వర్కర్‌ ఫ్రమ్‌ హోమ్‌: నీరజా బిర్లా

13 May, 2020 08:19 IST|Sakshi

ఇల్లు ఇల్లే. ఆఫీస్‌ ఆఫీసే. మధ్యలో గీత ఉంటుంది. ఆ గీతను చెరిపేస్తోంది ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’! ఆఫీస్‌ పని చేస్తున్నాం. కానీ.. ఆఫీస్‌ పనిలా చేయడం లేదు. షార్ట్‌లు వేసుకుంటున్నాం. ల్యాప్‌టాప్‌తో జారిగిల పడుతున్నాం. మనం ఎలా ఉంటేనేం? వర్క్‌లో ది బెస్ట్‌గా ఉంటున్నాం కదా! ‘వర్కర్‌గానూ ది బెస్ట్‌గా ఉండాలి..’ అంటున్నారు.. నీరజా బిర్లా.

నీరజా బిర్లా ‘ఎంపవర్‌’ అనే కంపెనీ నడుపుతున్నారు. కోటీశ్వరుడైన పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా సతీమణి ఆమె. మార్చినెల ముందు వరకు నీరజ తన కంపెనీని ఆఫీస్‌లోంచి నడిపేవారు. ఇప్పుడు ఇంట్లోంచి నడుపుతున్నారు. లాక్‌డౌన్‌లో ఎవరికీ తప్పని స్థితి. ‘ఎంపవర్‌’ అంటే మైండ్‌ పవర్‌. ‘మైండ్‌ మ్యాటర్స్‌’ అనే తగిలింపు (ట్యాగ్‌ లైన్‌) కంపెనీ పేరు కింద ఉంటుంది. ‘ఇట్స్‌ ఓకే టు నాట్‌ బి ఓకే..’ అనేది  ‘ఎంపవర్‌’ చెప్పే ధైర్య వచనం. ‘బాగుండక పోవడం కూడా బాగుండటమే’ అంటుంది. మానసిక సమస్యలకు పరిష్కారాలు కనిపెడుతుండే ఓ పెద్ద కార్పోరేట్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌.. ‘ఎంపవర్‌’.
∙∙ 
ఇంట్లోంచి పని చెయ్యడం (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ముందునుంచీ ఉన్నదే. లాక్‌డౌన్‌తో ఇప్పుడు విస్తృతంగా ఉంటోంది. ఆఫీస్‌కి వెళ్లి చేసినా, ఇంట్లోంచి చేసినా పని అదే. అయితే పని చేసే విధానమే వేరుగా ఉంటోంది. ఆఫీస్‌కి ఒక టైమ్‌ ఉంటుంది. ఆఫీస్‌కి ఎంపిక చేసి పెట్టుకున్న దుస్తుల్ని వేసుకుని వెళ్తాం. ఆఫీస్‌లో చుట్టూ నలుగురు పని చేస్తుంటారు. కూర్చున్నా, లేచినా, నిలబడినా, నడుస్తున్నా ఒక పద్ధతి ఉంటుంది. ఇంట్లోంచి పని చేస్తున్నప్పుడు ఇవేవీ పట్టించుకునే అవసరం ఉండదు. ఇష్టం వచ్చినట్లు ఉంటాం. కూర్చుని, కాళ్లు బార్లా చూపుకుని, నిలుచుని, పడుకుని కూడా ఆఫీస్‌ పని చేస్తుంటాం.

మొత్తానికి పని ఫినిష్‌ అవుతుంది. ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా కొందరు షార్ట్స్‌తో కనిపించడం, బెడ్‌ మీద నుంచి పూర్తిగా లేవకుండానే వీడియో మీటింగ్‌కి హాజరవడం, బాత్రూమ్‌లోని నీళ్లు ఫ్లష్‌ అవుతున్న చప్పుళ్లు వినిపించడం కూడా కొన్ని చోట్ల జరుగుతోంది. ఆఫీస్‌ పనంటే నిర్లక్ష్యం కాదు. ఇల్లే కదా అన్న ఏమరుపాటు. అయితే వీడియోలో కనిపిస్తూ పని చేసినా, కనిపించకుండా పని చేసినా ఆఫీస్‌ పనిని ఇంట్లో కూడా ఆఫీస్‌లో చేసినట్లే చెయ్యాలనే మైండ్‌సెట్‌ను అలవరచుకోవడం మంచిదని నీరజా బిర్లా చెబుతున్నారు. ఊరికే చెప్పడం కాదు. ఆమె కూడా ఆచరిస్తున్నారు. 
∙∙ 
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మొదలయ్యాక నీరజ దినచర్యలో ఒకట్రెండు తప్ప పెద్దగా మార్పులేమీ జరగలేదు. మునుపు రోజుకు ఒకసారి వర్కవుట్‌ చేసేవారు. ఇప్పుడు రెండుసార్లు చేయగలుగుతున్నారు. అవిశ్రాంతంగా పని చేశాక సాయంత్రం ఒంటికి ఒక చిన్న ఎక్సర్‌సైజ్‌.. మానసికంగా కూడా బలాన్నిస్తుంది అంటారు నీరజ. ఆఫీస్‌కు వెళ్తున్నప్పుడు ఎన్ని గంటలకు లేచేవారో ఇప్పుడూ అదే సమయానికి లేస్తున్నారు ఆమె. ఆఫీస్‌ టైమ్‌కే ఇంట్లో తన వర్క్‌ని మొదలుపెడుతున్నారు. ఆఫీస్‌కి తను ప్రత్యేకంగా ఏవైతే దుస్తుల్ని వేసుకునేవారో అవే వేసుకుంటున్నారు.

అలా అయితేనే మానసికంగా పనికి సన్నద్ధత వస్తుంది అంటారామె. లాక్‌డౌన్‌కు ముందు ఆమె ఫోన్‌ ఆమెకు సమీపంలో ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం దగ్గరే ఉంచుకుంటున్నారు. అందుకు తగిన కారణమే ఉంది. భర్త ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. కూతురు అనన్య లాస్‌ ఏంజెలిస్‌లో ఉంటోంది. లాక్‌డౌన్‌తో ఎక్కడి వాళ్లు అక్కడయ్యారు. వీడియో కాల్స్‌తో దగ్గరవుతున్నారు. ఆఫీస్‌ పని మధ్యలో ఆ కాల్స్‌ని మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు నీరజ. మిగతా ఇద్దరు పిల్లలు అద్వైతేశ (కూతురు), ఆర్యమన్‌ ఆమెతోనే ఉన్నారు. వాళ్లిద్దరూ కిచెన్‌లో ప్రయోగాత్మకంగా కేకులు, పాస్తాలు, పిజ్జా, యోర్క్‌షర్‌ పుడింగ్‌ చేసి ఆఫీస్‌ పనిలో తనకు బ్రేక్‌లు ఇస్తున్నారట. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నీరజకు కొత్తేం కాదు. అయితే ఇది గృహ నిర్బంధ విధి నిర్వహణ. ‘‘ఈ పరిస్థితి నాకొక విషయాన్ని తెలియజేస్తోంది. దీనిని ఇకముందు కూడా కొనసాగించడం వల్ల మన శక్తులు పునరుత్తేజం అవుతాయి. పని సరళం అవుతుంది. మనకు కొన్ని మాత్రమే అవసరం అవుతాయి. ఆ కొన్నిటితోనే జీవితం సంపూర్ణ అయినట్లు ఉంటుంది. తీరైన జీవన విధానం అలవడుతుంది’’ అంటున్నారు నీరజ.  

మరిన్ని వార్తలు