శరీరానికే వైకల్యం... చెదరనివ్వకు మనోబలం

27 Oct, 2013 23:28 IST|Sakshi

 పక్షవాతం ఎంత ప్రమాదకరమైనదంటే... ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వతంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు పక్షవాతం బారిన పడుతున్నారు. ఇవీ పక్షవాతం తీవ్రతకు అద్దం పట్టే అంకెలు. ఒకసారి పక్షవాతం బారిన పడితే ఇక వారు జీవితాంతం పక్క మీద పడీ, పక్కవాళ్ల మీద ఆధారపడీ జీవించాల్సిన దుస్థితి అనుకుంటారందరూ. అందుకే గుండెపోటుకూ భయపడనివారు, పక్షవాతం అంటే వణికిపోతుంటారు. అయితే మనోబలం చెడనివ్వకపోవడం, చిరునవ్వు చెరగనివ్వకపోవడాలే దీనికి అసలైన చికిత్సలు. అంతకంటే పెద్ద చికిత్స, సమర్థమైన చికిత్స నివారణే. పైగా ఈ నివారణ చాలా సులభం కూడా. ఈ నెల 29న ప్రపంచ పక్షవాత దినం (వరల్డ్ స్ట్రోక్ డే) సందర్భంగా పై అంశాలపై అవగాహన కలిగించడం కోసమే ఈ కథనం.
 
పక్షవాతం వస్తే శాశ్వతంగా అంగవైకల్యం కలగడానికి ఒక కారణం ఉంది. ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా చనిపోయినా ఆ కణం స్థానంలో కొత్త కణాలు పెరిగే అవకాశం ఉంది. కానీ మెదడు కణాలు మాత్రం అలా కాదు. అవి ఒకసారి నశించాయంటే ఇక ఆ నష్టం శాశ్వతం. అందుకే పక్షవాతం వచ్చి, కాళ్లూ చేతులు చచ్చుబడిపోతే అవి సాధారణ స్థితికి రావడం ఒక పట్టాన అసాధ్యం. అందుకే పక్షవాతం లక్షణాలు కనిపించగానే రోగిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.
 
 ఒక కుటుంబంలో ఎవరైనా, ఏదైనా వ్యాధికి గురైతే అది వారిని మాత్రమే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కానీ పక్షవాతానికి గురైతే మాత్రం అది మొత్తం కుటుంబ సభ్యులనందరినీ ప్రభావితం చేస్తుంది. అందరికీ ఇక్కట్లను కలగజేస్తుంది. గతంలో ఒక వయసు దాటినవారు పక్షవాతానికి గురయ్యేవారు. కానీ ఇప్పుడు యుక్తవయసులోని వారు కూడా దీని బారిన పడుతున్నారు. మారుతున్న జీవనశైలి, జన్యుపరమైన అంశాలు ఇందుకు కారణం.
 
 పక్షవాతానికి కారణాలు:
 మన శరీరంలోని ప్రతి అవయవానికీ రక్తం నిరంతరం సరఫరా అవుతుండాలి. ఇక మెదడు విషయంలోనైతే అది మరింత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్తసరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే అక్కడి కణాలు మరణించడం జరుగుతుంటుంది. రక్తసరఫరాలో అంతరాయానికి ప్రధానంగా రెండు రకాల కారణాలున్నాయి.  మొదటిది... రక్తనాళాల్లో ఎక్కడైనా రక్తం గడ్డకట్టి అది ప్రవాహానికి అడ్డుపడటం. దాదాపు 80 శాతం పక్షవాతం కేసుల్లో ఇదే కారణం. ఇక ఒక్కోసారి రక్తనాళాలు చిట్లడం వల్ల రక్తం బయటకు ప్రవహించడంతో మెదడులోని కొన్ని కణాలకు రక్తసరఫరా అందకపోవడం. దాదాపు 20 శాతం కేసుల్లో పక్షవాతానికి ఈ కండిషన్ కారణమవుతుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా మెదడులోని ఆ రక్తనాళాలు సరఫరా చేసే భాగానికి తగినపోషకాలు, ఆక్సిజన్ అందక ఆ ప్రాంతంలోని కణాలు నశిస్తాయి. దాంతో అవి నియంత్రించే శరీర భాగాలు చచ్చుబడిపోతాయి.
 
 లక్షణాలు:

 పక్షవాతంలోని లక్షణాలు మెదడులో రక్తసరఫరా ఆగిన చోటుపై ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మెదడులోని కాళ్లూ, చేతులను నియంత్రించే భాగాలకు రక్తసరఫరా ఆగితే ఆ భాగాలు చచ్చుబడతాయి. అలాగే ముఖం, నోరు, కన్ను, ఒక్కోసారి శరీరానికి ఇరువైపులా ఉన్న భాగాలు ప్రభావితం కావచ్చు. దీనివల్ల మాట పడిపోవడం, నిలకడగా/స్థిమితంగా నిలవలేకపోవడం, చూపుకోల్పోవడం, స్పృహకోల్పోవడం కూడా జరగవచ్చు.
 
 దాదాపు 90 శాతం కేసుల్లో అకస్మాత్తుగా శరీరంలోని ఒకవైపు సగభాగంపై నియంత్రణ కోల్పోవడం ద్వారా దీని లక్షణాలు బయటపడతాయి. దాంతో పక్షవాతం సోకిన వ్యక్తుల్లో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం మామూలే. అకస్మాత్తుగా ఇలా జరగడాన్ని  తప్పనిసరిగా ‘పక్షవాతం’ (స్ట్రోక్)గానే పరిగణించాలి. (నిర్దిష్టంగా అది పక్షవాతం కాదని కచ్చితంగా తెలిసే వరకూ అది పక్షవాతమేనని వైద్యశాస్త్రం పేర్కొంటోంది).
 
 మనిషిలో ఒకవైపు శరీర భాగాలు చచ్చుబడిపోవడం వల్ల అతడు నిరాశ, నిస్పృహల్లోకి కూరుకపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని శరీరభాగాల్లో నొప్పి, మూత్రం/మలంపై నియంత్రణ కోల్పోవడం, ఎదుటివారితో కమ్యూకేషన్‌కు అంతరాయం కలగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, అయోమయం వంటి లక్షణాలూ ఉంటాయి. ఫలితంగా కుటుంబ సభ్యుల సంబంధాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
 
 దారితేసే అంశాలు:
 భారతదేశంలో పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో హైబీపీ (రక్తపోటు) చాలా సాధారణమైనది / ప్రధానమైనది. ఈ పరిస్థితికి పొగతాగడం, స్థూలకాయం, డయాబెటిస్, ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం, గుండెజబ్బులు, మితిమీరిన ఆల్కహాల్ అలవాటు, మానసిక ఒత్తిడి, శారీరకంగా తగినంత వ్యాయామం లేకపోవడం, కొద్దిమేరకు కుటుంబ చరిత్ర వంటివి పక్షవాతానికి దారితీసే పరిస్థితుల్లో ముఖ్యమైనవి.
 
 నిర్ధారణ:

 పక్షవాతాన్ని సీటీ స్కాన్ పరీక్ష లేదా ఎమ్మారై (బ్రెయిన్) ద్వారా నిర్ధారణ చేయవచ్చు. సీటీ స్కాన్, ఎమ్మారై ద్వారా పక్షవాతం వల్ల ప్రభావితమైన మెదడులోని ప్రాంతాలను గుర్తించవచ్చు. అలాగే రక్తస్రావం జరిగినా లేదా రక్తనాళాల్లో రక్తపు గడ్డలు అడ్డుపడినా ఆ పరీక్షలో తెలుస్తుంది. దాన్ని బట్టే చేయాల్సిన చికిత్స/కోలుకోగలిగే అవకాశాల (ప్రోగ్నోసిస్)ను నిర్ధారణ చేయవచ్చు.
 
 ఒకసారి పక్షవాతం వచ్చిందని నిర్ధారణ అయ్యాక, దానికి కారణాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం సీబీపీ, రక్తంలో చక్కెర  పాళ్లు (బ్లడ్ షుగర్), క్రియాటినిన్ వంటి రక్షపరీక్షలు, ఈసీజీ, టూ డి ఎకో వంటి గుండె పరీక్షలు, డాప్లర్ నెక్ వెసెల్స్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షలు, మూత్ర పరీక్ష వంటివి చేయాల్సి ఉంటుంది. రక్తంలో ఒక రకం ప్రొటీన్లయిన హోమోసిస్టిన్ వంటి వాటిని అంచనా వేసే పరీక్ష, ప్రో-కోయాగ్యులెంట్ ఫాక్టర్స్ (రక్తం గడ్డకట్టడానికి దోహదపడే అంశాల) పరీక్షలు కూడా చేయించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్టంగా పక్షవాతానికి కారణాన్ని కనుగొంటే దాన్ని బట్టి చికిత్స చేయడం సులభం. ఒక్కోసారి పక్షవాతానికి సంబంధించిన కొన్ని లక్షణాలు తాత్కాలికంగా కనబడితే... త్వరలోనే మరింత తీవ్రస్థాయిలో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని తెలుసుకోడానికి అది సూచనగా పనిచేస్తుంది. ఇలాంటి  లక్షణాలు కనిపించిన వారిలో 30 శాతం కంటే ఎక్కువమందిలో ఏడాదిలోపే మరింత తీవ్రంగా మళ్లీ పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.
 
 చికిత్స:
 పక్షవాతం వచ్చిన వారికి థ్రాంబోలైటిక్ థెరపీ అనే చికిత్సను అందజేస్తారు. ఈ చికిత్సప్రక్రియలో టిష్యూ ప్లాస్మినోజెన్ యాక్టివేటర్ (టీపీఏ) అనే ఇంజెక్షన్ ఇస్తారు. అది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్న చోట ఆ రక్తపు గడ్డను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో రక్తపు గడ్డ అడ్డుతొలగి, మళ్లీ మెదడులోని ఆ భాగానికి రక్త సరఫరా పునరుద్ధరణ జరుగుతుంది. అయితే పక్షవాతం లక్షణాలు కనిపించాక ఎంత త్వరగా ఈ ఇంజెక్షన్ ఇస్తే నష్టం అంత తక్కువగా ఉంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపించాక కనీసం నాలుగున్నర గంటలలోపే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. కోలుకోవడం వేగంగా జరగడంతో పాటు, దుష్ర్పభావాలు తక్కువగా ఉంటాయి.
 
 అయితే ఒకసారి పక్షవాతం రావడం అంటూ జరిగితే ఇక రెండోసారి రాకుండా నివారించడమే దీనికి చికిత్సగా పరిగణించవచ్చు. (మొదటిసారి వచ్చిన పక్షవాతం  నష్టనివారణ కోసం చేయాల్సిన చికిత్స అంటూ పెద్దగా ఉండదు). ఇందులో భాగంగా రక్తాన్ని పలచబార్చే మందులైన ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటివి ఇవ్వడం, రక్తంలో కొవ్వులు పేరుకోకుండా వాడే స్టాటిన్స్ వంటి మందులు వాడటం... చికిత్సలో భాగంగా ఇస్తారు. ఒకసారి పక్షవాతం కనిపిస్తే పైన పేర్కొన్న మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. అయితే రోగికి హైబీపీ, డయాబెటిస్ వంటివి ఉంటే ఆ మందులు కూడా వాడటం అవసరం. ఒకసారి గుండె సమస్యలు లేదా మెదడుకు రక్తాన్ని చేర్చే కెరోటిడ్ లేదా వర్టిబ్రల్ రక్తనాళాల్లో ఏదైనా సమస్యలు గుర్తిస్తే... పక్షవాతాన్ని నివారించేందుకు వీలుగా మందులు వాడాల్సింది. ఒకవేళ ఆ రక్తనాళాల్లో 70 శాతం కంటే ఎక్కువ అడ్డంకి (బ్లాక్) ఉంటే స్టెంటింగ్ లేదా శస్త్రచికిత్స అవసరమవుతుంది.
 
 పక్షవాతం బాధితుల పరిస్థితిని మెరుగుపరచడానికి ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ వంటివి చాలావరకు ఉపయోగపడతాయి.
 
 నివారణ:
 పక్షవాతం విషయంలో చికిత్స గురించి ఆలోచించడం కంటే నివారణ ఎంతో మేలు. ఇది చిన్నప్పట్నుంచే మొదలు కావాలి. నివారణ మార్గాలు కూడా చాలా సులభం.  
 
 మంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
 
 ఆహారంలో కొవ్వులు/ నూనెలు /మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  
 
 ఆహారంలో ఉప్పు బాగా తగ్గించాలి. ఒకసారి అన్నం పెట్టుకున్న తర్వాత పైనుంచి ఉప్పు వేసుకోవడం అలవాటును మానుకోవాలి.  
 
 తాజా ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు వంటి పోషకాహారాలను తీసుకోవాలి. కూరల్లో పసుపు ఎక్కువగా వాడటం పక్షవాతం నివారణకు బాగా మేలు చేస్తుంది.
 
  శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  
 
 మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి.  
 
 తాజా అధ్యయనాల ప్రకారం వంటకు ఆలివ్ ఆయిల్ వాడటం, ముదురు రంగులో ఉండే చాక్లెట్లు పక్షవాతం నివారణకు ఉపయోగపడతాయని తేలింది.  
 
 ఒకసారి పక్షవాతం వచ్చాక దాన్ని నయం చేసుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ వైద్యవిధానాలను అనుసరించడం  మన దేశంలో చాలా ఎక్కువ. అయితే అవేవి పెద్దగా సత్ఫలితాలను ఇవ్వవు. గుండెజబ్బుల వంటివి ఉన్నప్పుడు మొదట్నుంచీ రక్తాన్ని పలుచబార్చే మందుల్ని క్రమం తప్పకుండా వాడటం వల్ల పక్షవాతాన్ని చాలావరకు సమర్థంగా నివారించుకోవచ్చని గుర్తుంచుకోవాలి.  పక్షవాతానికి గురైన తర్వాత ఆ శరీర భాగానికి మసాజ్ వంటివి మన దేశంలో ఎక్కువ. అయితే వాటి వల్ల ఉండే ఉపయోగం పరిమితమే అని గుర్తుంచుకొని, నిరాశకు గురికాకుండా/మానసికంగా కుంగిపోకుండా ఉండాలి. ఒకసారి పక్షవాతానికి గురయ్యాక కోలుకోవడం లేదా నయం కావడం  మెదడులో దెబ్బతిన్న భాగం ఏ మేరకు కోలుకుంటుందన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక వయసు దాటాక గుండెజబ్బులు, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్న పెద్దవారు ఆ మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అప్పుడే నివారణ సాధ్యం.
 
 - నిర్వహణ: యాసీన్
 
 ఈ పరిస్థితి మారడమే ఇప్పటి అవసరం...
 రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి దాదాపు 40,000 మంది బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవుతున్నారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం వంద మందికి లోపే టీపీఏ  చికిత్స తీసుకోగలుగుతున్నారు. అందులోనూ 80 శాతంమందికి పైగా కేవలం హైదరాబాద్‌లోనే ఈ చికిత్స పొందగలుగుతున్నారు. ఇక మిగతా ప్రధాన  నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతిలో అడపాదడపా మాత్రమే ఈ చికిత్స అందుతోంది. దీనికి ప్రధాన కారణం బ్రెయిన్‌స్ట్రోక్‌కు ఇవ్వాల్సిన ఈ చికిత్సపై పెద్దగా అవగాహన లేకపోవడమే.
 
 డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి
 చీఫ్ న్యూరోఫిజీషియన్,
 కేర్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్, హైదరాబాద్.

>
మరిన్ని వార్తలు