నవల రాయడం పెళ్లి లాంటిది

7 Jan, 2019 01:23 IST|Sakshi
ఏమస్‌ ఓజ్‌

గ్రేట్‌ రైటర్‌

హీబ్రూ నుంచి అత్యధికంగా అనువాదమైన రచయితల్లో మొదట చెప్పగలిగే పేరు ఏమస్‌ ఓజ్‌. ఇజ్రాయెల్‌కు వలస వచ్చిన లేదా మూలాలను వెతుక్కుంటూ తిరిగి వచ్చిన యూదు తల్లిదండ్రులకు 1939లో జన్మించాడు. అతడి పన్నెండో ఏట తల్లి డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మీద ఒక తిరుగుబాటుగా సామూహిక వ్యవసాయ క్షేత్రాలైన కిబుట్స్‌కు వెళ్లిపోయాడు. అక్కడే జీవితంలో చాలాభాగం గడిపాడు. ఓజ్‌ అంటే స్ట్రెంత్‌. తన బలం రాయడంలో ఉందని గ్రహించిన తర్వాత రాయడాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. నవలలు, కథలు, వ్యాసాలు విరివిగా రాశాడు.

కవిత రాయడమంటే ఎఫైర్‌– వన్‌ నైట్‌ స్టాండ్‌ లాంటిదనీ, కథ రాయడం రొమాన్స్‌– ఒక బంధం, కానీ నవల రాయడమంటే పెళ్లి చేసుకోవడం– దానికోసం త్యాగాలు చేయాలి, రాజీ పడాలీ అంటాడు. తనతో తాను నూటికి నూరు శాతం ఏకీభవించే అంశాలైతే, అలా అరుదుగా జరిగినప్పటికీ, వాటిని వ్యాసాలుగా రాస్తాననీ; ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయదలిచినప్పుడు కథకుగానీ నవలకుగానీ పూనుకుంటాననీ చెబుతాడు. అలాగని రచయితేమీ దేవుడు కాదు, ఎలాగైనా పాత్రల్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ పోవడానికి; ఒకసారంటూ వాటికి ప్రాణం పోశాక వాటిని రచయితైనా నిలువరించలేడని చెబుతాడు.

ఇజ్రాయెల్‌లో జన్మించినవాడిగా వాస్తవం నుంచి పారిపోలేననీ, ఒక అన్యాయం పట్ల తిరుగుబాటుగా తాను రాస్తాననీ అంటాడు. తక్కువ విస్తృతి ఉన్నప్పటికీ హీబ్రూలోనే రాయడానికి కారణం, అది తాను నవ్వే, శపించే, కలలుగనే భాష కాబట్టి, అంటాడు. ఒకవేళ దేశం వదిలి పెట్టాల్సివచ్చినా భాషను వదులుకోనని చెబుతాడు. ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంగా చూస్తాడు. అదే ట్రాజెడీ అనీ, ఇద్దరూ భూమిని పంచుకుని పరస్పరం సహకరించుకోవడం మినహా మార్గం లేదనీ చెబుతాడు. పీస్‌ నౌ మూవ్‌మెంట్‌ ఆద్యుల్లో ఒకడైన ఏమస్‌ ఓజ్‌ మొన్న 2018 డిసెంబర్‌ 28న మరణించాడు. 

మరిన్ని వార్తలు