ముద్దంత అందం

14 Dec, 2015 00:34 IST|Sakshi
ముద్దంత అందం

నెట్‌ఇంట్లో
 
నెట్టిల్లు మహా గట్టిల్లు. ఇది అద్భుతాలు చేయగలదు.
ఒకింటి కథను ప్రపంచానికి పంచేయగలదు. ఊరూపేరూ తెలియని అమ్మాయిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేయగలదు.
 ఒక్క క్లిక్‌తో వరద బాధితులకు సాయం చేయగలదు. ఒక్క షేర్‌తో లక్షల ఇళ్లను చేరగలదు. నాలుగేళ్ల పాపకు హాలీవుడ్ స్టార్స్‌ను ఓడించేంత బలాన్నివ్వగలదు. సోషల్ మీడియా దేశాధ్యక్షుల్ని  వెక్కిరించగలదు. సామాన్యుల్ని అసామాన్యుల సరసన చేర్చగలదు. ఇదిగో ఈ కథనాలే అందుకు నిలువెత్తు నిదర్శనం.
 
ముద్దంత అందం
ఇంటర్నెట్‌లో ఏది ఎందుకు క్లిక్కవుతుందో తెలియదు. ఇక్కడ మ్యాజిక్కులే తప్ప లాజిక్కుండవు. కొన్ని విషయాలను లైక్ చేయండహో, షేర్ చేయండహో అని బతిమిలాడాల్సి వస్తుంది. కొన్ని మాత్రం సునామీల్లా వచ్చేసి వైరల్ అయిపోతుంటాయి. ఇదిగో... సరిగ్గా ఇలాంటిదే రైస్ బాల్ బేబీ. మనలాగానే వరి అన్నం తినే జపానీయులకు ఇప్పుడిదే లేటెస్ట్ ట్రెండ్. జపాన్ వంటకం ‘రైస్ బాల్’ (అన్నం ముద్ద) షేప్‌లో తమ చిన్నారుల ఫేస్ స్క్వీజ్ చేసి. ఫోటోలు తీస్తున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. దీనికోసం ఏకంగా రైస్ బాల్ బేబీ అనే హ్యాష్ ట్యాగ్ పుట్టుకొచ్చింది. కొందరైతే తమ కుక్కపిల్లల బొమ్మల్ని కూడా అన్నం ముద్ద షేప్‌లో ఫోటోలు తీసి పెట్టేస్తున్నారు. అసలిదంతా మొదలుపెట్టింది మషహిరో ఎహ్రా అనే కమేడియన్. ఆయన తన బుడ్డోడి ఫొటో పెట్టేసరికి అది 28 వేల సార్లు రీ ట్వీట్ అయింది. అదిగో అప్పుడే మొదలైంది ఈ సునామీ. ఇక జపానీయులంతా తమ తమ బుజ్జాయిల ఫొటోలను రెండు చేతులతో అదిమిపట్టి మరీ ఫోటోలు తీస్తున్నారు.
 http://www.sakshi.com/news/international/rice-ball-baby-is-the-new-trend-in-japan-297360?pfrom=home-top-story
 
 
క్లిక్ చేస్తే లక్ష చపాతీలు
లక్ష చపాతీలు చేయడానికి ఎన్ని చపాతీ మేకింగ్ మెషీన్లు కావాలి? ఎన్ని రోజులు పడుతుంది? సోషల్ మీడియా తోడుంటే లక్ష చపాతీలు క్షణాల్లో తయారవుతాయి. కావాలంటే చూడండి. కష్టాల్లో ఉన్న చెన్నైని బెంగళూరు ఆదుకోవాలనుకుంది. లక్ష చపాతీలు చేసి పంపాలనుకుంది. లక్ష చపాతీలంటే మాటలా? ఇందుకు ఐటీ రాజధాని బెంగళూరు సోషల్ మీడియా సాయం కోరింది. యువకులు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సప్‌లలో మెసేజీ పంపించారు. ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. చెన్నై వరద బాధితుల కోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్ తెరిచారు. లక్ష చేతులు ఒక్కటైతే ఇంకేముంది. మౌస్‌ని క్లిక్ చేసి మెసేజీ పంపడమే తరువాయి, లక్ష చపాతీలు తయారయ్యాయి. చేయి చేయి కలిసింది. ప్రతి ఇంట్లో కొన్ని కొన్ని చపాతీలు తయారయ్యాయి. సోషల్ మీడియా సాయంతో గంటల్లో అవన్నీ ఒక చోటకి చేరాయి. వేడి ఆరకుండానే చెన్నై చేరుకున్నాయి. వరద బాధితుల ఆకలిని తీర్చాయి. నిజం! సోషల్ మీడియా వానలో గొడుగు, వరదలో పడవ!!
 http://www.sakshi.com/news/national/1-lakh-chapatis-being-prepared-for-chennaifloods-victims-in-bengaluru-296224?pfrom=home-top-story
 
 
యూ ఆర్ బ్యూటిఫుల్
యూ ఆర్ బ్యూటిఫుల్! ఈ ఒక్క మాట చాలు అమ్మాయిల ముఖం ఎరుపెక్కడానికి. ‘‘నువ్వు అందంగా ఉన్నావు’’ అంటే ఎవరెలా రియాక్ట్ అవుతారు? కొందరు ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తారు. కొందరు నవ్వేస్తారు. ఇంకొందరు ముఖానికి చేతులు అడ్డం పెట్టేసుకుంటారు. మగాళ్ల రియాక్షన్ కూడా కొద్దిగా అటూ ఇటూగా ఇలాగే ఉంటుంది. కళ్లెగరేస్తారు. పళ్లికిలిస్తారు. షియా గ్లోవర్ అనే 18 ఏళ్ల షికాగో అమ్మాయికి ఇలాంటి రియాక్షన్లను కెమెరాలో బంధించాలన్న కోరిక పుట్టింది. ముందు నేస్తాలు, బంధువుల రియాక్షన్లను రికార్డు చేసింది. ఆ తరువాత తెలియని వాళ్ల రియాక్షన్‌ను కెమెరాలో బంధించింది. ఆ బంధించిన రియాక్షన్లను ఒక వీడియోగా చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసింది. ఇప్పటికి 7.67 లక్షల మంది చూశారు. ఏమీ తోచనప్పుడు అసంకల్పితంగా, అత్యంత సహజంగా ఇచ్చిన ఈ రియాక్షన్లను చూసి ఎంజాయ్ చెయ్యండి. అన్నట్టు.... వన్ థింగ్.... యూ ఆర్ బ్యూటిఫుల్!!
 https://www.youtube.com/watch?v=aW8BDgLpZkI
 
 
4 ఏళ్లు, 16 కోట్ల అభిమానులు
ఈ అమ్మాయి మినీ బియాన్స్. స్టెప్పేస్తే అదిరిపోతుంది. ‘వాచ్ మీ’ అన్న పాటకు న్యూయార్క్ వీధుల్లో ఈ బుజ్జాయి వేసిన స్టెప్స్‌కి యూట్యూబ్ దద్దరిల్లిపోతోంది. ఇప్పటికి ఈ బుడత చేసిన డాన్సుని ఏకంగా 16.6 కోట్ల మంది చూసేశారు. ఇంకా కామెంట్ల వరద పారుతోంది. లియాం నీసన్ వంటి సుప్రసిద్ధ హాలీవుడ్ స్టార్ వీడియో గేమ్‌ను సైతం వెనక్కి నెట్టేసి మరీ ఈ బుడత డాన్స్‌వీడియో పైకి వచ్చేసింది. ఈ అమ్మాయి పేరు హెవెన్ కింగ్ అట. వాళ్ల అమ్మే ఈ అమ్మాయి డాన్స్ టీచర్ అట. అమెరికన్ యాక్ట్రెస్ బియాన్స్ తరహాలో నడుం ఊపి అదరగొట్టేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ వీక్షకులు అత్యధికంగా చూసిన వీడియో ఇదేనని యూట్యూబ్ స్వయంగా ప్రకటించింది. ఈ అమ్మాయి వీడియోలన్నీ మోస్ట్ వాచ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. ఇంతా చేసి యూట్యూబ్ కిరీటాన్ని కొట్టేసిన ఈ అమ్మాయి వయసెంత అనుకుంటున్నారు? జస్ట్ నాలుగేళ్లే!!
 http://www.dailymail.co.uk/femail/article-3057509/Four-year-old-mini-Beyonc-famous-dynamic-dance-skills-shows-incredible-talent-colorful-new-music-video.htm
 
 
టైమ్ బాంబ్ పేలిందే పిల్లా నా గుండెలోన

అతనో సెలబ్రిటీ. నే పాడితే లోకమే ఆడదా అన్నంత పాపులారిటీ ఉన్న కుర్ర సింగర్. ఆఫర్లకూ అంతులేదు. అలాంటి జస్టిన్ బీబర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కుర్రదాని ఫొటో చూశాడు. కళ్లు తిప్పుకోలేకపోయాడు.  ఫిదా అయిపోయాడు. టైమ్ బాంబ్ పేలిందే పిల్లా నా గుండెలోన అని డిసైడ్ చేసేశాడు. ఓ మై గాడ్! ఎవరీమె అన్న కామెంట్‌ని పోస్ట్ చేశాడు. అంతే! బీబర్ అభిమానులంతా అంతర్జాలంలో గాలం వేసి మరీ అమ్మాయి కోసం వెదుకులాట మొదలుపెట్టారు. ప్రపంచం ఆమెపై ఫోకస్ చేసింది. నేనే ఆ అమ్మాయినంటూ నకిలీల గోల కూడా మొదలైంది. సిండీ కింబర్లీ పేరుతో ట్విట్టర్‌లో ఓ అమ్మాయి ఉంటుందని, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో సెల్ఫీ పెడుతుందని అభిమానులు ఆరా తీసి కనుక్కొన్నారు. అంతలో అసలు అమ్మాయి  17  ఏళ్ల సిండీ ‘నేనే ఆ అమ్మాయిని’ అంటూ బయటకు వచ్చింది. ఇంతమంది తన గురించి ఆరా తీయడంతో ఆమె ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతోంది. ఏం చేయాలో తెలియడం లేదని చెప్పుకుని మురిసిపోతోంది. బీబర్‌నే ఫిదా చేసిన అమ్మాయిగా ఆమె ఇప్పుడు నెట్టింట్లో మార్మోగిపోతోంది. ఒక్క ఫోటో జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో!
 http://www.dailymail.co.uk/tvshowbiz/article-3350283/Justin-Bieber-asks-fans-help-identity-Instagram-beauty-jets-Canada-London-gig.html
 

>
మరిన్ని వార్తలు