విప్లవంలో అస్తిత్వాల అన్వేషణ

3 Feb, 2020 01:16 IST|Sakshi

ఎందుకు రాశానంటే... 

కథలు రాయడానికి తక్షణ ప్రేరణ స్వీయానుభవమే కావచ్చు. కానీ వ్యక్తుల, సమూహాల అనుభవంలోకి రాని వాస్తవికత ఎంతో ఉంటుంది. దాన్ని సొంతం చేసుకొని కాల్పనీకరించడమే సాహిత్యానికి ఉండే సామాజిక లక్ష్యం. నా వరకైతే– అనుభవాల సొద అయిపోయాక, కంటికి కనిపించే వాటి వెనుక ఉండే తార్కిక పరిణామాలను, పర్యవసానాలను విశ్లేషిస్తూ వ్యాసాలు రాసేశాక, ప్రసంగాలు చేశాక ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదా అనే అన్వేషణే కథా రచన. ఎప్పటి నుంచో కథలు రాస్తూ ఉన్నా ఇలా అనిపించే క్రమంలో రాసిన కథలు నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేశాయి. ఇందులో కొన్ని రాశాక, నేను అంతకుముందులా లేనని అనిపించేది. నా చుట్టూ ఉన్న వాస్తవికతను కాల్పనికంగా అందుకొనే క్రమంలో నా స్వభావం కూడా మార్పునకు లోనైంది. ఇది గమనించాకే ఈ కథలను పుస్తకంగా తేవచ్చనే నమ్మకం కలిగింది.

స్వీయానుభవ పరిధిని అధిగమించడమే దీనికి కారణం అనుకుంటా. వాస్తవికతను చేరుకోడానికి ఇతర ప్రక్రియల కంటే కథా రచన నాకు చూపిన దారి చాలా థ్రిల్‌ అనిపిస్తుంది. ఇది చాలా జ్ఞానాన్ని ఇచ్చింది. దేన్నయినా కొంచెం పైనుంచి, లోపలి నుంచి విమర్శనాత్మకంగా చూసే దృష్టిని ఇచ్చింది. కార్యకర్తగా ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ఇది రోజూ నాకు అనుభవంలోకి వస్తుంటుంది. ఇదంతా కథతో నా అనుబంధం మాత్రమే కాదు. కథ నిర్వహించే సామాజిక పాత్ర ఇదే అని నా నమ్మకం. ఈ కథల్లోని మల్టీ లేయర్స్, మల్టీ ఫోకస్‌ పాయింట్స్‌ మధ్య అంతస్సూత్రం నేరేడు రంగు పిల్లవాడే. అతను వ్యక్తి కాదు. జ్ఞాపకం కాదు. విప్లవోద్యమ చైతన్యం. అనేక కారణాల వల్ల వ్యక్తిగా నాకుండే అనుభవ పరిధిని అధిగమించి విశాలమైన వాస్తవికతను నాలో భాగం చేసింది అదే. కాబట్టి ఈ కథల్లోని శిల్ప ప్రత్యేకత వేరే ఏమో కాదు. అది నా దృక్పథమే.

ఈ కథలు సుమారుగా ఈ విడత రాయలసీమ ఆందోళన మొదలయ్యాక రాసినవే. అస్తిత్వాల గురించి ఆలోచించడానికి అస్తిత్వవాదాలు తప్పనిసరేం కాదు. విప్లవాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే అందులో అస్తిత్వాలు ఎలా కనిపిస్తాయి? అనే కాల్పనిక అన్వేషణే ఈ కథలు. విప్లవం గురించిన నా సకల ఉద్వేగాలతో, ఎరుకతో రాయలసీమ అస్తిత్వాన్ని కూడా సొంతం చేసుకొన్నానని ఇప్పుడనిపిస్తోంది.


-పాణి

నేరేడురంగు పిల్లవాడు (కథలు)
రచన: పాణి; పేజీలు: 160; వెల: 150
ప్రచురణ: విప్లవ రచయితల సంఘం; ప్రతులకు: రచయిత, 87/106, శ్రీ లక్ష్మీనగర్, బి–క్యాంప్, కర్నూల్‌–518002. ఫోన్‌: 9866129458 

మరిన్ని వార్తలు