వారికి వ్యాయామమే మందు..

28 Jun, 2018 16:17 IST|Sakshi

లండన్‌ : కుంగుబాటుతో సతమతమయ్యే వారు గుండె జబ్బుకు లోనయ్యే ముప్పును తప్పించుకునేందుకు వ్యాయామం దోహదపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. కుంగుబాటు బాధితులకు వ్యాయామం ఔషధంలా పనిచేస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు చేపట్టిన అథ్యయనంలో వెల్లడైంది. శారీరకంగా దృఢంగా ఉన్న వారిలో గుండె సమస్యలతో మరణించే ముప్పు 56 శాతం తక్కువగా ఉన్నట్టు అథ్యయనంలో తేలింది. నిరాశావాదాన్ని పారదోలి, కుంగుబాటుకు దూరం కావాలంటే నిత్యం వ్యాయామం చేయడమే మేలని నిపుణులు స్పష్టం చేశారు.

డిప్రెషన్‌తో బాధపడేవారికి వ్యాయామం ఔషధంలా పనిచేస్తుందని 17,000 మందిపై నిర్వహించిన ఈ అథ్యయనంలో వెల్లడైంది. మధ్యవయసులో మెరుగైన ఫిట్‌నెస్‌ కలిగినవారు తర్వాతి కాలంలో వారు కుంగుబాటుతో బాధపడుతున్నా గుండె జబ్బు కారణంగా మరణించే ముప్పు గణనీయంగా తగ్గినట్టు పరశోధకులు గుర్తించారు. గుండె ఆరోగ్యం, కుంగుబాటుకు సంబంధం ఉన్న క్రమంలో దీర్ఘకాలంలో కుంగుబాటు గుండె జబ్బులు, ఛాతీనొప్పికి దారితీస్తాయని పలు అథ్యనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కుంగుబాటు రోగులు, గుండె జబ్బుల ముప్పున వారు తమ మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సైకియాట్రీ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు