కంప్యూటర్‌పై పనిచేస్తుంటే కాసేపటి తర్వాత తప్పులెందుకు..?

5 Sep, 2013 01:44 IST|Sakshi
కంప్యూటర్‌పై పనిచేస్తుంటే కాసేపటి తర్వాత తప్పులెందుకు..?

 నేను నిత్యం కంప్యూటర్‌ను ఉపయోగించి పనిచేస్తుంటాను. కానీ నేను గమనించిన అంశం ఏమిటంటే దాదాపు రెండు, మూడు గంటల తర్వాత అంతే ఏకాగ్రతతో పనిచేస్తున్నా కొన్ని తప్పులు వస్తున్నాయి. నాకు ఆత్మవిశ్వాసం పాళ్లు ఎక్కువే. అయినా నా విషయంలో కంప్యూటర్ ఉపయోగంలో తరచూ తప్పులెందుకు దొర్లుతున్నాయో అర్థంకావడం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలు చెప్పండి.
 - సునీల్, బెంగళూరు

 
 మీలా చాలామంది గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తుంటారు. ఇలా సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఒకే పోశ్చర్‌లో కూర్చుంటే అది స్టాటిక్ లోడింగ్ అనే పరిస్థితికి దారితీస్తుంది. అంతెందుకు కేవలం అరగంటకే ఈ పరిస్థితి వస్తుంది. ఈ కండిషన్‌లో రక్తప్రసరణ 20 శాతం మందగిస్తుందని పరిశోధనల్లో తేలింది.

ఇలా కూర్చుండిపోయినప్పుడు వాళ్ల ఉచ్ఛాస్వ నిశ్వాస లు సైతం 30 శాతం మందగిస్తాయి. దాంతో ఆక్సిజన్ పాళ్లూ 30 శాతం తగ్గుతాయి కదా. అంటే... ఆ మేరకు శరీరానికి అవసరమైన ప్రాణవాయువు తగ్గడంతో కూర్చుని పనిచేస్తున్న కొద్దిసేపటికే అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాగే వ్యాయామం తగ్గడం వల్ల కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అందుకే దీర్ఘకాలంపాటు అదేపనిగా కంప్యూటర్‌పై పనిచేయాల్సిన వారు కొద్ది కొద్ది సేపటి తర్వాత ఒకసారి లేచి కాసేపు పక్కన తిరగాలి. అలాగే నేరుగా అదేపనిగా కంప్యూటర్ స్క్రీన్ వైపు రెప్పవాల్చకుండా చూడకూడదు. ప్రతి పది నిమిషాలకు ఒకమారు కళ్లకు కాస్త విశ్రాంతినిస్తూ ఉండాలి. ఇలా కంప్యూటర్‌పై కూర్చుని పనిచేసేవారు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ సూచనలను అనుసరిస్తే చాలావరకు మీరు చేసే తప్పుల సంఖ్య తగ్గుతుంది.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్‌నెస్ నిపుణుడు,
 హైదరాబాద్

 

మరిన్ని వార్తలు