పొగ... సెగ! 

28 May, 2020 00:27 IST|Sakshi

ఈనెల 31న యాంటీ టొబాకో డే

పొగాకు వల్ల జరిగే నష్టాన్ని తల వెంట్రుకల దగ్గర్నుంచి మొదలుపెట్టి... కాలి వేలి చివరి వరకు తెలుసుకుంటూ వెళ్దాం రండి

పొగాకుకు వేయి రూపాలు... సిగరెట్, సిగార్, జర్దా, ఖైనీ, పాన్‌మసాలా, ముక్కుపొడుం... ఇంకా ఎన్నో. పొగ ఊపిరి సలపనివ్వదు... తట్టుకోలేం. సెగ మంటపుట్టిస్తుంది... భరించలేం. అయినా పొగ... సెగ... రెంటినీ కలిపి ఆస్వాదిస్తారు కొందరు. గుట్కా ప్రాణాల్ని గుటుక్కుమనిపించేస్తుందని తెలిసినా విచక్షణారహితంగా విషాస్వాదన చేస్తుంటారు మరికొందరు. టొబాకో అన్నది తలవెంట్రుక నుంచి కాలి వేలి చివరి వరకు ఎన్నెన్ని అనర్థాలు తెచ్చిపెడుతుందో అర్థం చేసుకుని... తంబాకు ఏరూపంలో ఉన్నప్పటికీ... అది మనకు మనం ఎక్కుపెట్టుకున్న బందూకు అని తెలుసుకుని దూరంగా మసలుకోవడానికే ఈ కథనం.

జీర్ణవ్యవస్థ– పొట్ట 
అలా ఛాతీ నుంచి కిందికి దిగితే... పొగ తాగడం వల్ల కాలేయం నుంచి పెద్దపేగు మొదలుకొని, మలద్వారం వరకు క్యాన్సర్‌ రిస్క్‌ ఉండనే ఉంటుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించి ∙ఈసోఫేజియల్‌ క్యాన్సర్‌ ∙పెద్దపేగు క్యాన్సర్‌ lమలద్వార క్యాన్సర్‌... అంటే కొలనోరెక్టల్‌ క్యాన్సర్‌ల వరకు పొగాకు ఒక ప్రధాన కారణం.

సిగరెట్‌ జుట్టు పట్టేసి లాగేస్తుందంటే నమ్ముతారా? 
మీరు తాగే సిగరెట్టులోని విషాలు మీ జుట్టును పలచబార్చి త్వరగా రాలిపోయేలా చేస్తాయంటే నమ్ముతారా? ఇది నిజం... పొగతాగడం వల్ల వెంట్రుకలను పట్టి ఉంచే హెయిర్‌ ఫాలికిల్స్‌ బలహీనమవుతాయి. పొగాకులోని విషపదార్థాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచే హార్మోన్లను దెబ్బతీస్తాయి. సంబంధిత డీఎన్‌ఏను బలహీనపరుస్తాయి.  హెయిర్‌ ఫాలికిల్‌ నుంచి వెంట్రుకకు జరిగే రక్తసరఫరా దెబ్బతింటుంది. అంతే... పొగతాగేవారిలో వెంట్రుకల జీవిత చక్రం (సైకిల్‌) పూర్తి కాకుండానే అవి రాలిపోతుంటాయి. విషాల కారణంగా అవి త్వరగా తెల్లబడతాయి. ఈ వివరాలన్నీ చాలా ఎపిడిమియలాజికల్‌ అధ్యయనాల్లో నిరూపితమయ్యాయి. అంతేకాదు... ఆ వివరాలు బీఎంజే లాంటి ప్రముఖ మెడికల్‌ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి కూడా.

పొగాకుతో... మె‘దడదడ’! 
సిగరెట్‌ పొగ పీల్చీపీల్చగానే... ఐదు సెకండ్లలోనే అందులోని నికోటిన్‌ మెదడును చేరి, హుషారును కలిగించే భావనను కలగజేస్తుంది. ఈ తాత్కాలిక భ్రాంతిభావన కోసమే సిగరెట్‌కు బానిసలవుతారు. పొగ వల్ల నేర్చుకునే సామర్థ్యాలు, అర్థం చేసుకునే శక్తి మందగిస్తాయి. మతిమరపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మెదడులోని రక్తనాళాలు సన్నబారి, రక్తప్రసరణ తగ్గి చిట్లిపోవడం, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరగడం జరుగుతుంది.

కళ్ల కాంతి తరుగు... క్యాటరాక్ట్‌ పెరుగు!  
కళ్లలోని లెన్స్‌లు పారదర్శకంగా ఉంటేనే మనకు చూపు బాగుంటుంది. కానీ పొగ కారణంగా లెన్స్‌ పారదర్శకత కోల్పోయి... చాలా త్వరగా ‘క్యాటరాక్ట్‌’ సమస్య వస్తుంది. పొగతాగడం వల్ల ‘మాక్యులార్‌ డీజనరేషన్‌’ అనే వ్యాధి వచ్చి రెటీనాపై బ్లైండ్‌స్పాట్స్‌ ఏర్పడతాయి. మామూలుగా ఈ సమస్యలు వయసు పెరగడం వల్ల వస్తాయి. కానీ పొగతాగే అలవాటు వల్ల చాలా త్వరగా వచ్చేందుకు అవకాశాలెక్కువ.

ముక్కు... పొగాకు దాని శక్తిని అణగదొక్కు! 
వాసనను గ్రహించే జ్ఞానేంద్రియ శక్తి ముక్కు సొంతం. అతి సంక్లిష్టమైన ఆ యంత్రాంగం పొగాకు కారణంగా దెబ్బతింటుంది. అందుకే పొగతాగేవారు అన్ని వాసనలనూ సరిగా గ్రహించలేరు. ముక్కులోంచి తలకు కనెక్ట్‌ అయి ఉండే గాలి గదులైన సైనస్‌లు కూడా దెబ్బతింటాయి. అంతేనా గాలి పీల్చినప్పుడు ముక్కులోకి వచ్చే కొన్ని హానికర బ్యాక్టీరియానూ, క్రిములనూ ముక్కు నిరోధిస్తూ ఉంటుంది. పొగతాగేవారిలో ముక్కుకు ఆ శక్తి తగ్గడం వల్ల తేలిగ్గా జబ్బుపడతారు.

నోరు దెబ్బతినే తీరు!  
సిగరెట్, బీడీ, చుట్ట తాగినా... బుగ్గన గుట్కా పెట్టినా అది జరిగేది నోటి ద్వారానే. దాంతో పొగాకు నేరుగా దుష్ప్రభావం చూపేది నోటిపైనే. అందుకే నోరు చాలారకాలుగా ప్రభావితమవుతుంది. ఉదాహరణకు...
► మొదటి దుష్పరిణామం నోటి దుర్వాసన (హ్యాలిటోసిస్‌).
► పళ్లు పసుపుపచ్చగా మారతాయి. చిగుర్లపై కూడా మచ్చలు (స్మోకర్స్‌ మెలనోసిస్‌) రావచ్చు.
► నోట్లో ‘ల్యూకోప్లేకియా’ అనే పుండ్లు ఏర్పడి, అవి క్యాన్సర్‌గా మారవచ్చు.
► పంటి చిగుర్లు దెబ్బతిని చిగుర్ల వ్యాధులు వస్తాయి.
► నాలుకపై ఉండే అతి చిన్నచిన్న బుడిపెలపై బ్యాక్టీరియా, ఈస్ట్, నోటిలోని వ్యర్థాలు చిక్కుకుపోవడంతో నాలుక నల్లగా మారే ‘బ్లాక్‌ హెయిరీ టంగ్‌’ అనే కండిషన్‌కు దారితీయవచ్చు.
► నోటిలో ఉండే పైభాగమైన అంగిలి మృదుత్వాన్ని కోల్పోయి, పాలిపోయినట్లుగా తెల్లగా మారిపోయి ‘స్మోకర్స్‌ ప్యాలెట్‌’ అనే కండిషన్‌కు దారితీయవ.
► నోటిలో ఉండే లాలాజల గ్రంథులు దెబ్బతినవచ్చు.

మగతనాన్నిదెబ్బతీసే పొగ! 
పొగతాగే అలవాటు రక్తనాళాలను సన్నబరుస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఆ అలవాటు ఉన్న చాలామందిలో రక్తనాళాలు సన్నబారడం అనే ప్రక్రియ పురుషాంగంలో జరగడం కూడా సాధారణమే. దాంతో పురుషాంగంలోకి రక్తం చేరడం సన్నగిల్లి అంగస్తంభన సమస్యలు (ఎలకై్టల్‌ డిస్‌ఫంక్షన్‌) వస్తాయి. అంతేకాదు... పొగతాగే వారిలో వీర్యకణాల కదలికలు, వీర్యం నాణ్యత తగ్గిపోతాయి. దాంతో పిల్లలు పుట్టే అవకాశాలూ తగ్గుతాయి.

చెవులు పట్టి ఆడించే పొగాకు... వినికిడి సమస్యలతో ఇంకెంతో చికాకు!  
సిగరెట్‌పొగలో నికోటిన్‌తో పాటు ఫార్మాల్డిహైడ్, ఆర్సినిక్, వినైల్‌ క్లోరైడ్, అమోనియా అనే విషపదార్థాలుంటాయి. ఇవి చెవికి కూడా విషాలే కావడం వల్ల వాటిని ‘ఒటో టాక్సిక్‌’గా పరిగణిస్తారు. వాటివల్ల వినికిడి శక్తి లోపించి, చెవుడు వచ్చే అవకాశాలెక్కువ. అంతేకాదు... మనను బ్యాలెన్స్‌గా నిలిపి ఉంచే యంత్రాంగమంతా చెవిలోనే ఉంటుంది. అది దెబ్బతింటే నిటారుగా నిలబడలేం కూడా. చెవిలో ఎప్పుడూ గుయ్‌ అనే శబ్దం కలిగించే ‘టినైటిస్‌’ అనే జబ్బొకటుంది. పొగాకు కారణంగా ఆ జబ్బు వచ్చే అవకాశాలెక్కువ.

గొంతు... క్యాన్సర్‌లకు దారితీసే ఓ కూడలి! 
పొగ తాగడం వల్ల నోటి తర్వాత ఆ వెంటనే ప్రభావితమయ్యేది గొంతే. తొలుత ప్రభావితమైనందువల్లనే పొగతాగడం వల్ల గొంతు క్యాన్సర్స్‌ (హెడ్‌ అండ్‌ నెక్‌ క్యాన్సర్‌లు కూడా) చాలా ఎక్కువ. పొగపీల్చగానే అందులోని ఫార్మాల్డిహైడ్, ఆక్రోలీన్‌ రసాయనాలు గొంతును మండిస్తాయి. పొగతాగేవారిలో స్వరం మారిపోయి బొంగురుగా రావడం, లోగొంతుకతో మాట్లాడుతున్నట్లు అనిపించడం చాలా సాధారణం. లారింగ్స్‌ దెబ్బతిని లారింజైటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీసే పరిస్థితులూ ఎక్కువే.

ఊపిరందక ఉక్కిరిబిక్కిరి! 
పొగాకు కారణంగా అత్యంత ఎక్కువగా దెబ్బతినేది ఊపిరితిత్తులే. స్మోకింగ్‌ కారణంగా క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మునరీ డిసీజ్, బ్రాంకైటిస్‌ అనే వ్యాధులు వచ్చి... ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. వీళ్లలో లంగ్స్‌ సామర్థ్యం క్రమంగా తగ్గుతూ పోయి... ఒకనాటికి ఒక్క అడుగు వేయాలన్నా ఆయాసపడే స్థితికి చేరువవుతారు. సిగరెట్‌ కారణంగా లంగ్‌ క్యాన్సర్‌తో మరణించే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అన్నది అందరికీ తెలిసిందే.

గుండెమండించే సెగ...  గుండెపోటు తెప్పించే పొగ! 
పొగతాగే అలవాటు గుండెనూ, రక్తప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేసి, తీవ్రంగా దెబ్బతీస్తుంది. గుండెపోటుకు పొగతాగే అలవాటే ప్రధాన కారణం. పొగ తాగే అలవాటు వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలెక్కువ. ఫలితంగా క్లాట్స్‌ ఏర్పడి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లోని అడ్డంకుల వల్ల గుండెకు తగిన ఆక్సిజన్‌ అందదు. దాంతో గుండె కండరం శాశ్వతంగా చచ్చుబడిపోతుంది. ఇలా పొగతాగేవారిలో చాలామందికి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా కన్నుమూస్తుంటారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు సన్నబడటం వల్ల హార్ట్‌ ఫెయిల్యూర్‌ అవకాశాలూ ఎక్కువే. రక్తనాళాలు సన్నబారడం వల్ల రక్తం మరింత వేగం పుంజుకుని రక్తపోటు పెరుగుతుంది. ఈ హైబీపీతో శరీరంలోని ఏ కీలకమైన అవయవమైనా దెబ్బతిని, పక్షవాతానికీ, మరణానికీ కారణం కావచ్చు.

పొగచూరిపోయే ఎముకలూ...  బలహీనపడే కాళ్లు! 
ఎముకలు పటిష్టంగానూ, బలంగానూ ఉండాలంటే వాటికి క్యాల్షియం ఎక్కువగా అందాలి. కానీ రక్తప్రసరణ వ్యవస్థలో క్లాట్స్‌ వంటి అనేక కారణాల వల్ల ఎముకలకు అందాల్సిన పోషకాలు క్రమంగా తగ్గుతూ పోతాయి. దాంతో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఫలితంగా అవి పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోతాయి.

పొగతో మొద్దుబారే పాదాలూ...  కాలివేళ్ల చివర్లు
స్మోకింగ్‌ చేసేవారిలో రక్తనాళాలు సన్నబడితే పాదాలకూ, కాలి వేళ్ల చివర్ల వరకూ రక్తం అందే అవకాశాలు తగ్గుతాయి. డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇలాంటి పరిణామాలు ఎక్కువ. డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి పొగతాగే అలవాటుంటే ఈ రిస్క్‌ మరీ ఎక్కువ. దీన్ని పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌ అని అంటారు. ఇక పొగతాగేవాళ్లలోనైతే పెరిఫెరల్‌ వాస్క్యులార్‌ డిసీజ్‌ అన్నది కేవలం ఆ అలవాటు కారణంగానే రావచ్చు. అలాంటి సమస్యను బర్జర్స్‌ డిసీజ్‌ అంటారు.  పొగతాగే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాలు సన్నబడ్డా, కాళ్లలో, కాలివేళ్ల చివర్లలోగానీ క్లాట్స్‌ ఏర్పడ్డా... పాదం, కాలివేళ్ల చివర్లు స్పర్శ కోల్పోయి, అవి కుళ్లిపోవడం మొదలవుతుంది. ఈ కండిషన్‌ను గ్యాంగ్రీన్‌ అంటారు. ఈ రక్తపు గడ్డలు కాళ్లకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏర్పడితే కాళ్లూ చచ్చుబడిపోయే ప్రమాదం ఉంది. వేళ్లు కుళ్లిపోయే రిస్క్‌ ఉంటుంది.

మరిన్ని వార్తలు