదు. పత్రిక మీద, మోడలింగ్‌ ఇచ్చిన గిలు మీద కేరళ హైకోర్టులో కేసు కూడా వేశారు. గతవారం తీర్పు వచ్చింది. ‘తప్పేం లేదు’ అంది కోర్టు. గిలు మనసు తేలికయింది.  అంతరార్థాలను వెతుక్కుని అర్థం చేసుకునే సమయం లోకానికి ఎప్పుడూ ఉండదు. అపార్థాలను మాత్రం క్షణాల్లో చేసేసుకుంటుంది. మలయాళంలో ‘ముల’ అనే మాటకు పాలిండ్లు అని అర్థం. తన ఫొటో.. కవర్‌ పేజీపై వచ్చాక ఈ మాటను పలికేందుకు మునుపటిలా ఎవరూ బిడియపడడం లేదని గిలు సంతోషిస్తున్నారు. బాహాటంగా మాట్లాడేందుకు సంశయించే మంచి విషయాలు సహజమైనవిగా లోకానికి అనిపించాలంటే.. గిలులా ఎవరో ఒకరు మాట పడవలసిందే. అప్పుడు మాట పడడం కూడా గొప్ప పని అవుతుంది.  

మరిన్ని వార్తలు