కనికట్టు కాదు.. త్రీడీ భవనమే..

23 Dec, 2019 01:19 IST|Sakshi

పరి పరిశోధన

తాపీమేస్త్రీలు, కూలీలకు ఇక కాలం చెల్లినట్లేనా? ఇళ్లు కట్టడం ఇకపై చిటికేస్తే కాదుకాదు... మీటనొక్కితే జరిగిపోయే వ్యవహారమేనా? ఫొటోలో ఉన్న ఇంటి వివరాలు తెలిస్తే మీరూ అవునంటారు. దుబాయిలో కట్టారు దీన్ని. కట్టారు అనడం కంటే ప్రింట్‌ చేశారనడం సబబేమో. ఎందుకంటే ఆపిస్‌ కోర్‌ అనే కంపెనీ భారీసైజు త్రీడీ ప్రింటర్‌ను వాడి దీన్ని ముద్రించేసింది మరి. ఇలాంటివి గతంలోనూ అక్కడక్కడా ఒకట్రెండు ప్రింట్‌ చేశారుగానీ... ఈ సైజులో, సంక్లిష్టమైన డిజైన్‌తో మాత్రం ఇదే తొలిసారి. ఆపిస్‌ కోర్‌ త్రీడీ ప్రింటర్‌ను ఎప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. ఓ క్రేన్‌ ఉంటే సరిపోతుంది. ముగ్గురు మనుషులు మాత్రమే పాల్గొన్నారు ఈ నిర్మాణంలో. అది కూడా పునాదులు తవ్వడానికి, కిటికీలు, తలుపులు బిగించడానికి మాత్రమే.

మిగిలిన పనులన్నీ చక్కబెట్టింది త్రీడీ ప్రింటరే. ఆపిస్‌ కోర్‌ కంపెనీ గతంలో నాసా నిర్వహించిన ఓ త్రీడీ ప్రింటింగ్‌ పోటీలో బహుమతి కూడా సాధించింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో చౌక ధరలతో ఇళ్లు కట్టేందుకు ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీని మలచడం ఎలా అన్నదీ ఆలోచిస్తున్నామని కంపెనీ సీఈవో నికితా చెన్యుయతాయి చెప్పారు. దుబాయి మున్సిపాలిటీ కోసం కట్టిన ఈ భవనం ద్వారా తాము టెక్నాలజీపై ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నామని, వాటన్నింటిని ఉపయోగించి భవిష్యత్తులో రెట్టింపు వేగంతో ప్రాజెక్టులు పూర్తి చేయగలమని వివరించారు.

మరిన్ని వార్తలు